రిక్కీ పాంటింగ్- జై షా
టీమిండియా కొత్త హెడ్ కోచ్ విషయంలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి జై షా కొట్టిపారేశారు. ఈ బాధ్యతలు స్వీకరించాల్సిందిగా తాము ఇంత వరకు ఎవరినీ సంప్రదించలేదని స్పష్టం చేశారు.
కాగా టీ20 ప్రపంచకప్-2024 తర్వాత రాహుల్ ద్రవిడ్ భారత జట్టు ప్రధాన కోచ్‌గా పదవీ కాలం ముగియనుంది. ఈ క్రమంలో ఇప్పటికే బీసీసీఐ అతడి వారసుడిని ఎంపిక చేసే క్రమంలో దరఖాస్తులు ఆహ్వానించింది. విదేశీ కోచ్‌ల పేర్లను కూడా పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది.
హెడ్ కోచ్ రేసులో
ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు రిక్కీ పాంటింగ్, జస్టిన్ లాంగర్ సహా న్యూజిలాండ్ మాజీ ఆటగాడు స్టీఫెన్ ఫ్లెమింగ్, శ్రీలంక లెజెండ్ మహేళ జయవర్ధనే తదితరుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలో రిక్కీ పాంటింగ్ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. బీసీసీఐ తనకు ఆఫర్ ఇచ్చినా తిరస్కరించానని పేర్కొన్నాడు. మరోవైపు.. జస్టిన్ లాంగర్ సైతం కేఎల్ రాహుల్ తన కళ్లు తెరిపించాడంటూ టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం తాను అప్లై చేసుకోనని పరోక్షంగా వెల్లడించాడు.
వాళ్లకు మేమే ఆఫర్ ఇవ్వలేదు
రిక్కీ పాంటింగ్, జస్టిన్ లాంగర్ వ్యాఖ్యలపై బీసీసీఐ కార్యదర్శి జై షా తాజాగా స్పందించారు. ‘‘టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం నేను గానీ, బీసీసీఐ గానీ ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లెవరికీ ఆఫర్ చేయలేదు.
మీడియా వస్తున్న వార్తలన్నీ నిజం కాదు. జాతీయ జట్టు కోసం సరైన కోచ్‌ను ఎంపిక చేసుకోవడం క్లిష్టతరమైన ప్రక్రియ. భారత క్రికెట్ స్వరూపాన్ని చక్కగా అర్థం చేసుకోగల వ్యక్తుల కోసం అన్వేషిస్తున్నాం.
పూర్తి అవగాహన ఉన్నవాళ్లకే ప్రాధాన్యం
టీమిండియా హెడ్ కోచ్‌గా ఉన్నవారికి భారత దేశవాళీ క్రికెట్ గురించి, ఆటగాళ్ల గురించి పూర్తి అవగాహన ఉండాలి. అలాంటి వాళ్ల కోసమే మేము ఎదురుచూస్తున్నాం.
భారత జట్టు ప్రధాన కోచ్‌గా ఉండటం కంటే అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రతిష్టాత్మకమైన పదవి ఇంకోటి ఉంటుందని అనుకోను. ప్రపంచవ్యాప్తంగా టీమిండియాకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. భారత క్రికెట్ చరిత్ర, ఔన్నత్యం.. ఆట పట్ల మా అంకితభావం.. అన్నీ వెరసి ప్రపంచంలోనే అత్యుత్తమ స్థాయిలో ఉన్నాం.
ఇలాంటి చోట జాబ్ చేయడం కంటే గొప్ప విషయం ఏముంటుంది?. ఇలాంటి జట్టుకు గురువుగా బాధ్యతలు నిర్వర్తించే సరైన వ్యక్తి కోసం మేము జల్లెడపట్టాల్సి ఉంటుంది’’ అని జై షా ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో వ్యాఖ్యానించారు.
చదవండి: SRH vs RR: అతడి మీదే భారం.. అలా అయితేనే సన్‌రైజర్స్ ముందుకు
Comments
Please login to add a commentAdd a comment