పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం తీరును మాజీ సారథి షాహిద్ ఆఫ్రిది విమర్శించాడు. షాహిన్ ఆఫ్రిది స్థానంలో బాబర్ పగ్గాలు చేపట్టడం సరికాదని పేర్కొన్నాడు. ఒకవేళ బోర్డు ఆఫర్ చేసినా.. షాహిన్‌నే కెప్టెన్‌గా కొనసాగించాలని బాబర్.. కోరి ఉంటే బాగుండేదంటూ తన అల్లుడికి మద్దతు పలికాడు.
వన్డే ప్రపంచకప్-2023లో పేలవ ప్రదర్శన తర్వాత పాకిస్తాన్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి బాబర్ ఆజం తప్పుకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నాటి పాక్ క్రికెట్ బోర్డు టెస్టులకు షాన్ మసూద్, టీ20 ఫార్మాట్‌కు ప్రధాన పేసర్, షాహిద్ ఆఫ్రిది అల్లుడు షాహిన్ ఆఫ్రిదిని కెప్టెన్లుగా ప్రకటించింది.
షాహిన్‌పై వేటు
అయితే, మసూద్ సారథ్యంలో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో క్లీన్‌స్వీప్ అయిన పాకిస్తాన్.. షాహిన్ నేతృత్వంలో న్యూజిలాండ్ పర్యటనలో టీ20 సిరీస్‌ను 4-1తో ఓడిపోయింది.
ఇక పాకిస్తాన్ సూపర్ లీగ్‌లోనూ షాహిన్ ఆఫ్రిది వైఫల్యం కొనసాగింది. ఈ నేపథ్యంలో పాక్ బోర్డు కొత్త యాజమాన్యం అతడిపై వేటు వేసింది. వన్డే, టీ20లకు బాబర్ ఆజంనే తిరిగి కెప్టెన్‌గా నియమించింది.
అయితే, బాబర్ సారథ్యంలోనూ పాకిస్తాన్‌కు చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. తొలుత ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ను 0-2తో కోల్పోయిన పాక్.. తాజాగా టీ20 ప్రపంచకప్-2024లో గ్రూప్ దశ దాటకుండానే ఎలిమినేట్ అయింది.
ఈ నేపథ్యంలో బాబర్ ఆజం కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తుతుండగా.. షాహిద్ ఆఫ్రిది తన అల్లుడు షాహిన్ ఆఫ్రిదిని సమర్థిస్తూ వ్యాఖ్యలు చేశాడు. ‘‘వరల్డ్‌కప్ వరకు షాహిన్ ఆఫ్రిది కెప్టెన్‌గా ఉంటాడని ఒకవేళ పీసీబీ చెబితే.. బాబర్ ఆజం అతడికి మద్దతుగా నిలవాల్సింది.
‘లేదు. నాకు కెప్టెన్సీ వద్దు. మేమంతా షాహిన్ సారథ్యంలో ఆడటానికి సిద్ధంగా ఉన్నాం. అతడు నాతో పాటు ఎన్నో ఏళ్లుగా ఆడుతున్నాడు. అందుకే అతడికే కెప్టెన్సీ అప్పగించండి. నేను అతడికి మద్దతుగా ఉంటూ.. అతడి నాయకత్వంలో ఆడతాను’’ అని బాబర్ ఆజం చెప్పాల్సింది.
బాబర్ ఆజంకు కెప్టెన్సీ చేయడమే రాదు
ఇలా చేసి ఉంటే అతడిపై గౌరవం పెరిగేది. అయినా.. ఇందులో బాబర్ ఒక్కడినే తప్పుబట్టడానికి లేదు. సెలక్షన్ కమిటీకి కూడా ఇందులో భాగం ఉంది.
సెలక్షన్ కమిటీలోని కొందరకు వ్యక్తులు.. బాబర్ ఆజంకు కెప్టెన్సీ చేయడమే రాదని డైరెక్ట్‌గానే చెప్పారు. అయినా మళ్లీ అతడి చేతికే పగ్గాలు వచ్చాయి’’ అని షాహిద్ ఆఫ్రిది ఘాటు విమర్శలు చేశాడు.
ఏదేమైనా బాబర్ ఆజం.. తన అల్లుడు షాహిన్ ఆఫ్రిదినే కెప్టెన్‌గా కొనసాగించాలని బోర్డును కోరి ఉండాల్సిందని షాహిద్ ఆఫ్రిది అభిప్రాయపడ్డాడు. కాగా బాబర్ నాయకత్వంలో 2021 వరల్డ్‌కప్‌లో సెమీస్ చేరిన పాకిస్తాన్.. 2022లో రన్నరప్‌గా నిలిచింది. ఈసారి మాత్రం గ్రూప్ స్టేజిలోనే ఇంటిబాట పట్టింది.
చదవండి: WC: ఆస్ట్రేలియా గెలవాలని కోరుకుంటున్నాం: ఇంగ్లండ్ పేసర్
Comments
Please login to add a commentAdd a comment