టెక్ పరిశ్రమలో ఎటు చూసినా జనరేటివ్ ఏఐ ప్రభంజనం.. అంతటా లేఆఫ్‌ల భయంతో ఐటీ ఉద్యోగులు హడలెత్తిపోతున్నారు. అయితే ఇన్ఫోసిస్‌లో మాత్రం ఆ ముప్పు లేదంటున్నారు సంస్థ సీఈవో సలీల్ పరేఖ్. జెన్‌ఏఐ కారణంగా పరిశ్రమలోని ఇతరుల మాదిరిగా తాము ఉద్యోగాలను తగ్గించబోమని సీఎన్‌బీసీ-టీవీ18 ఇంటర్వ్యూలో చెప్పారు.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విస్తృతితో ఇన్ఫోసిస్ ఉద్యోగులను తొలగిస్తోందా అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. "లేదు, మేము అలా చేయడం లేదు. నిజానికి ఇండస్ట్రీలో ఇతరులు అలా చేశారు. ఆ విధానం సరికాదని మేం చాలా స్పష్టంగా చెప్పాం' అని పేర్కొన్నారు. పెద్ద సంస్థలకు అన్ని సాంకేతికతలు కలిసి వస్తాయనేది తన అభిప్రాయమని ఆయన వివరించారు. వచ్చే కొన్నేళ్లలో కృత్రిమ మేధ (ఏఐ)లో నిపుణులుగా ఎదిగే వారు మరింత మంది తమతో చేరుతారని, ప్రపంచంలోని పెద్ద సంస్థలకు సేవలు అందిస్తామని చెప్పారు. రానున్న రోజుల్లో క్లయింట్ల పరంగా, ఉద్యోగుల సంఖ్య పరంగా మరింత విస్తరిస్తామని పరేఖ్ తెలిపారు.
మరి నియామకాలు?
లేఆఫ్‌ల విషయాన్ని పక్కన పెడితే 2025 ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్‌లో నియామకాల పరిస్థితి ఎలా ఉండనుంది అన్నదానిపై తన దృక్పథాన్ని పరేఖ్ తెలియజేశారు. ఆర్థిక వాతావరణం మెరుగుపడటం, డిజిటల్ పరివర్తనపై వ్యయం పెరగడం జరిగితే నియామకాలు మళ్లీ ఊపందుకుంటాయని చెప్పారు. అయితే నియామకాలపై ఎటువంటి వార్షిక లక్ష్యం లేకపోయినా ఆర్థిక వాతావరణం ఆధారంగా నియామకాలు చేపడతామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment