శుక్రవారం బెంగళూరులో ఆర్థిక ఫలితాలను ప్రకటించిన సందర్భంగా ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నీలేకని,సీఈఓ సలీల్ పరేఖ్, సీఎఫ్‌ఓ నీలాంజన్ రాయ్(కుడి వ్యక్తి), సీఓఓ ప్రవీణ్ రావు(ఎడమ వ్యక్తి)
బెంగళూరు: దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సేవల కంపెనీ ఇన్ఫోసిస్... అంచనాలను మించిన బంపర్ ఫలితాలతో బోణీ కొట్టింది. ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో (2019–20, క్యూ3) సంస్థ కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.4,466 కోట్లకు చేరింది. 2018–19 సంవత్సరం ఇదే క్వార్టర్‌లో వచ్చిన లాభం రూ. 3,610 కోట్లు. దీంతో పోలిస్తే... 23.7 శాతం ఎగబాకింది. ఇక మొత్తం ఆదాయం ఈ క్యూ3లో 7.9 శాతం వృద్ధితో రూ.23,092 కోట్లకు చేరింది. క్రితం ఏడాది క్యూ3లో ఆదాయం రూ.21,400 కోట్లుగా నమోదైంది. ప్రధానంగా డాలరుతో రూపాయి మారకం విలువ బలహీనపడటం.. అన్ని వ్యాపార విభాగాల్లోనూ స్థిరమైన వృద్ధి సాధించటం కంపెనీ మెరుగైన పనితీరుకు దోహదం చేసింది. మార్కెట్ విశ్లేషకులు క్యూ3లో ఇన్ఫీ రూ. 4,206 కోట్ల నికర లాభాన్ని ఆర్జించవచ్చని అంచనా వేశారు.
సీక్వెన్షియల్‌గానూ దూకుడు..
2019–20 ఏడాది సెప్టెంబర్ క్వార్టర్‌తో (క్యూ2)... అంటే సీక్వెన్షియల్ ప్రాతిపదికన పోల్చి చూసినా ఇన్ఫీ ఫలితాలు మెప్పించాయి. క్యూ2లో నికర లాభం రూ.4,019 కోట్లతో పోలిస్తే క్యూ3లో లాభం 10.7 శాతం ఎగసింది. ఆదాయం రూ.22,629 కోట్ల నుంచి 2 శాతం వృద్ధి చెందింది.
గైడెన్స్ అప్...
సానుకూల వ్యాపార పరిస్థితుల నేపథ్యంలో కంపెనీ ఆదాయ వృద్ధి అంచనాను (గైడెన్స్) పెంచింది. ప్రస్తుత 2019– 20 పూర్తి ఆర్థిక సంవత్సరానికి స్థిర కరెన్సీ ప్రాతిపదికన ఆదాయం 10– 10.5 శాతం మేర వృద్ధి చెందవచ్చని ఇన్ఫీ అంచనా వేసింది. రెండో త్రైమాసికం (క్యూ2) ఫలితాల సందర్భంగా ఆదాయ గైడెన్స్ 9–10%గా కంపెనీ లెక్కగట్టింది. ఇక నిర్వహణ మార్జిన్ గైడెన్స్‌ను కూడా 21–23%గా కొనసాగిస్తున్నట్లు పేర్కొంది.
ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ...
►డాలర్లపరంగా చూస్తే క్యూ3లో ఇన్ఫీ నికర లాభం 24.8 శాతం వృద్ధితో 627 మిలియన్ డాలర్లకు ఎగసింది. మొత్తం ఆదాయం 8.6 శాతం పెరిగి 3.24 బిలియన్ డాలర్లకు చేరింది.
►డిజిటల్ వ్యాపార విభాగం ఆదాయాలు గతేడాది క్యూ3తో పోలిస్తే ఈ క్యూ3లో 40.8 శాతం వృద్ధి చెంది 1,318 మిలియన్ డాలర్లకు ఎగబాకాయి. ఇన్ఫీ మొత్తం ఆదాయంలో ఈ విభాగం వాటా 40.6 శాతానికి చేరింది.
►క్యూ3లో నిర్వహణ మార్జిన్ 21.9 శాతంగా నమోదైంది.
►క్యూ3లో కంపెనీ నికరంగా 6,968 మంది ఉద్యోగులను నియమించుకుంది. దీంతో డిసెంబర్ చివరి నాటికి మొత్తం సిబ్బంది సంఖ్య 2,43,454కు చేరింది. క్యూ3లో ఉద్యోగుల వలసల (అట్రిషన్) రేటు 19.6 శాతంగా నమోదైంది. క్యూ2లో ఇది 21.7 శాతంగా ఉంది. ఇక మొత్తం ఉద్యోగుల్లో మహిళల సంఖ్య 38.8 శాతానికి చేరింది.
►డిసెంబర్ క్వార్టర్‌లో కొత్తగా 84 మంది క్లయింట్లు జతయ్యారు. దాదాపు 1.8 బిలియన్ డాలర్ల విలువైన కాంట్రాక్టులను కంపెనీ దక్కించుకుంది. ‘భారీస్థాయి కాంట్రాక్టులను చేజిక్కించుకోవడంలో కంపెనీ తన సత్తాను కొనసాగిస్తోంది. మరోపక్క, ఉద్యోగుల వలసలు కూడా తగ్గుముఖం పడుతుండటం కలిసొస్తోంది’ అని కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) ప్రవీణ్ రావు పేర్కొన్నారు.
‘అనైతిక’ ఆరోపణలకు ఆధారాల్లేవు..
కంపెనీ ఖాతా పుస్తకాల్లో అవకతవకలు చోటుచేసుకుంటున్నాయని, అదేవిధంగా ఉన్నతాధికారులు (ప్రధానంగా సీఈఓ సలీల్ పరేఖ్, సీఎఫ్‌ఓ నీలాంజన్ రాయ్) అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ వచ్చిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలూ లేవని ఇన్ఫోసిస్ స్పష్టం చేసింది. ‘అంతర్గత వేగులు (విజిల్ బ్లోయర్స్) చేసిన అన్ని ఆరోపణలపై కంపెనీ నియమించిన ఆడిట్ కమిటీ సీరియస్‌గా, లోతైన స్వతంత్ర విచారణను చేపట్టింది. అయితే, ఈ ఆరోపణలకు ఎటువంటి ఆధారాలూ లభించలేదు’ అని కమిటీ చైర్‌పర్సన్ డి. సుందరం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, ఆడిట్ కమిటీ నివేదికపై ఇన్ఫీ చైర్మన్ నందన్ నీలేకని స్పందిస్తూ... ‘సలీల్ పరేఖ్, నీలాంజన్ రాయ్ కంపెనీ ప్రయోజనాలను పరిరక్షించడంలో ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్నారు. ఇన్ఫోసిస్‌ను కొత్త వ్యూహాలతో విజయపథంవైపు నడిపించడంలో సలీల్ చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నారు’ అని పేర్కొన్నారు.
‘ఇప్పుడున్న డిజిటల్ యుగంలో తమ సత్తా చాటేందుకు క్లయింట్లు పూర్తిస్థాయిలో అస్త్రాలకు పదునుపెడుతున్నారు. ఈ మార్పు మా ఆదాయాల్లో రెండంకెల వృద్ధికి ప్రధానంగా దోహదం చేస్తోంది. అంతేకాకుండా నిర్వహణ మార్జిన్లు పుంజుకోవడం కూడా కంపెనీ మెరుగైన పనితీరుకు చోదకంగా పనిచేస్తోంది’. – సలీల్ పరేఖ్, ఇన్ఫీ సీఈఓ–ఎండీ
‘పూర్తి ఏడాదికి ఆదాయ గైడెన్స్‌ను పెంచడం కంపెనీ పటిష్టమైన పనితీరుకు నిదర్శనం. సహజంగా మొత్తం ఐటీ పరిశ్రమకు సీజనల్‌గా బలహీనమైన క్వార్టర్‌లో సైతం ఇన్ఫీ ఈ స్థాయి ఫలితాలను ప్రకటించడం శుభపరిణామం. అంతేకాకుండా ఇకపై రెండంకెల వృద్ధిని లక్ష్యంగా పెట్టుకోవడం మరో ప్రధానాంశంగా చూడొచ్చు’ – మోషే కత్రి, వెడ్‌బుష్ సెక్యూరిటీస్ ఎండీ
ఇన్ఫీ షేరు ధర శుక్రవారం బీఎస్‌ఈలో 1.5 శాతం లాభపడి రూ.738 వద్ద ముగిసింది. కంపెనీ ఆర్థిక ఫలితాలు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ముగిసిన తర్వాత వెలువడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment