టీ20 వరల్డ్‌కప్‌-2024 అంబాసిడర్‌గా ఆఫ్రిది.. దిమ్మతిరిగేలా రైనా కౌంటర్‌ | I Have 2011 ODI WC At Home: Suresh Raina Hits Back At Pak Journalist | Sakshi
Sakshi News home page

టీ20 వరల్డ్‌కప్‌-2024 అంబాసిడర్‌గా ఆఫ్రిది.. దిమ్మతిరిగేలా రైనా కౌంటర్‌

Published Fri, May 24 2024 4:52 PM | Last Updated on Fri, May 24 2024 5:27 PM

I Have 2011 ODI WC At Home: Suresh Raina Hits Back At Pak Journalist


టీమిండియా మాజీ క్రికెటర్‌, మిస్టర్‌ ఐపీఎల్‌గా పేరొందిన సురేశ్‌ రైనా ప్రస్తుతం కామెంటేటర్‌గా కొనసాగుతున్నాడు. క్యాష్‌ రిచ్‌ లీగ్‌ పదిహేడో ఎడిషన్‌లో తనదైన శైలిలో మ్యాచ్‌లు, ప్లేయర్ల ఆట తీరును విశ్లేషిస్తూ వ్యాఖ్యాతగా ఆకట్టుకుంటున్నాడు.

ఇక ఇటీవల ఐపీఎల్‌-2024 క్వాలిఫయర్‌-1 మ్యాచ్‌ సందర్భంగా సురేశ్‌ రైనా.. పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ షాహిద్‌ ఆఫ్రిదిపై సెటైర్లు వేశాడు. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌- సన్‌రైజర్స్‌ హైదారబాద్‌ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌కు టీమిండియా మాజీ ఓపెనర్‌ ఆకాశ్‌ చోప్రాతో కలిసి హిందీలో కామెంట్రీ చేశాడు రైనా.

ఈ సందర్భంగా ఆకాశ్‌ చోప్రా.. రైనాను ఉద్దేశించి.. ‘‘రిటైర్మెంట్‌పై యూటర్న్‌ తీసుకుంటావా?’’ అని ప్రశ్నించాడు. ఇందుకు బదులిస్తూ.. ‘‘నేనేమీ షాహిద్‌ ఆఫ్రిదిని కాదు’’ అని రైనా పేర్కొన్నాడు.

ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్‌-2024 టోర్నీకి షాహిద్‌ ఆఫ్రిదిని అంబాసిడర్‌గా నియమిస్తూ అంతర్జాతీయ క్రికెట్‌ మండలి తాజాగా ప్రకటన విడుదల చేసింది. టీమిండియా స్టార్‌ యువరాజ్‌ సింగ్‌, వెస్టిండీస్‌ దిగ్గజం క్రిస్‌ గేల్‌, జమైకా అథ్లెట్‌ ఉసేన్‌ బోల్ట్‌లతో పాటు ఆఫ్రిది కూడా ఈ మెగా ఈవెంట్‌కు రాయబారిగా ఉంటాడని పేర్కొంది.

ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌కు చెందిన స్పోర్ట్స్‌ కంటెంట్‌ రైటర్‌ రైనాను ఉద్దేశించి సెటైర్లు వేశాడు. ‘‘ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌-2024 అంబాసిడర్‌గా షాహిద్‌ ఆఫ్రిది పేరును ఐసీసీ ప్రకటించింది. హలో సురేశ్‌ రైనా’’ అని ట్రోల్‌ చేశాడు.

 

ఇందుకు రైనా కూడా అంతే ఘాటుగా బదులిచ్చాడు. ‘‘నేను ఐసీసీ అంబాసిడర్‌ను కాదు గానీ.. 2011 వరల్డ్‌కప్‌ గెలిచిన జట్టులో సభ్యుడిని. మొహాలీలో గేమ్‌ గుర్తుందా?

నాకు తెలిసి ఆ మ్యాచ్‌ నీకు కొన్ని మర్చిపోలేని జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేస్తుందనుకుంటా’’ అని కౌంటర్‌ ఇచ్చాడు. కాగా వన్డే వరల్డ్‌కప్‌-2011లో మొహాలీ వేదికగా టీమిండియా- పాకిస్తాన్‌ సెమీ ఫైనల్లో తలపడ్డాయి.

ఈ మ్యాచ్‌లో టీమిండియా 29 పరుగుల తేడాతో పాక్‌ను ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది. నాటి మ్యాచ్‌లో సురేశ్‌ రైనా జట్టుకు అవసరమైన సమయంలో పట్టుదలగా నిలబడి 36 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ధోని సేన షాహిద్‌ ఆఫ్రిది బృందాన్ని ఓడించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు అదే విషయాన్ని గుర్తు చేస్తూ తనను ట్రోల్‌ చేసిన వ్యక్తికి రివర్స్‌ సెటైర్‌ వేశాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement