సాక్షి, ముంబై: భారతీయ ఐటీ కంపెనీల షేర్లు ఈ ఏడాది ప్రధాన రంగాల నష్టాల్లో నిలిచాయి. సాధారణంగా రేసుగుర్రాల్లా దూసుకుపోయే ఐటీ కంపెనీలకు 2022లో ఎదురు దెబ్బ తగిలింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, క్యూ4 ఆదాయాల సీజన్‌లో ప్రతికూల సెంటిమెంట్, ఎఫ్‌ఐఐల నిరంతర విక్రయాలు మార్కెట్లో ఐటీ షేర్లను అశనిపాతంలా చుట్టుకుంది.
బిజినెస్ టుడే కథనం ప్రకారం బీఎస్‌ఈ ఐటీ ఇండెక్స్ 2022లో 25 శాతం లేదా 9,524 పాయింట్లను కోల్పోయింది. ఈ కాలంలో సెన్సెక్స్ 7.44 శాతం లేదా 4,336 పాయింట్లు క్షీణించింది.
అలాగే, నిఫ్టీ ఐటి ఇండెక్స్ 37,071 స్థాయినుంచి 27,708కి పడిపోయింది. వార్షిక ప్రాతి పదికన 9,363 పాయింట్లు లేదా 25.25 శాతం నష్టపోయింది. అలాగే ఎఫ్‌ఐఐలు ఈ ఏడాది భారత మార్కెట్‌లో రూ. 1.60 లక్షల కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించడంతో ఐటీ స్టాక్‌ల సెంటిమెంట్ బలహీనపడింది. టెక్ మహీంద్ర, విప్రో, సియంట్, హెచ్‌సీఎల్, ఇన్ఫోసిస్, ఒరాకిల్, జస్ట్ డయల్, టీ సీఎస్ ప్రధానంగా నష్టపోయిన ఐటీ షేర్లు
ఇక ఆదాయాల విషయంలో మెజారిటీ ఐటీ కంపెనీలు వృద్ధి అంచనాలను అందుకో లేకపోయాయి. క్యూ4లో దిగ్గజ ఐటీ కంపెనీల మార్జిన్ ఔట్‌లుక్ మితంగా ఉండడం కూడా ఈ నష్టాలకుఒక కారణమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
కాగా బుధవారం నాటి స్టాక్‌మార్కెట్ ముగింపులో సెన్సెక్స్ 303 పాయింట్ల నష్టంతో 54 వేల దిగువకు చేరింది. అటు నిఫ్టీ 99 పాయంట్లను కోల్పోయి 16025 వద్ద ముగిసింది. ముఖ్యంగా ఐటీ షేర్ల నష్టాలతో వరుసగా మూడో రోజు కూడా ఈక్విటీ మార్కెట్ నెగిటివ్‌గా ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment