జట్టును నాశనం చేసింది ఎవరో చెప్తా: ఆఫ్రిది | Shahid Afridi Vows To Name People Who Spoiled Pakistan Team After T20 WC 2024 Ends, See Details | Sakshi
Sakshi News home page

జట్టును నాశనం చేసింది ఎవరో చెప్తా: ఆఫ్రిది ఘాటు వ్యాఖ్యలు

Published Tue, Jun 11 2024 8:46 AM

Shahid Afridi Vows To Name People Who Spoiled Pakistan Team After T20 WC 2024 Ends

టీ20 ప్రపంచకప్‌-2024లో టీమిండియా చేతిలో ఓటమి నేపథ్యంలో పాకిస్తాన్‌పై విమర్శల పర్వం కొనసాగుతోంది. మెగా టోర్నీకి జట్టు ఎంపిక మొదలు.. బాబర్‌ ఆజం కెప్టెన్సీ, వ్యక్తిగత ప్రదర్శన వరకు ఏ ఒక్కటి సరిగ్గా లేదంటూ ఆ దేశ మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు.

పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు మాజీ చైర్మన్‌ రమీజ్‌ రాజా సహా వసీం అక్రం, కమ్రన్‌ అక్మల్‌, సలీం మాలిక్‌ తదితరులు భారత్‌తో మ్యాచ్‌లో పాక్‌ ఆట తీరును తీవ్ర స్థాయిలో విమర్శించారు. తాజాగా మాజీ కెప్టెన్‌ షాహిద్‌ ఆఫ్రిది కూడా ఈ జాబితాలో చేరాడు. ప్రపంచకప్‌ టోర్నీకి ముందు పాకిస్తాన్‌‌ కెప్టెన్‌గా తిరిగి నియమితుడైన‌ బాబర్‌ ఆజంపై అతడు విమర్శలు ఎక్కుపెట్టాడు.

‘‘కెప్టెన్‌ అనే వాడు జట్టును ఒకే తాటి మీదకు తెస్తాడు. జట్టును నాశనం చేయగల.. లేదంటే నిర్మించగల శక్తి అతడికి ఉంటుంది. ఈ వరల్డ్‌కప్‌ టోర్నీ ముగిసిన తర్వాత నేను ఈ విషయంపై ఇంకాస్త స్పష్టంగా మాట్లాడతాను’’ అని షాహిద్‌ ఆఫ్రిది పేర్కొన్నాడు.

అదే విధంగా తన అల్లుడు షాహిన్‌ ఆఫ్రిది కెరీర్‌లోని ఎత్తుపళ్లాల గురించి ప్రస్తావన రాగా.. ‘‘అతడితో నాకున్న బంధుత్వం కారణంగా.. నేను నా కూతురికి, అతడికి అనుకూలంగా మాట్లాడుతున్నానని చాలా మంది అనుకుంటారు.

నిజానికి నేను ఎప్పుడూ అలా మాట్లాడను. ఒకవేళ నా కూతురైనా.. అల్లుడైనా తప్పు చేస్తే తప్పు చేశారనే చెప్తాను. అంతేతప్ప వెనకేసుకురాను’’ అంటూ షాహిద్‌ ఆఫ్రిది ట్రోల్స్‌కు గట్టి కౌంటర్‌ ఇచ్చాడు.

కాగా భారత్‌ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌కప్‌-2023లో పాకిస్తాన్‌ కనీసం సెమీస్‌ కూడా చేరుకుండానే ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జట్టు ఓటములకు నైతిక బాధ్యత వహిస్తూ బాబర్‌ ఆజం కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నాడు.

ఫలితంగా పాకిస్తాన్‌ టీ20 కెప్టెన్సీ పదవి ప్రధాన పేసర్‌ షాహిన్‌ ఆఫ్రిదిని వరించింది. అయితే, అతడి సారథ్యంలో న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లిన పాకిస్తాన్‌ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 0-4తో కోల్పోయింది.

ఈ క్రమంలో పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు యాజమాన్యంలో పలు మార్పుల అనంతరం బాబర్‌ ఆజం తిరిగి వన్డే, టీ20 కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. అతడి నాయకత్వంలో వరల్డ్‌కప్‌నకు ముందు ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ ఆడిన పాకిస్తాన్‌ 0-2తో ఓడిపోయింది.

ఇక వరల్డ్‌కప్‌-2024లోనూ బాబర్‌ బృందం పరాజయాల పరంపర కొనసాగుతోంది. తమ తొలి మ్యాచ్‌లో యూఎస్‌ఏ చేతిలో ఓడిన పాకిస్తాన్‌.. రెండో మ్యాచ్‌లో భారత్‌ చేతిలోనూ పరాజయం పాలైంది. 

గ్రూపు దశలో మిలిగిన రెండు మ్యాచ్‌లలో గెలిస్తేనే ఈ టోర్నీలో పాక్‌ ముందడుగు వేయగలుగుతుంది. ఈ నేపథ్యంలో జట్టులో ఐక్యత లేనందువల్లే ఈ పరిస్థితి అంటూ షాహిద్‌ ఆఫ్రిది బాబర్‌ ఆజంను టార్గెట్‌ చేయడం గమనార్హం.

చదవండి: Ind vs Pak: కావాలనే బంతులు వృథా చేశాడు: పాక్‌ మాజీ కెప్టెన్‌ ఫైర్‌

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement