Ind vs Pak: పాక్‌ గెలుస్తుందని చెప్పాను.. కానీ: యువీ | Yuvraj Singh Consoles Shahid Afridi: I told you PAK will win but... | Sakshi
Sakshi News home page

Ind vs Pak: పాక్‌ గెలుస్తుందని చెప్పాను.. కానీ! ఆఫ్రిదిని ఓదార్చిన యువీ

Published Wed, Jun 12 2024 12:45 PM | Last Updated on Wed, Jun 12 2024 1:25 PM

Ind vs Pak: Yuvraj Singh Consoles Shahid Afridi: I told you PAK will win but

టీమిండియా- పాకిస్తాన్‌ మ్యాచ్‌ అంటే అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిరకాల ప్రత్యర్థుల మధ్య పోటీ చూడటానికి ఇరు దేశాల అభిమానులతో పాటు క్రికెట్‌ ప్రపంచం మొత్తం ఎదురుచూస్తుందనడం అతిశయోక్తి కాదు.

అయితే, ప్రపంచకప్‌ చరిత్రలో పాకిస్తాన్‌పై టీమిండియాదే పైచేయి. తాజాగా టీ20 ప్రపంచకప్‌-2024లో భాగంగా ఆదివారం నాటి మ్యాచ్‌లోనూ ఇదే పునరావృతమైంది. న్యూయార్క్‌లోని నసావూ కౌంటీ స్టేడియంలో జరిగిన దాయాదుల పోరులో భారత్‌ పాక్‌పై ఆరు పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది.

ఛేదించదగ్గ లక్ష్యానికి పాకిస్తాన్‌ చేరువవుతున్న వేళ టీమిండియా ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్ బుమ్రా.. దాయాది ఆశలను ఆవిరి చేశాడు. అద్భుత స్పెల్‌(3/14)తో భారత జట్టుకు విజయం అందించాడు.

ఇక భారత్‌- పాక్‌ మ్యాచ్‌ అంటే కేవలం గణాంకాలే కాదు  భావోద్వేగాల సమాహారం అన్న విషయం తెలిసిందే. ఇక గెలుస్తుందనుకున్న మ్యాచ్‌లో పాక్‌ ఓడిపోవడాన్ని ఆ దేశ అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు కూడా జీర్ణించుకోలేకపోయారు.

ఈ క్రమంలో పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ షాహిద్‌ ఆఫ్రిది- టీమిండియా మాజీ స్టార్‌ యువరాజ్‌ సింగ్‌ మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణ తెరమీదకు వచ్చింది. పాక్‌ ఓటమి నేపథ్యంలో ఆఫ్రిది ఉద్వేగానికి లోనుకాగా.. యువీ అతడిని ఓదార్చే ప్రయత్నం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా వైరల్‌ అవుతోంది.

యువీ- ఆఫ్రిది మధ్య సంభాషణ ఇలా..
యువీ: లాలా.. ఏమైంది? ఎందుకంత బాధగా ఉన్నావు?
ఆఫ్రిది: నేనిలా ఉండటం తప్పా? ఒప్పా? నువ్వే చెప్పు. అసలు ఈ మ్యాచ్‌ మేము ఓడిపోవాల్సిన మ్యాచ్‌కానే కాదు కదా!

విజయానికి మేము 40 పరుగుల దూరంలో ఉన్నపుడు.. యువరాజ్‌  నా దగ్గరకు వచ్చి ‘లాలా.. కంగ్రాట్స్! ఇక నేను మ్యాచ్‌ చూడను. వెళ్లిపోతున్నా‌’ అని చెప్పాడు.

వెంటనే నేను అతడికి బదులిస్తూ.. ‘‘ఈ పిచ్‌పై 40 పరుగుల అంటే అంత తేలికేమీ కాదు. ఇంత ముందుగానే కంగ్రాట్స్‌ చెప్పకు’’ అని యువీతో అన్నాను.

యువీ: పాకిస్తాన్‌ గెలుస్తుందని నేను చెప్పినప్పటికీ.. టీమిండియా విజయం సాధిస్తుందనే నమ్మకంతోనే ఉన్నాను. అయినా ఆటలో గెలుపోటములు సహజం. ఏదేమైనా మన మధ్య స్నేహం ఇలాగే కొనసాగుతుంది కదా!

కాగా టీ20 ప్రపంచకప్‌-2024 టోర్నీకి యువరాజ్‌ సింగ్‌తో పాటు షాహిద్‌ ఆఫ్రిది అంబాసిడర్లుగా ఉన్న విషయం తెలిసిందే.

చదవండి: అనుకున్నది సాధించలేకపోయాం.. కారణం అదే: బాబర్‌ ఆజం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement