ఉద్యోగుల విషయంలో టీసీఎస్‌ తప్పు తెలుసుకుందా? | Sakshi
Sakshi News home page

TCS: ఉద్యోగుల విషయంలో టీసీఎస్‌ తప్పు తెలుసుకుందా? నెక్స్ట్‌ ప్లాన్‌ ఏంటి?

Published Fri, Feb 23 2024 4:07 PM

TCS chief says company plans to increase headcount - Sakshi

TCS plans to increase headcount : ఐటీ పరిశ్రమలో లేఆఫ్‌లు నిత్య కృత్యమైన ప్రస్తుత తరుణంలో చాలా కంపెనీలు నియామకాల జోలికే వెళ్లడం లేదు. ఈ క్రమంలో దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఆశ్చర్యకరమైన ప్రణాళికను బయటపెట్టింది. గతేడాది టీసీఎస్‌ సైతం గణనీయమైన తొలగింపులు చేపట్టింది. రానున్న రోజుల్లో మరిన్ని తొలగింపులు ఉంటాయని భావిస్తుండగా ఇందుకు విరుద్ధంగా తమ శ్రామిక శక్తిని పెంచుకోవాలనే ఉద్దేశాన్ని టీసీఎస్‌  ప్రకటించింది. 

కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కేకే కృతివాసన్‌ నాస్కామ్ సెషన్‌లో టీసీఎస్‌ నియామకాల లక్ష్యాల గురించి మాట్లాడారు. రిక్రూట్‌మెంట్ ప్రయత్నాలను తగ్గించే ప్రణాళికలేవీ లేవని స్పష్టం చేశారు. కీలక మార్కెట్ల నుంచి డిమాండ్ మందగించడంతో సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగాల నియామకాలు తగ్గుతాయని పరిశ్రమ నివేదికలు సూచిస్తున్న తరుణంలో ఇందుకు విరుద్ధంగా టీసీఎస్‌ నుంచి ఈ ప్రకటన వచ్చింది. ముఖ్యంగా 2023లో టీసీఎస్‌ వేలాది మంది ఉద్యోగులను తొలగించింది. లైవ్‌మింట్ నివేదిక ప్రకారం.. గత సంవత్సరంలో 10,818 మంది ఉద్యోగులను టీసీఎస్‌ తొలగించింది.

నియామక ధోరణుల గురించి ఆందోళనలను ప్రస్తావిస్తూ.. " ఇప్పటికే ఆర్థిక వ్యవస్థలో కొన్ని సానుకూలతలు చూస్తున్నాం. మాకు మరింత మంది సిబ్బంది అవసరం ఉంది" అని కృతివాసన్‌ పేర్కొన్నారు. నియామక ప్రక్రియలో సర్దుబాట్లు చేసినప్పటికీ, రిక్రూట్‌మెంట్ కార్యక్రమాలలో ఎలాంటి తగ్గింపు ఉండదని సూచిస్తూ కంపెనీ నియామక ఎజెండా పట్ల టీసీఎస్‌ నిబద్ధతను ఆయన స్పష్టం చేశారు.

 

6 లక్షల మందికిపైగా ఉద్యోగులున్న టీసీఎస్‌.. మార్కెట్‌లో సవాళ్లు ప్రబలంగా ఉన్నప్పటికీ దాని మధ్యస్థ, దీర్ఘకాలిక అవకాశాల గురించి ఆశాజనకంగా ఉందని పీటీఐ నివేదించింది. ఇటీవలి త్రైమాసిక ఫలితాలలో టీసీఎస్‌ నికర లాభంలో 8.2 శాతం వృద్ధిని సాధించింది.

టీసీఎస్‌ నియామక ప్రణాళికలతోపాటు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానంపై కంపెనీ వైఖరిని సైతం కృతివాసన్‌ ప్రస్తావించారు. సంస్థాగత సంస్కృతి, విలువలను మెరుగుపరచడానికి రిమోట్ వర్క్ లేదా హైబ్రిడ్ మోడల్‌లు సరైనవి కాదన్నారు. వ్యక్తిగత సహకారం, అభ్యాసం ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు. సహోద్యోగులను, సీనియర్లను గమనిస్తూ విలువైన పాఠాలు కార్యాలయ వాతావరణంలో ఉత్తమంగా నేర్చుకోవచ్చని సూచించారు.

Advertisement
 
Advertisement