టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. సూపర్-8కు అర్హత సాధించాలంటే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఆ జట్టు పేసర్ మార్క్‌వుడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
చిరకాల ప్రత్యర్థిగా భావించే ఆస్ట్రేలియా జట్టు తమ తదుపరి మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ను చిత్తుగా ఓడించాలని కోరుకున్నాడు. ఆదివారం నాటి మ్యాచ్‌లో తమ మద్దతు పూర్తిగా ఆస్ట్రేలియాకే ఉంటుందని పేర్కొన్నాడు.
కాగా స్కాట్లాండ్‌తో మ్యాచ్ రద్దవడం, ఆస్ట్రేలియా చేతిలో ఓడటంతో గ్రూప్ ‘బి’లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ ముందుకెళ్లే ఆశలు సన్నగిల్లిన విషయం తెలిసిందే. అయితే ఒకే ఒక్క విజయం... 3.1 ఓవర్లలో ముగించేయడం... 101 బంతులు మిగల్చడం... ఇంగ్లండ్‌ను ఒక్కసారిగా ఈ టి20 ప్రపంచకప్ రేసులోకి తీసుకొచ్చింది.
అంటిగ్వా వేదికగా... శుక్రవారం జరిగిన పోరులో బట్లర్ బృందం 8 వికెట్ల తేడాతో ఒమన్‌ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఒమన్ 13.2 ఓవర్లలో 47 పరుగులకే కుప్పకూలింది. షోయబ్ ఖాన్ (23 బంతుల్లో 11; 1 ఫోర్) ఇన్నింగ్స్ టాప్‌స్కోరర్‌గా నిలిచాడు.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఆదిల్ రషీద్ 11 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా... జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్ 12 పరుగుల చొప్పున ఇచ్చి చెరో 3 వికెట్లు తీశారు. తర్వాత ఇంగ్లండ్ 3.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 50 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ జోస్ బట్లర్ (8 బంతుల్లో 24 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), సాల్ట్ (3 బంతుల్లో 12; 2 సిక్స్‌లు) దంచేశారు.
ఈ నేపథ్యంలో సూపర్-8 రేసులోకి దూసుకువచ్చిన ఇంగ్లండ్.. శనివారం రాత్రి నమీబియాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కచ్చితంగా గెలవాలి. భారీ తేడాతో విజయం సాధిస్తే ఇంకా మంచిది.
అదే విధంగా జూన్ 16 నాటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా- స్కాట్లాండ్‌ను చిత్తు చిత్తుగా ఓడించాలి. ఈ రెండూ జరిగి.. నెట్ రన్‌రేటు పరంగా స్కాట్లాండ్ కంటే ఇంగ్లండ్ మెరుగ్గా ఉంటేనే తదుపరి దశకు అర్హత సాధిస్తుంది.
ఈ నేపథ్యంలో ఇంగ్లండ్- నమీబియా, ఆస్ట్రేలియా- స్కాట్లాండ్ మ్యాచ్‌లపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే, ఆసీస్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్.. ఇంగ్లండ్‌ను టోర్నీ నుంచి పంపడమే తమ లక్ష్యమని పేర్కొనడం వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే.
హాజిల్‌వుడ్ వ్యాఖ్యలను బట్టి స్కాట్లాండ్ చేతిలో ఆస్ట్రేలియా ఉద్దేశపూర్వకంగానే ఓడిపోవడానికి సిద్ధపడిందా అనే సందేహాలు తలెత్తాయి. అయితే, ఆ జట్టు స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ.. హాజిల్‌వుడ్ సరదాగానే ఆ వ్యాఖ్యలు చేశాడని పేర్కొన్నాడు.
ఈ నేపథ్యంలో మార్క్‌వుడ్ స్పందిస్తూ.. హాజిల్‌వుడ్ చేసిన వ్యాఖ్యలు తమ జట్టు గౌరవాన్ని పెంచుతున్నాయంటూ కౌంటర్ వేశాడు. ఇంగ్లండ్ వంటి పటిష్ట జట్టు ఎలిమినేట్ అయితే బాగుంటుందని ప్రతి జట్టు కోరుకుంటుందని.. ఏదేమైనా స్కాట్లాండ్‌పై ఆస్ట్రేలియా గెలవాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.
కాగా గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా ఇప్పటికే సూపర్-8లో అడుగుపెట్టగా.. శనివారం నాటి మ్యాచ్ ఫలితంతో ఇంగ్లండ్ భవితవ్యం తేలనుంది. పాయింట్ల పట్టికలో ఆసీస్ ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. స్కాట్లాండ్ 5 పాయింట్లు(నెట్ రన్‌రేటు +2.164), ఇంగ్లండ్ మూడు పాయింట్ల(నెట్ రన్‌రేటు +3.081)తో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment