పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్ వ్యవధిని తగ్గించింది. ఈ విషయాన్ని పీసీబీ అధికారులు ధ్రువీకరించినట్లు జాతీయ మీడియా పేర్కొంది.
వన్డే ప్రపంచకప్-2023, టీ20 ప్రపంచకప్-2024 టోర్నీల్లో దారుణ వైఫల్యాల నేపథ్యంలో పాక్ బోర్డు ఆటగాళ్ల ప్రవర్తనపై గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. క్రికెట్‌పై దృష్టి పెట్టకుండా ఇతర అంశాల్లో జోక్యం చేసుకుంటూ జట్టుకు నష్టం చేకూరుస్తున్నారని పీసీబీ భావిస్తున్నట్లు స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఫిట్‌నెస్ విషయంలో నిర్లక్ష్యం, పరస్పర సహాయ సహకారాలు అందించుకునే విషయంలో ఆటగాళ్ల మధ్య ఐక్యత లేదన్నది వాటి ప్రధాన సారాంశం. ఈ నేపథ్యంలో ప్రక్షాళన చర్యలు చేపట్టిన పీసీబీ ఆటగాళ్లను క్రమశిక్షణలో పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
సంస్కరణలకు శ్రీకారం
అదే విధంగా.. సెంట్రల్ కాంట్రాక్ట్ విషయంలోనూ సంస్కరణలు తేవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ.. పాక్ టెస్టు హెడ్‌కోచ్ జేసన్ గిల్లెస్పి, వన్డే- టీ20ల ప్రధాన కోచ్ గ్యారీ కిర్‌స్టెన్‌తో లాహోర్‌లో సోమవారం చర్చించినట్లు తెలుస్తోంది.
పాక్ బోర్డు అధికారులు ఈ విషయం గురించి టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. సెంట్రల్ కాంట్రాక్ట్ వ్యవధిని మూడేళ్ల నుంచి ఏడాదికి తగ్గించినట్లు తెలిపారు. ఇందుకు గల కారణాలు వెల్లడిస్తూ.. ‘‘సెంట్రల్ కాంట్రాక్ట్, ఆటగాళ్ల పారితోషికం విషయంలో చర్చ జరిగింది.
ఆ రెండిటి ఆధారంగా
క్రికెటర్ల ఫిట్‌నెస్, ప్రవర్తన ఆధారంగా ప్రతీ ఏడాది సెంట్రల్ కాంట్రాక్ట్‌ను రివైజ్ చేయాలని సెలక్టర్లు ప్రతిపాదించారు. అయితే, పారితోషికం విషయంలో మాత్రం ఎలాంటి కోత ఉండబోదు’’ అని పేర్కొన్నారు.
అంతేకాదు.. ‘‘పూర్తిస్థాయి ఫిట్‌నెస్ కలిగి ఉన్న ఆటగాళ్లు మాత్రమే ఇక నుంచి నిరంభ్యంతర పత్రాలు(NOCs- నో ఆబ్జక్షన్ సర్టిఫికెట్) ఇవ్వడం జరుగుతుంది. అది కూడా కేవలం అంతర్జాతీయంగా ప్రాముఖ్యం కలిగి ఉన్న లీగ్‌లలో మాత్రమే ఆడేందుకు అనుమతినివ్వాలనే యోచనలో ఉన్నాం’’ అని తెలిపారు.
కోచ్‌తో అతడి గొడవ
కాగా టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ సమయంలో కెప్టెన్ బాబర్ ఆజం, టీ20ల మాజీ సారథి షాహిన్ ఆఫ్రిది మధ్య విభేదాలు తారస్థాయికి చేరినట్లు వార్తలు వచ్చాయి. అంతేకాదు బ్యాటింగ్ కోచ్ మహ్మద్ యూసఫ్‌తో షాహిన్ అనుచితంగా ప్రవర్తించిన విషయం వెలుగులోకి వచ్చింది.
అయితే, వెంటనే అతడు కోచ్‌కు క్షమాపణలు చెప్పినట్లు సమాచారం. ఏదేమైనా ఆటగాళ్లను సరైన దారిలో పెట్టేందుకు పీసీబీ కాస్త కఠినంగానే వ్యవహరించనుందని బోర్డు సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.
కాగా చీఫ్ సెలక్టర్ వహాబ్ రియాజ్, సెలక్టర్ అబ్దుల్ రజాక్‌పై ఇప్పటికే పీసీబీ వేటు వేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే కెప్టెన్‌గా బాబర్ భవితవ్యం కూడా తేలనుంది.
చదవండి: ఇంత చెత్తగా వ్యవహరిస్తారా? యువీ, భజ్జీ, రైనాపై విమర్శలు
Comments
Please login to add a commentAdd a comment