టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో భాగంగా చిరకాల ప్రత్యర్థి టీమిండియా చేతిలో పాకిస్తాన్ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు ఆ జట్టు మాజీ ఆటగాళ్లు. బాబర్ ఆజం బృందం ఆట తీరును విమర్శిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాగా ఐసీసీ ఈవెంట్లలో దాయాది పాక్‌పై భారత జట్టు విజయపరంపర కొనసాగుతోంది. న్యూయార్క్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రోహిత్ సేన మరోసారి పాక్‌ను విజయానికి దూరం చేసింది.
చివరి వరకు నువ్వా- నేనా అన్నట్లుగా సాగిన మ్యాచ్‌లో ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. నసావూ కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన పాకిస్తాన్.. భారత్‌ను 119 పరుగులకే కట్టడి చేసింది.
నసీం షా, హ్యారిస్ రవూఫ్ మూడేసి వికెట్లతో చెలరేగగా.. ఆమిర్ రెండు, షాహిన్ ఆఫ్రిది ఒక్కో పడగొట్టారు. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌కు ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్(31) శుభారంభం అందించినా.. మిగిలిన వాళ్ల నుంచి అతడికి సహకారం అందలేదు.
టీమిండియా పేసర్లు జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా అద్భుత రీతిలో బౌలింగ్ చేస్తూ.. పాక్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. వీరి దెబ్బకు పరుగులు రాబట్టడం పక్కనపెడితే వికెట్‌ను ఎలా కాపాడుకోవాలో తెలియక బ్యాటర్లు తలలు పట్టుకున్నారు.
ఉద్దేశపూర్వకంగానే?
ఈ క్రమంలో నత్తనడకన సాగిన పాక్‌కు ఇన్నింగ్స్ 113 పరుగుల వద్ద ముగిసిపోయింది. ఫలితంగా ఆరు పరుగుల తేడాతో పాక్‌కు ఓటమి తప్పలేదు. ఇక పాకిస్తాన్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన రిజ్వాన్ 44 బంతుల్లో 31 పరుగులు చేయగా.. ఇమాద్ వసీం అతడి తర్వాతి స్థానంలో నిలిచాడు.
ఇమాద్ వసీం 23 బంతులు ఎదుర్కొని కేవలం 15 పరుగులే చేశాడు. మిగతా వాళ్లు కూడా బుమ్రా ‘డాట్’ మ్యాజిక్‌కు చిత్తై చెత్త స్ట్రైక్‌రేటు నమోదు చేశారు.
ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సలీం మాలిక్ ఇమాద్ వసీంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇమాద్ ఇన్నింగ్స్ గమనిస్తే.. అతడు ఉద్దేశపూర్వకంగానే బంతులు వృథా చేసినట్లు అనిపించిందని ఆరోపించాడు. అతడి వల్లే లక్ష్య ఛేదన మరింత సంక్లిష్టంగా మారిందని సలీం మాలిక్ విమర్శించాడు.
చదవండి: వాళ్ల నుంచి ఇంతకంటే ఎక్కువ ఆశించలేం.. రెండు గెలిస్తేనే: బాబర్ ఆజం
Comments
Please login to add a commentAdd a comment