రానున్న ఆరు నెలల్లో మరో క్రికెట్ మెగా టోర్నీకి తెరలేవనుంది. వచ్చే ఏడాది జూన్ 4 నుంచి టీ20 ప్రపంచకప్-2024 ఈవెంట్ ఆరంభం కానుంది. ఈ టోర్నమెంట్ సందర్భంగానైనా టీమిండియా ఐసీసీ ట్రోఫీ గెలవాలన్న కల తీరాలని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
పదేళ్లుగా భారత జట్టు ఒక్క మెగా టైటిల్ కూడా గెలవలేదన్న విషయం తెలిసిందే. పుష్కరకాలం తర్వాత వన్డే వరల్డ్‌కప్-2023 సందర్భంగా ఆ కరువు తీరుతుందనుకుంటే ఆఖరి మెట్టుపై రోహిత్ సేన బోల్తా పడింది.
అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలై ట్రోఫీ చేజార్చుకుంది. అయితే, ఆరు నెలల వ్యవధిలోనే టీ20 వరల్డ్‌కప్ రూపంలో టీమిండియాకు మరో అవకాశం దక్కనుంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్లు గౌతం గంభీర్, యువరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న ప్రపంచకప్-2024లో టీమిండియాకు గట్టి పోటీనిచ్చే జట్ల గురించి ఎదురైన ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘అక్కడి పిచ్‌లపై అఫ్గనిస్తాన్ మరింత ప్రమాదకారిగా మారుతుంది.
ఆస్ట్రేలియా కూడా సవాల్ విసురుతుంది. ఆ జట్టులో ఎంతో మంది ఇంపాక్ట్ ప్లేయర్లు ఉన్నారు. ప్రత్యర్థి జట్టు విజయావకాశాలను ఒంటి చేత్తో మార్చగల సత్తా ఉన్న వాళ్లు ఉన్నారు.
ఇక ఇంగ్లండ్ కూడా టీ20 క్రికెట్‌లో కచ్చితంగా బలమైన ప్రత్యర్థే’’ అని గంభీర్ పేర్కొన్నాడు. యువరాజ్ సింగ్ మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించాడు. ‘‘ఈసారి సౌతాఫ్రికా ప్రపంచకప్ గెలుస్తుందనుకుంటున్నాను. వరల్డ్‌కప్-2023 సందర్భంగా.. ఆ జట్టు పురోగతిని చూసిన తర్వాత నాకు ఈ అభిప్రాయం ఏర్పడింది.
పాకిస్తాన్ కూడా డేంజరస్ జట్టు’’ అని యువీ పేర్కొన్నాడు. ఇందుకు స్పందించిన గంభీర్.. ‘‘50 ఓవర్ల ప్రపంచకప్ టోర్నీలో పాకిస్తాన్ ఫీల్డింగ్ ఎలా ఉందో చూశాం కదా! అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత చెత్తగా ఫీల్డింగ్ చేయడం బహుశా ఇదే మొదటిసారి అనుకుంటా.
ఇక టీ20 ఫార్మాట్లో పోటీ పడాలంటే అలా చెత్తగా ఆడితే మాత్రం వారికి అసలు అవకాశాలు ఉండవు. గత ఐదారేళ్లలో టీమిండియా ఆఖరి వరకు పట్టుదలగా పోరాడిన తీరు చూశాం. ఈసారి భారత్ ఆ అవరోధాన్ని దాటుతుందనుకుంటున్నా’’ అని కుండబద్దలు కొట్టాడు. ఓ క్రీడా చర్చలో పాల్గొన్న గౌతీ- యువీ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment