న్యూఢిల్లీ: ఇతర సంస్థల కొనుగోలు, విలీనాలకు ప్రస్తుతం అనుకూల పరిస్థితులు నెలకొన్నాయని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సీఈవో సలిల్ పరేఖ్ చెప్పారు. వ్యూహాత్మకంగా తమ సంస్థకు ఉపయోగపడేవి, తమకు అనువుగా ఉండే వాటిని దక్కించుకోవడంపై దృష్టి పెడతామని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ‘చాలా మంచి అవకాశాలు‘ కనిపిస్తున్నాయని పరేఖ్ చెప్పారు.
అమెరికాలో స్థూల ఆర్థిక వాతావరణం బలహీనంగా ఉండటం, అంతర్జాతీయంగా అనిశ్చితులు నెలకొనడం వంటి పరిస్థితుల నేపథ్యంలో కొనుగోళ్లు, విలీనాల విభాగంలో ఏవైనా ఆకర్షణీయమైన అవకాశాలు ఉన్నాయా అనే ప్రశ్నకు స్పందిస్తూ ఆయన ఈ విషయాలు చెప్పారు. ఇన్ఫోసిస్ ఇటీవలే ప్రకటించిన గత ఆర్థిక సంవత్సర నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాల్లో నికర లాభం అంచనాల కన్నా తక్కువగా నమోదైంది. అమెరికా బ్యాంకింగ్ రంగంలో సంక్షోభం కారణంగా అంతర్జాతీయ క్లయింట్లు ఐటీ బడ్జెట్లను కుదించుకుంటూ ఉంటున్నందున 2024 ఆర్థిక సంవత్సర ఆదాయ వృద్ధి గైడెన్స్ 4–7 శాతానికి పరిమితం కావచ్చంటూ ఇన్ఫీ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment