ఫలితాలను ప్రకటిస్తున్న ఇన్ఫీ సీఈఓ సలీల్ పరేఖ్, పక్కన కంపెనీ సీఎఫ్‌ఓ నిరంజన్ రాయ్
న్యూఢిల్లీ: దేశంలో రెండో అతిపెద్ద సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (2021–22, క్యూ4)లో రూ. 5,686 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ. 5,076 కోట్లతో పోలిస్తే 12 శాతం వృద్ధి చెందింది. మొత్తం ఆదాయం 22.7 శాతం ఎగబాకి రూ.32,276 కోట్లుగా నమోదైంది. అంతక్రితం క్యూ4లో ఆదాయం రూ.26,311 కోట్లుగా ఉంది.
త్రైమాసికంగా తగ్గుదల...
2021–22 క్యూ3 (అక్టోబర్–డిసెంబర్ క్వార్టర్)లో నమోదైన లాభం (రూ.5,809 కోట్లు)తో పోలిస్తే క్యూ4లో లాభం 2.1 శాతం తగ్గింది. ఇక మొత్తం ఆదాయం మాత్రం క్యూ3 (రూ.31,867 కోట్లు)తో పోలిస్తే స్వల్పంగా 1.3 శాతం పెరిగింది.
పూర్తి ఏడాదికి ఇలా...
2021–22 పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫీ నికర లాభం రూ.22,110 కోట్లకు ఎగబాకింది. అంతక్రితం ఏడాది లాభం రూ.19,351 కోట్లతో పోలిస్తే 14.3 శాతం వృద్ధి చెందింది. మొత్తం ఆదాయం కూడా 21 శాతం ఎగసి రూ.1,00,472 కోట్ల నుంచి రూ.1,21,641 కోట్లకు పెరిగింది. కాగా, ప్రస్తుత 2022–23 ఆర్థిక సంవత్సరానికి ఆదాయం 13–15 శాతం వృద్ధి చెందవచ్చని ఇన్ఫీ అంచనా వేసింది. పటిష్టమైన డిమాండ్ పరిస్థితులు, భారీ స్థాయిలో దక్కించుకుంటున్న డీల్స్ ఇందుకు దోహదం చేస్తాయని కంపెనీ వెల్లడించింది.
కాగా, 2021–22 ఆర్థిక సంవత్సరం ఆరంభంలో పూర్తి ఏడాది ఆదాయ అంచనాలను 12–14 శాతంగా పేర్కొన్న ఇన్ఫీ, 2022 జనవరిలో దీన్ని 19.5–20 శాతానికి పెంచడం గమనార్హం. పటిష్టమైన డిమాండ్ నేపథ్యంలో అమ్మకాలు, డెలివరీ ఇంకా నవకల్పనల్లో సామర్థ్యాలను పెంచుకోవడం కోసం తగిన దీర్ఘకాలిక పెట్టుబడులు పెడుతున్నామని ఇన్ఫోసిస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌ఓ) నిరంజన్ రాయ్ పేర్కొన్నారు.
ఫలితాల్లో ఇతర ముఖ్యంశాలు...
► గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో ఇన్ఫీ దక్కించుకున్న కాంట్రాక్టుల మొత్తం విలువ (టీసీవీ) 2.3 బిలియన్ డాలర్లు. పూర్తి ఏడాదికి టీసీవీ 9.5 బిలియన్ డాలర్లుగా ఉంది. క్యూ4లో స్థూలంగా 110 కొత్త క్లయింట్లు జతయ్యారు.
► క్యూ4లో కంపెనీ నిర్వహణ మార్జిన్ 3 శాతం మేర దిగజారి 21.5 శాతానికి చేరింది. ఇక పూర్తి ఏడాదికి కూడా 3 శాతం తగ్గుదలతో 23 శాతంగా నమోదైంది.
► ఇన్ఫీ డైరెక్టర్ల బోర్డు 2021–22 ఏడాదికి గాను రూ.5 ముఖ విలువ గల ఒక్కో షేరుకు రూ.16 చొప్పున తుది డివిడెండ్‌ను సిఫార్సు చేసింది. తద్వారా పూర్తి ఏడాదికి ఇన్వెస్టర్లకు మొత్తం రూ.31 డివిడెండ్ (రూ.13,000 కోట్లు) లభించినట్లవుతుంది. 2020–21తో పోలిస్తే డివిడెండ్ 14.8 శాతం పెరిగినట్లు లెక్క.
► ప్రస్తుతం రష్యాకు చెందిన క్లయింట్లతో ఎలాంటి కాంట్రాక్టులు లేవని, రాబోయే కాలంలో కూడా సంబంధిత ప్రణాళికలు ఏవీ ఉండబోవని కంపెనీ స్పష్టం చేసింది. రష్యాలో ఉన్న నామమాత్ర వ్యాపారాన్ని తరలిస్తున్నట్లు కూడా వెల్లడించింది.
► ఈ ఏడాది కనీసం 50,000 మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు కంపెనీ తెలిపింది. గతేడాది అంచనాలను మించి 85,000 మంది ఫ్రెషర్లకు ప్రపంచవ్యాప్తంగా, భారత్‌లో ఉద్యోగాలు ఇచ్చినట్లు వెల్లడించింది. కాగా, 2022 మార్చి 31 నాటికి కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,14,015కు చేరింది. వెరసి 2021 మార్చి చివరి నాటితో పోలిస్తే నికరంగా 54,396 మంది ఉద్యోగులు జతయ్యారు. ఐటీ రంగంలో నిపుణులకు భారీ డిమాండ్ నేపథ్యంలో ఇన్ఫీలో ఉద్యోగుల వలసల (అట్రిషన్) రేటు 2021–22 క్యూ4లో 27.7 శాతానికి ఎగబాకింది, క్యూ3లో ఇది 25.5 శాతంగా ఉంది. 2020–21 క్యూ4లో అట్రిషన్ రేటు 10.9 శాతం మాత్రమే కావడం గమనార్హం.
► ఆర్థిక ఫలితాలు మార్కెట్లు ముగిసిన తర్వాత వెలువడ్డాయి. ఇన్ఫోసిస్ షేరు బుధవారం స్వల్పంగా 0.5 శాతం మేర లాభంతో రూ.1,749 వద్ద స్థిరపడింది. కాగా, విశ్లేషకుల అంచనాల మేరకు క్యూ4 ఫలితాలు లేకపోవడం, మార్జిన్లు దిగజారడం, అట్రిషన్ భారీగా ఎగబాకవడంతో ఇన్ఫీ ఏడీఆర్ బుధవారం నాస్‌డాక్‌లో
ఒక దశలో 5 శాతం పైగా నష్టపోయింది.
భారీ డీల్స్ దన్ను...
2021–22లో సుస్థిర వ్యాపార జోరు, భారీ స్థాయి డీల్స్‌ను చేజిక్కించుకోవడం, మరిన్ని పెద్ద డీల్స్ కూడా వరుసలో ఉండటం మాకు కలిసొచ్చింది. డిజిటల్ రంగంలో విజయవంతంగా నిలదొక్కుకోగలమన్న విశ్వాసాన్ని మా క్లయింట్లలో కల్పించడం ద్వారా మా మార్కెట్ వాటా వృద్ధి కొనసాగనుంది. 2022–23లో 13–15 శాతం ఆదాయ వృద్ధిని సాధించగలమని మేము విశ్వసిస్తున్నాం. గతేడాది కంపెనీ అన్ని వ్యాపార విభాగాలు, భౌగోళిక ప్రాంతాల వ్యాప్తంగా విస్తృత స్థాయిలో వృద్ధిని నమోదు చేసింది.
– సలీల్ పరేఖ్, ఇన్ఫీ సీఈఓ–ఎండీ
Comments
Please login to add a commentAdd a comment