Infosys CEO Salil Parekh
-
హమ్మయ్య.. ఇన్ఫోసిస్‌లో ఆ ముప్పు లేదు!
టెక్ పరిశ్రమలో ఎటు చూసినా జనరేటివ్ ఏఐ ప్రభంజనం.. అంతటా లేఆఫ్‌ల భయంతో ఐటీ ఉద్యోగులు హడలెత్తిపోతున్నారు. అయితే ఇన్ఫోసిస్‌లో మాత్రం ఆ ముప్పు లేదంటున్నారు సంస్థ సీఈవో సలీల్ పరేఖ్. జెన్ఏఐ కారణంగా పరిశ్రమలోని ఇతరుల మాదిరిగా తాము ఉద్యోగాలను తగ్గించబోమని సీఎన్‌బీసీ-టీవీ18 ఇంటర్వ్యూలో చెప్పారు.ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విస్తృతితో ఇన్ఫోసిస్ ఉద్యోగులను తొలగిస్తోందా అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. "లేదు, మేము అలా చేయడం లేదు. నిజానికి ఇండస్ట్రీలో ఇతరులు అలా చేశారు. ఆ విధానం సరికాదని మేం చాలా స్పష్టంగా చెప్పాం' అని పేర్కొన్నారు. పెద్ద సంస్థలకు అన్ని సాంకేతికతలు కలిసి వస్తాయనేది తన అభిప్రాయమని ఆయన వివరించారు. వచ్చే కొన్నేళ్లలో కృత్రిమ మేధ (ఏఐ)లో నిపుణులుగా ఎదిగే వారు మరింత మంది తమతో చేరుతారని, ప్రపంచంలోని పెద్ద సంస్థలకు సేవలు అందిస్తామని చెప్పారు. రానున్న రోజుల్లో క్లయింట్ల పరంగా, ఉద్యోగుల సంఖ్య పరంగా మరింత విస్తరిస్తామని పరేఖ్ తెలిపారు.మరి నియామకాలు?లేఆఫ్‌ల విషయాన్ని పక్కన పెడితే 2025 ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్‌లో నియామకాల పరిస్థితి ఎలా ఉండనుంది అన్నదానిపై తన దృక్పథాన్ని పరేఖ్ తెలియజేశారు. ఆర్థిక వాతావరణం మెరుగుపడటం, డిజిటల్ పరివర్తనపై వ్యయం పెరగడం జరిగితే నియామకాలు మళ్లీ ఊపందుకుంటాయని చెప్పారు. అయితే నియామకాలపై ఎటువంటి వార్షిక లక్ష్యం లేకపోయినా ఆర్థిక వాతావరణం ఆధారంగా నియామకాలు చేపడతామని వివరించారు. -
కంపెనీల కొనుగోళ్లకు అనుకూల వాతావరణం
న్యూఢిల్లీ: ఇతర సంస్థల కొనుగోలు, విలీనాలకు ప్రస్తుతం అనుకూల పరిస్థితులు నెలకొన్నాయని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సీఈవో సలిల్ పరేఖ్ చెప్పారు. వ్యూహాత్మకంగా తమ సంస్థకు ఉపయోగపడేవి, తమకు అనువుగా ఉండే వాటిని దక్కించుకోవడంపై దృష్టి పెడతామని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ‘చాలా మంచి అవకాశాలు‘ కనిపిస్తున్నాయని పరేఖ్ చెప్పారు. అమెరికాలో స్థూల ఆర్థిక వాతావరణం బలహీనంగా ఉండటం, అంతర్జాతీయంగా అనిశ్చితులు నెలకొనడం వంటి పరిస్థితుల నేపథ్యంలో కొనుగోళ్లు, విలీనాల విభాగంలో ఏవైనా ఆకర్షణీయమైన అవకాశాలు ఉన్నాయా అనే ప్రశ్నకు స్పందిస్తూ ఆయన ఈ విషయాలు చెప్పారు. ఇన్ఫోసిస్ ఇటీవలే ప్రకటించిన గత ఆర్థిక సంవత్సర నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాల్లో నికర లాభం అంచనాల కన్నా తక్కువగా నమోదైంది. అమెరికా బ్యాంకింగ్ రంగంలో సంక్షోభం కారణంగా అంతర్జాతీయ క్లయింట్లు ఐటీ బడ్జెట్లను కుదించుకుంటూ ఉంటున్నందున 2024 ఆర్థిక సంవత్సర ఆదాయ వృద్ధి గైడెన్స్ 4–7 శాతానికి పరిమితం కావచ్చంటూ ఇన్ఫీ పేర్కొంది. -
ఇన్ఫోసిస్.. ఓకే
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం ఇన్ఫోసిస్ లిమిటెడ్ గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో అంచనాలకంటే దిగువన ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం వార్షికంగా 8 శాతం ఎగసింది. రూ. 6,128 కోట్లను తాకింది. త్రైమాసికవారీ(క్యూ3)గా చూస్తే ఇది 7 శాతం తక్కువకాగా.. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో రూ. 5,686 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం 16 శాతం వృద్ధితో రూ. 37,441 కోట్లకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24)లో ఆదాయం 4–7 శాతం స్థాయిలో పుంజుకోగలదని తాజా అంచనాలు(గైడెన్స్) ప్రకటించింది. వెరసి ఐటీ సేవలకు నంబర్ టూ ర్యాంకులో ఉన్న కంపెనీ 2019 తదుపరి మళ్లీ నెమ్మదించిన గైడెన్స్‌ను వెలువరించింది. ఈ ఏడాది 20–22 శాతం స్థాయిలో నిర్వహణ లాభ మార్జిన్లు సాధించే వీలున్నట్లు పేర్కొంది. పూర్తి ఏడాదికి మార్చితో ముగిసిన గతేడాదికి ఇన్ఫోసిస్ నికర లాభం 9 శాతం బలపడి రూ. 24,095 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 21 శాతం జంప్‌చేసి రూ. 1,46,767 కోట్లకు చేరింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3) ఫలితాల విడుదల సందర్భంగా కంపెనీ గతేడాది ఆదాయంలో 16–16.5 శాతం వృద్ధిని అంచనా వేసింది. వెరసి అంతక్రితం ప్రకటించిన 15–16 శాతం గైడెన్స్‌ను మెరుగుపరచింది. క్యూ4లో ఉత్తర అమెరికా నుంచి 61 శాతం ఆదాయం లభించగా.. యూరోపియన్ ప్రాంతం నుంచి 27 శాతం సమకూరింది. కాగా.. క్యూ4లో ఆర్జించిన పటిష్ట ఫ్రీక్యాష్ ఫ్లో నేపథ్యంలో తుది డివిడెండును ప్రకటించినట్లు సీఎఫ్‌వో నీలాంజన్ రాయ్ వెల్లడించారు. పూర్తి ఏడాదికి అంతక్రితం డివిడెండుతో పోలిస్తే 10 శాతం అధికంగా చెల్లించినట్లు పేర్కొన్నారు. మూలధన కేటాయింపుల పాలసీకి అనుగుణంగా మరోసారి షేర్ల బైబ్యాక్‌ను విజయవంతంగా పూర్తిచేసినట్లు తెలియజేశారు. ఫలితాల్లో హైలైట్స్... ► వాటాదారులకు షేరుకి రూ. 17.50 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది. దీంతో గతేడాదికి మొత్తం రూ. 34 డివిడెండ్ చెల్లించినట్లయ్యింది. ► క్యూ4లో 2.1 బిలియన్ డాలర్ల విలువైన డీల్స్ కుదుర్చుకుంది. క్యూ3లో 3.3 బిలియన్ డాలర్లు, క్యూ2లో 2.7 బిలియన్ డాలర్ల చొప్పున పొందింది. ► గతేడాది మొత్తం 9.8 బిలియన్ డాలర్ల విలువైన కాంట్రాక్టులు సంపాదించింది. ► ఉద్యోగ వలసల(అట్రిషన్) రేటు క్యూ3తో పో లిస్తే 24.3% నుంచి 20.9 శాతానికి దిగివచ్చింది. ► మొత్తం సిబ్బంది సంఖ్య 3,43,234కు చేరింది. గత త్రైమాసికంతో పోలిస్తే నికరంగా 3,611 మంది ఉద్యోగులు తగ్గారు. క్లయింట్ల ఆసక్తి... ‘డిజిటల్, క్లౌడ్, ఆటోమేషన్ సామర్థ్యాలపై ప్రత్యేక దృష్టితో 2022–23లో పటిష్ట పనితీరును చూపాం. పరిస్థితులు మారినప్పటికీ కంపెనీ సామర్థ్యం, చౌక వ్యయాలు, సమీకృత అవకాశాలు వంటివి క్లయింట్లను ఆకట్టు కుంటున్నాయి. ఇది భారీ డీల్స్‌కు దారి చూపుతోంది’ అని ఇన్ఫోసిస్ సీఈఓ ఎండీ సలీల్ పరేఖ్ వ్యాఖ్యానించారు. ఫలితాల నేపథ్యంలో ఇన్ఫోసిస్ షేరు ఎన్ఎస్ఈలో 3 శాతంపైగా క్షీణించి రూ. 1,389 వద్ద ముగిసింది. అక్షతకు రూ. 68 కోట్లు ఇన్ఫోసిస్ తాజాగా షేరుకి రూ. 17.5 చొప్పున డివిడెండ్ ప్రకటించింది. దీంతో కంపెనీలో 3.89 కోట్ల షేర్లుగల బ్రిటిష్ ప్రధాని రిషీ సునక్ భార్య అక్షత రూ. 68.17 కోట్లు అందుకోనున్నారు. ఇందుకు జూన్ 2 రికార్డ్ డేట్. కంపెనీ ఇప్పటికే రూ. 16.5 మధ్యంతర డివిడెండ్ చెల్లించింది. దీంతో అక్షత మొత్తం రూ. 132 కోట్లకుపైగా డివిడెండ్ అందుకోనున్నారు. గురువారం షేరు ధర రూ. 1,389(బీఎస్ఈ)తో చూస్తే ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె అక్షతకు గల వాటా విలువ రూ. 5,400 కోట్లు. కాగా.. 2021–22 ఏడాదిలోనూ డివిడెండ్ రూపేణా అక్షత ఇన్ఫోసిస్ నుంచి దాదాపు రూ. 121 కోట్లు అందుకోవడం గమనార్హం! -
పనితీరు బ్రహ్మాండం..ఐటీఆర్ ఫైలింగ్ పోర్టల్‌పై ఇన్ఫోసిస్!
బెంగళూరు: ఆదాయ పన్ను శాఖ ఈ–ఫైలింగ్ పోర్టల్, జీఎస్టీ నెట్వర్క్ వెబ్సైటు ‘చాలా బాగా’ పనిచేస్తున్నాయని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సీఈవో సలిల్ పరేఖ్ తెలిపారు. ఐటీ రిటర్నుల దాఖలు ప్రక్రియ సజావుగా జరిగిందని ఆయన చెప్పారు. జూలైలో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు నమోదు కావడం, డెడ్‌లైన్ 31 నాటికి 5.8 కోట్ల పైచిలుకు ఐటీ రిటర్నులు దాఖలు కావడం ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఇన్ఫోసిస్ ఐటీ శాఖ ఈఫైలింగ్ పోర్టల్ ప్రాజెక్ట్‌ను 2019లో ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌కు అప్పగిచ్చింది. ఈ నేపథ్యంలో గతేడాది జూన్‌లో ఈ-ఫైలింగ్ కొత్త పోర్టల్‌ను ఇన్ఫోసిస్ లాంచ్ చేసింది. నాటి నుంచి కొత్త పోర్టల్‌లో ఏదో ఒక్క సమస్య ఎదురవుతూనే ఉంది. సమస్యలపై ఫిర్యాదులు వెల్లువెత్తడం,ట్యాక్స్ రిటర్న్ గడువు తేదీలను మార్చడం పరిపాటిగా మారిందే తప్పా. ఆ పోర్టల్ పనితీరు మాత్రం మారిన దాఖలాలు లేవంటూ ట్యాక్స్ పేయర్స్, నిపుణులు ఇన్ఫోసిస్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. ఈ తరుణంలో ఐటీఆర్ ఫైలింగ్ పోర్టల్ పనితీరుపై ఇన్ఫోసిస్ సీఈవో సలిల్ పరేఖ్ స్పందించారు. చదవండి👉 ష్..కథ మళ్లీ మొదటికొచ్చింది, ఇన్ఫోసిస్ ఇదేం బాగాలేదు! -
మరో ఐదేళ్ల పాటు, ఇన్ఫోసిస్ సీఈవోగా సలీల్ పరేఖ్!
మరో 5ఏళ్ల పాటు ఇన్ఫోసిస్ ఎండీ, సీఈవోగా సీఈఓ సలీల్ పరేఖ్ కొనసాగనున్నారు. ప్రస్తుతం ఇన్ఫోసిస్ సీఈవోగా ఉన్న ఆయన పదవి కాలాన్ని కొనసాగిస్తున్నట్లు ఇన్ఫోసిస్ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఈ ఏడాది జులై 1నుంచి 2027 మార్చి 31వరకు ఆయన తన పదవిలో కొనసాగనున్నారు. ఇక ఎప్పటిలాగే ఇన్ఫోసిస్ ఎక్స్‌ప్యాండ్ స్టాక్ ఓనర్ షిప్ -2019 ప్లాన్ లో భాగంగా ఆయనకు ఇన్ఫోసిస్ షేర్లను కట్టబెట్టనుంది. ఇన్ఫోసిస్ ప్రకటన మే 21న ఇన్ఫోసిస్ బోర్డ్ ఆఫ్ డైరక్టర్స్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో నామినేషన్ అండ్ రెమ్యునరేషన్ కమిటీ(ఎన్ఆర్సీ) సభ్యులు సలీల్ పరేఖ్‌ను మళ్లీ సంస్థ సీఈవోగా ఎంపిక చేయాలని నిర్ణయించారు. దీంతో పరేఖ్ ఈ ఏడాది జులై 1,2022 నుంచి మార్చి 31,2027వరకు పదవిలో ఉంటారని ఇన్ఫోసిస్ తన రెగ్యులరేటరీ ఫైలింగ్ తెలిపింది. -
ఇన్ఫీ లాభం రూ.5,686 కోట్లు
న్యూఢిల్లీ: దేశంలో రెండో అతిపెద్ద సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (2021–22, క్యూ4)లో రూ. 5,686 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ. 5,076 కోట్లతో పోలిస్తే 12 శాతం వృద్ధి చెందింది. మొత్తం ఆదాయం 22.7 శాతం ఎగబాకి రూ.32,276 కోట్లుగా నమోదైంది. అంతక్రితం క్యూ4లో ఆదాయం రూ.26,311 కోట్లుగా ఉంది. త్రైమాసికంగా తగ్గుదల... 2021–22 క్యూ3 (అక్టోబర్–డిసెంబర్ క్వార్టర్)లో నమోదైన లాభం (రూ.5,809 కోట్లు)తో పోలిస్తే క్యూ4లో లాభం 2.1 శాతం తగ్గింది. ఇక మొత్తం ఆదాయం మాత్రం క్యూ3 (రూ.31,867 కోట్లు)తో పోలిస్తే స్వల్పంగా 1.3 శాతం పెరిగింది. పూర్తి ఏడాదికి ఇలా... 2021–22 పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫీ నికర లాభం రూ.22,110 కోట్లకు ఎగబాకింది. అంతక్రితం ఏడాది లాభం రూ.19,351 కోట్లతో పోలిస్తే 14.3 శాతం వృద్ధి చెందింది. మొత్తం ఆదాయం కూడా 21 శాతం ఎగసి రూ.1,00,472 కోట్ల నుంచి రూ.1,21,641 కోట్లకు పెరిగింది. కాగా, ప్రస్తుత 2022–23 ఆర్థిక సంవత్సరానికి ఆదాయం 13–15 శాతం వృద్ధి చెందవచ్చని ఇన్ఫీ అంచనా వేసింది. పటిష్టమైన డిమాండ్ పరిస్థితులు, భారీ స్థాయిలో దక్కించుకుంటున్న డీల్స్ ఇందుకు దోహదం చేస్తాయని కంపెనీ వెల్లడించింది. కాగా, 2021–22 ఆర్థిక సంవత్సరం ఆరంభంలో పూర్తి ఏడాది ఆదాయ అంచనాలను 12–14 శాతంగా పేర్కొన్న ఇన్ఫీ, 2022 జనవరిలో దీన్ని 19.5–20 శాతానికి పెంచడం గమనార్హం. పటిష్టమైన డిమాండ్ నేపథ్యంలో అమ్మకాలు, డెలివరీ ఇంకా నవకల్పనల్లో సామర్థ్యాలను పెంచుకోవడం కోసం తగిన దీర్ఘకాలిక పెట్టుబడులు పెడుతున్నామని ఇన్ఫోసిస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ) నిరంజన్ రాయ్ పేర్కొన్నారు. ఫలితాల్లో ఇతర ముఖ్యంశాలు... ► గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో ఇన్ఫీ దక్కించుకున్న కాంట్రాక్టుల మొత్తం విలువ (టీసీవీ) 2.3 బిలియన్ డాలర్లు. పూర్తి ఏడాదికి టీసీవీ 9.5 బిలియన్ డాలర్లుగా ఉంది. క్యూ4లో స్థూలంగా 110 కొత్త క్లయింట్లు జతయ్యారు. ► క్యూ4లో కంపెనీ నిర్వహణ మార్జిన్ 3 శాతం మేర దిగజారి 21.5 శాతానికి చేరింది. ఇక పూర్తి ఏడాదికి కూడా 3 శాతం తగ్గుదలతో 23 శాతంగా నమోదైంది. ► ఇన్ఫీ డైరెక్టర్ల బోర్డు 2021–22 ఏడాదికి గాను రూ.5 ముఖ విలువ గల ఒక్కో షేరుకు రూ.16 చొప్పున తుది డివిడెండ్‌ను సిఫార్సు చేసింది. తద్వారా పూర్తి ఏడాదికి ఇన్వెస్టర్లకు మొత్తం రూ.31 డివిడెండ్ (రూ.13,000 కోట్లు) లభించినట్లవుతుంది. 2020–21తో పోలిస్తే డివిడెండ్ 14.8 శాతం పెరిగినట్లు లెక్క. ► ప్రస్తుతం రష్యాకు చెందిన క్లయింట్లతో ఎలాంటి కాంట్రాక్టులు లేవని, రాబోయే కాలంలో కూడా సంబంధిత ప్రణాళికలు ఏవీ ఉండబోవని కంపెనీ స్పష్టం చేసింది. రష్యాలో ఉన్న నామమాత్ర వ్యాపారాన్ని తరలిస్తున్నట్లు కూడా వెల్లడించింది. ► ఈ ఏడాది కనీసం 50,000 మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు కంపెనీ తెలిపింది. గతేడాది అంచనాలను మించి 85,000 మంది ఫ్రెషర్లకు ప్రపంచవ్యాప్తంగా, భారత్‌లో ఉద్యోగాలు ఇచ్చినట్లు వెల్లడించింది. కాగా, 2022 మార్చి 31 నాటికి కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,14,015కు చేరింది. వెరసి 2021 మార్చి చివరి నాటితో పోలిస్తే నికరంగా 54,396 మంది ఉద్యోగులు జతయ్యారు. ఐటీ రంగంలో నిపుణులకు భారీ డిమాండ్ నేపథ్యంలో ఇన్ఫీలో ఉద్యోగుల వలసల (అట్రిషన్) రేటు 2021–22 క్యూ4లో 27.7 శాతానికి ఎగబాకింది, క్యూ3లో ఇది 25.5 శాతంగా ఉంది. 2020–21 క్యూ4లో అట్రిషన్ రేటు 10.9 శాతం మాత్రమే కావడం గమనార్హం. ► ఆర్థిక ఫలితాలు మార్కెట్లు ముగిసిన తర్వాత వెలువడ్డాయి. ఇన్ఫోసిస్ షేరు బుధవారం స్వల్పంగా 0.5 శాతం మేర లాభంతో రూ.1,749 వద్ద స్థిరపడింది. కాగా, విశ్లేషకుల అంచనాల మేరకు క్యూ4 ఫలితాలు లేకపోవడం, మార్జిన్లు దిగజారడం, అట్రిషన్ భారీగా ఎగబాకవడంతో ఇన్ఫీ ఏడీఆర్ బుధవారం నాస్డాక్లో ఒక దశలో 5 శాతం పైగా నష్టపోయింది. భారీ డీల్స్ దన్ను... 2021–22లో సుస్థిర వ్యాపార జోరు, భారీ స్థాయి డీల్స్‌ను చేజిక్కించుకోవడం, మరిన్ని పెద్ద డీల్స్ కూడా వరుసలో ఉండటం మాకు కలిసొచ్చింది. డిజిటల్ రంగంలో విజయవంతంగా నిలదొక్కుకోగలమన్న విశ్వాసాన్ని మా క్లయింట్లలో కల్పించడం ద్వారా మా మార్కెట్ వాటా వృద్ధి కొనసాగనుంది. 2022–23లో 13–15 శాతం ఆదాయ వృద్ధిని సాధించగలమని మేము విశ్వసిస్తున్నాం. గతేడాది కంపెనీ అన్ని వ్యాపార విభాగాలు, భౌగోళిక ప్రాంతాల వ్యాప్తంగా విస్తృత స్థాయిలో వృద్ధిని నమోదు చేసింది. – సలీల్ పరేఖ్, ఇన్ఫీ సీఈఓ–ఎండీ -
ఇన్ఫోసిస్.. జోష్
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం(2020–21) మూడో త్రైమాసికంలో ఐటీ సేవల దేశీ దిగ్గజం ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ నికర లాభం దాదాపు 17 శాతం పెరిగి రూ. 5,197 కోట్లను తాకింది. వార్షిక ప్రాతిపదికన క్యూ3(అక్టోబర్–డిసెంబర్)లో మొత్తం ఆదాయం సైతం 12% పైగా పుంజుకుని రూ. 25,927 కోట్లకు చేరింది. క్యూ3లో కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 7.13 బిలియన్ డాలర్ల విలువైన డీల్స్‌ను కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో స్థిరకరెన్సీ ప్రాతిపదికన పూర్తి ఏడాదికి(2020–21) ఆదాయం 4.5–5% స్థాయిలో వృద్ధి చెందే వీలున్నట్లు తాజా అంచనాలు(గైడెన్స్) ప్రకటించింది. వెరసి ఇంతక్రితం వేసిన 2–3% ఆదాయ అంచనాలను ఎగువముఖంగా సవరించింది. అత్యుత్తమ పనితీరు కంపెనీ మరోసారి అత్యుత్తమ ఫలితాలు సాధించినట్లు ఇన్ఫోసిస్ సీఈవో, ఎండీ సలీల్ పరేఖ్ పేర్కొన్నారు. క్లయింట్లకు అవసరమైన వ్యూహాలను అమలుచేయడం, డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ విభాగంలో అవకాశాలను అందిపుచ్చుకోవడం ద్వారా కంపెనీ వేగవంత వృద్ధిని సాధించినట్లు తెలియజేశారు. దీంతో క్యూ3లో ఐటీ పరిశ్రమలోనే రికార్డ్ స్థాయిలో డీల్స్ కుదుర్చుకోగలిగినట్లు అభిప్రాయపడ్డారు. గత తొమ్మిది నెలల్లో కంపెనీ మొత్తం 12 బిలియన్ డాలర్ల విలువైన డీల్స్‌ను సాధించినట్లు తెలియజేశారు. వీటిలో 8 బిలియన్ డాలర్ల కాంట్రాక్టులను కొత్తగా కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. తద్వారా కంపెనీ పటిష్ట వృద్ధి బాటలో సాగుతున్నట్లు తెలియజేశారు. వేన్‌గార్డ్, దైల్మర్, రోల్స్‌రాయిస్ తదితర దిగ్గజాలతో కొత్త భాగస్వామ్యాల ఏర్పాటు ద్వారా డిజిటల్, క్లౌడ్ విభాగాలలో కంపెనీకున్న పట్టు ప్రతిఫలిస్తున్నట్లు పేర్కొన్నారు. 2.49 లక్షల మంది 2020 డిసెంబర్‌కల్లా ఇన్ఫోసిస్ సిబ్బంది సంఖ్య 2.49 లక్షలకుపైగా చేరింది. కోవిడ్–19 కాలంలో 97 శాతం మంది ఉద్యోగులు ఇంటి నుంచే బాధ్యతలు నిర్వహించినట్లు ఇన్ఫోసిస్ వెల్లడించింది. ఈ ఏడాది 17,000 మంది ఫ్రెషర్స్‌కు ఉపాధి కల్పించనుండగా.. వచ్చే ఏడాది(2021–22) మరో 24,000 క్యాంపస్ ఉద్యోగాలకు వీలున్నట్లు తెలియజేసింది. సీఈవో సలీల్‌కు రూ. 3.25 కోట్ల విలువైన కంపెనీ రెస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్స్(ఆర్ఎస్యూ) జారీకి కంపెనీ రెమ్యునరేషన్ కమిటీ చేసిన ప్రతిపాదనను బోర్డు అనుమతించినట్లు ఇన్ఫోసిస్ పేర్కొంది. కాగా.. స్వతంత్ర డైరెక్టర్ పునీత కుమార్ సిన్హా పదవీ కాలం పూర్తికావడంతో జనవరి 13న పదవీ విరమణ చేసినట్లు వెల్లడించింది. కార్టర్ డిజిటల్ ఆస్ట్రేలియన్ ఎక్స్పీరియన్స్ డిజైన్ సంస్థ కార్టర్ డిజిటల్‌ను కొనుగోలు చేయనున్నట్లు ఇన్ఫోసిస్ తాజాగా వెల్లడించింది. కంపెనీ ఆస్తులు, ఉద్యోగులను సొంతం చేసుకోనున్నట్లు తెలియజేసింది. తద్వారా కంపెనీ గ్లోబల్ డిజైన్, ఎక్స్పీరియన్స్ సేవలలో మరింత పటిష్టంకానున్నట్లు పేర్కొంది. గ్లోబల్ డిజిటల్ సొల్యూషన్స్‌లో మరింత విస్తరించనున్నట్లు వివరించింది. ఆస్ట్రేలియన్ మార్కెట్లో కంపెనీ బ్రాండు వాంగ్డూడీ ద్వారా మరింత సమర్థవంతంగా సేవలందించేందుకు వీలు చిక్కనున్నట్లు పేర్కొంది. మార్చిలోగా కొనుగోలు పూర్తికావచ్చని అంచనా వేసింది. డిజిటల్ కామర్స్ విభాగంలో సీఎంవోలు, బిజినెస్‌లకు కార్టర్ కొనుగోలుతో వాంగ్డూడీ సేవలు మరింత బలపడనున్నట్లు అభిప్రాయపడింది. కంపెనీ మార్కెట్లు ముగిశాక ఫలితాలు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్ షేరు బీఎస్ఈలో 1.2 శాతం బలపడి రూ.1,388 సమీపంలో ముగిసింది. -
ఇన్ఫోసిస్ సీఈఓ వేతనం ఎంతంటే..?
న్యూఢిల్లీ: గతేడాది (2019–20)లో ఇన్ఫోసిస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఈఓ) సలీల్ పరేఖ్ మొత్తం పారితోషికం రూ. 34.27 కోట్లుగా ఆ కంపెనీ ప్రకటించింది. ఈ మొత్తంలో జీతంతో కలుపుకుని పరిహారం రూ .16.85 కోట్లు కాగా, స్టాక్ ఆప్షన్ల మార్గంలో రూ .17.04 కోట్లు, ఇతరత్రా చెల్లింపుల కింద రూ. 38 లక్షలు ఈయనకు చెల్లించినట్లు కంపెనీ తన తాజా వార్షిక నివేదికలో పేర్కొంది. అంతక్రితం ఏడాది (2018–19)లో రూ. 24.67 కోట్లు చెల్లించగా.. ఈ మొత్తంతో పోల్చితే గతేడాది చెల్లింపులు 39% పెరిగాయి. సంస్థ చైర్మన్ నందన్ నీలేకని తనకు ఎటువంటి పారితోషికం వద్దని చెప్పినట్లు నివేదిక పేర్కొంది. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) యూబీ ప్రవీణ్ రావు వేతనం 17.1% పెరిగి రూ. 10.6 కోట్లకు చేరింది. ఇక గతేడాదిలో టీసీఎస్ సీఈఓ, ఎండీ రాజేష్ గోపీనాథన్ వేతనం 16% తగ్గింది. ఈయనకు రూ. 13.3 కోట్లు చెల్లించినట్లు టీసీఎస్ ప్రకటించింది. మరోవైపు, విప్రో సీఈఓ అబిదాలి నీముచ్వాలా పారితోషికం 11.8% పెరిగింది. గతేడాదిలో ఈ తీసుకున్న మొత్తం రూ. 33.38 కోట్లుగా వెల్లడైంది. పనిలో వేగం పెరిగింది: సలీల్ అమెరికా, యూరోపియన్ దేశాల్లో కార్యకలాపాలు మళ్లీ ప్రారంభమైన నేపథ్యంలో గ్లోబల్ టెలికమ్యూనికేషన్స్, హై టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ వంటి పలు పరిశ్రమల్లో వేగం పెరిగిందని సలీల్ పరేఖ్ అన్నారు. క్లైయింట్ల అవసరాలపైన దృష్టిసారించడం ద్వారా ప్రస్తుత ప్రతికూల పరిస్థితులను అధిగమించే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. -
ఇన్ఫోసిస్.. బోణీ భేష్!
బెంగళూరు: దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సేవల కంపెనీ ఇన్ఫోసిస్... అంచనాలను మించిన బంపర్ ఫలితాలతో బోణీ కొట్టింది. ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో (2019–20, క్యూ3) సంస్థ కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.4,466 కోట్లకు చేరింది. 2018–19 సంవత్సరం ఇదే క్వార్టర్లో వచ్చిన లాభం రూ. 3,610 కోట్లు. దీంతో పోలిస్తే... 23.7 శాతం ఎగబాకింది. ఇక మొత్తం ఆదాయం ఈ క్యూ3లో 7.9 శాతం వృద్ధితో రూ.23,092 కోట్లకు చేరింది. క్రితం ఏడాది క్యూ3లో ఆదాయం రూ.21,400 కోట్లుగా నమోదైంది. ప్రధానంగా డాలరుతో రూపాయి మారకం విలువ బలహీనపడటం.. అన్ని వ్యాపార విభాగాల్లోనూ స్థిరమైన వృద్ధి సాధించటం కంపెనీ మెరుగైన పనితీరుకు దోహదం చేసింది. మార్కెట్ విశ్లేషకులు క్యూ3లో ఇన్ఫీ రూ. 4,206 కోట్ల నికర లాభాన్ని ఆర్జించవచ్చని అంచనా వేశారు. సీక్వెన్షియల్‌గానూ దూకుడు.. 2019–20 ఏడాది సెప్టెంబర్ క్వార్టర్‌తో (క్యూ2)... అంటే సీక్వెన్షియల్ ప్రాతిపదికన పోల్చి చూసినా ఇన్ఫీ ఫలితాలు మెప్పించాయి. క్యూ2లో నికర లాభం రూ.4,019 కోట్లతో పోలిస్తే క్యూ3లో లాభం 10.7 శాతం ఎగసింది. ఆదాయం రూ.22,629 కోట్ల నుంచి 2 శాతం వృద్ధి చెందింది. గైడెన్స్ అప్... సానుకూల వ్యాపార పరిస్థితుల నేపథ్యంలో కంపెనీ ఆదాయ వృద్ధి అంచనాను (గైడెన్స్) పెంచింది. ప్రస్తుత 2019– 20 పూర్తి ఆర్థిక సంవత్సరానికి స్థిర కరెన్సీ ప్రాతిపదికన ఆదాయం 10– 10.5 శాతం మేర వృద్ధి చెందవచ్చని ఇన్ఫీ అంచనా వేసింది. రెండో త్రైమాసికం (క్యూ2) ఫలితాల సందర్భంగా ఆదాయ గైడెన్స్ 9–10%గా కంపెనీ లెక్కగట్టింది. ఇక నిర్వహణ మార్జిన్ గైడెన్స్‌ను కూడా 21–23%గా కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ... ►డాలర్లపరంగా చూస్తే క్యూ3లో ఇన్ఫీ నికర లాభం 24.8 శాతం వృద్ధితో 627 మిలియన్ డాలర్లకు ఎగసింది. మొత్తం ఆదాయం 8.6 శాతం పెరిగి 3.24 బిలియన్ డాలర్లకు చేరింది. ►డిజిటల్ వ్యాపార విభాగం ఆదాయాలు గతేడాది క్యూ3తో పోలిస్తే ఈ క్యూ3లో 40.8 శాతం వృద్ధి చెంది 1,318 మిలియన్ డాలర్లకు ఎగబాకాయి. ఇన్ఫీ మొత్తం ఆదాయంలో ఈ విభాగం వాటా 40.6 శాతానికి చేరింది. ►క్యూ3లో నిర్వహణ మార్జిన్ 21.9 శాతంగా నమోదైంది. ►క్యూ3లో కంపెనీ నికరంగా 6,968 మంది ఉద్యోగులను నియమించుకుంది. దీంతో డిసెంబర్ చివరి నాటికి మొత్తం సిబ్బంది సంఖ్య 2,43,454కు చేరింది. క్యూ3లో ఉద్యోగుల వలసల (అట్రిషన్) రేటు 19.6 శాతంగా నమోదైంది. క్యూ2లో ఇది 21.7 శాతంగా ఉంది. ఇక మొత్తం ఉద్యోగుల్లో మహిళల సంఖ్య 38.8 శాతానికి చేరింది. ►డిసెంబర్ క్వార్టర్లో కొత్తగా 84 మంది క్లయింట్లు జతయ్యారు. దాదాపు 1.8 బిలియన్ డాలర్ల విలువైన కాంట్రాక్టులను కంపెనీ దక్కించుకుంది. ‘భారీస్థాయి కాంట్రాక్టులను చేజిక్కించుకోవడంలో కంపెనీ తన సత్తాను కొనసాగిస్తోంది. మరోపక్క, ఉద్యోగుల వలసలు కూడా తగ్గుముఖం పడుతుండటం కలిసొస్తోంది’ అని కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) ప్రవీణ్ రావు పేర్కొన్నారు. ‘అనైతిక’ ఆరోపణలకు ఆధారాల్లేవు.. కంపెనీ ఖాతా పుస్తకాల్లో అవకతవకలు చోటుచేసుకుంటున్నాయని, అదేవిధంగా ఉన్నతాధికారులు (ప్రధానంగా సీఈఓ సలీల్ పరేఖ్, సీఎఫ్ఓ నీలాంజన్ రాయ్) అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ వచ్చిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలూ లేవని ఇన్ఫోసిస్ స్పష్టం చేసింది. ‘అంతర్గత వేగులు (విజిల్ బ్లోయర్స్) చేసిన అన్ని ఆరోపణలపై కంపెనీ నియమించిన ఆడిట్ కమిటీ సీరియస్‌గా, లోతైన స్వతంత్ర విచారణను చేపట్టింది. అయితే, ఈ ఆరోపణలకు ఎటువంటి ఆధారాలూ లభించలేదు’ అని కమిటీ చైర్పర్సన్ డి. సుందరం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, ఆడిట్ కమిటీ నివేదికపై ఇన్ఫీ చైర్మన్ నందన్ నీలేకని స్పందిస్తూ... ‘సలీల్ పరేఖ్, నీలాంజన్ రాయ్ కంపెనీ ప్రయోజనాలను పరిరక్షించడంలో ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్నారు. ఇన్ఫోసిస్‌ను కొత్త వ్యూహాలతో విజయపథంవైపు నడిపించడంలో సలీల్ చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నారు’ అని పేర్కొన్నారు. ‘ఇప్పుడున్న డిజిటల్ యుగంలో తమ సత్తా చాటేందుకు క్లయింట్లు పూర్తిస్థాయిలో అస్త్రాలకు పదునుపెడుతున్నారు. ఈ మార్పు మా ఆదాయాల్లో రెండంకెల వృద్ధికి ప్రధానంగా దోహదం చేస్తోంది. అంతేకాకుండా నిర్వహణ మార్జిన్లు పుంజుకోవడం కూడా కంపెనీ మెరుగైన పనితీరుకు చోదకంగా పనిచేస్తోంది’. – సలీల్ పరేఖ్, ఇన్ఫీ సీఈఓ–ఎండీ ‘పూర్తి ఏడాదికి ఆదాయ గైడెన్స్‌ను పెంచడం కంపెనీ పటిష్టమైన పనితీరుకు నిదర్శనం. సహజంగా మొత్తం ఐటీ పరిశ్రమకు సీజనల్‌గా బలహీనమైన క్వార్టర్లో సైతం ఇన్ఫీ ఈ స్థాయి ఫలితాలను ప్రకటించడం శుభపరిణామం. అంతేకాకుండా ఇకపై రెండంకెల వృద్ధిని లక్ష్యంగా పెట్టుకోవడం మరో ప్రధానాంశంగా చూడొచ్చు’ – మోషే కత్రి, వెడ్‌బుష్ సెక్యూరిటీస్ ఎండీ ఇన్ఫీ షేరు ధర శుక్రవారం బీఎస్ఈలో 1.5 శాతం లాభపడి రూ.738 వద్ద ముగిసింది. కంపెనీ ఆర్థిక ఫలితాలు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ముగిసిన తర్వాత వెలువడ్డాయి. -
ఇన్ఫోసిస్ సీఈవోపై మరోసారి సంచలన ఆరోపణలు
సాక్షి, బెంగళూరు : టెక్ సేవల సంస్థ ఇన్ఫోసిస్ వివాదం మరింత ముదురుతోంది. సెప్టెంబర్ 20 న బోర్డుకు 2 పేజీల లేఖలో అనైతిక పద్ధతులపై ఆరోపించిన స్వల్ప వ్యవధిలోనే మళ్లీ ఇలాంటి ఫిర్యాదు రావడం ఇది రెండోసారి. విజిల్ బ్లోయర్ ఈ ఆరోపణలు రేపిన సెగ ఇంకా చల్లారకముందే, ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్‌పై మరో విజిల్ బ్లోయర్ సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు సలీల్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఇన్ఫీ చైర్మన్ నందన్ నీలేకనితోపాటు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌కు ఒక లేఖ రాశారు. సీఈవో పరేఖ్ కంపెనీలో చేరి ఒక సంవత్సరం 8 నెలలు అయినప్పటికీ, ముంబైలో కాకుండా బెంగళూరులో నివాసం ఉండాలన్న షరతును ఉల్లంఘించారని ఆరోపించారు. 11 బిలియన్ డాలర్ల కంపెనీ ఫైనాన్స్ విభాగ ఉద్యోగిని అని చెప్పుకున్న విజిల్‌బ్లోయర్, పరేఖ్ అక్రమాలను బహిర్గతం చేసినందుకు తనపై ప్రతీకారం తీర్చుకుంటారనే భయంతో తన గుర్తింపును వెల్లడించలేకపోతున్నానంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉద్యోగిగా, వాటాదారుగా, సంస్థ విలువ వ్యవస్థలను క్షీణింపజేస్తున్న పరేఖ్ గురించి కొన్ని వాస్తవాలను ఛైర్మన్, బోర్డు దృష్టికి తీసుకురావడం తన కర్తవ్యంగా భావిస్తున్నానని చెప్పారు. తక్షణమే స్పందించి, సంస్థ భవిష్యత్తు కనుగుణంగా చర్యలు చేపట్టాలని కోరారు. పరేఖ్‌కు రెండు నెలల గడువు ఇచ్చినప్పటికీ కేవలం తన వ్యాపార ప్రయోజనాలకోసమే బెంగళూరుకు మకాం మార్చకుండా, ముంబైలోనే ఉంటున్నారని ఆరోపించారు. సీఈవోకు స్టాక్ మార్కెట్ కనెక్షన్లు ఉన్నాయని, అనేక సంస్థలలో పెట్టుబడులు పెట్టారని ఆరోపించిన ఫిర్యాదుదారుడు, పరేఖ్ తన పెట్టుబడుల పర్యవేక్షణ కోసమే ఇదంతా చేస్తున్నారన్నారు. దీన్ని ఆదర్శంగా తీసుకున్న చాలామంది ఉద్యోగులు ఇంటి నుండి పనిచేయడం ప్రారంభించారన్నారు. సీఈవో నెలకు రెండు సార్లు ఆఫీస్‌కు వచ్చేందుకు విమాన చార్జీలు, ఇతర రవాణా చార్జీలకే సంస్థ రూ. 22 లక్షలు చెల్లించినట్టు తెలిపారు. నెలకు నాలుగు బిజినెస్ క్లాస్ విమాన టిక్కెట్లు, ఇంటికి నుంచి ముంబై, బెంగళూరు విమానాశ్రయాలకి, ఆఫీసు నుంచి విమానాశ్రయం వరకు పికప్, డ్రాప్ చార్జీలు ఇందులో ఉన్నాయని విజిల్ బ్లోయర్ ఆరోపించారు. అయితే తాజా ఆరోపణలపై, అటు సంస్థ సీఈవో సలీల్ పరేఖ్, ఇటు ఇన్ఫోసిస్ ఇంకా స్పందించలేదు. -
ఇన్ఫీ కొత్త సీఈవో జీతమెంతంటే...