
Photo Courtesy: BCCI
ఐపీఎల్-2025లో ఇవాళ (మార్చి 27) ఆసక్తికర సమరం జరుగనుంది. అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. తొలి మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో ఊహించని పరాజయాన్ని ఎదుర్కొన్న లక్నో సూపర్ జెయింట్స్‌ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ ఎస్‌ఆర్‌హెచ్ హోం గ్రౌండ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది.
ఈ మ్యాచ్ కోసం సన్‌రైజర్స్ అభిమానులు కళ్లకు వత్తులు పెట్టుకుని ఎదురుచూస్తున్నారు. వై నాట్ 300 అని టార్గెట్ పెట్టుకున్న తమ జట్టు ఈ మ్యాచ్‌లో తప్పక టార్గెట్‌ను రీచ్ అవుతుందని గంపెడాశలు పెట్టుకున్నారు. సన్‌రైజర్స్ ఈ సీజన్‌లో తమ తొలి మ్యాచ్‌లోనే టార్గెట్ 300ను దాదాపుగా రీచ్ అయినంత పని చేసింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీ 286 పరుగులు చేసింది.
తొలి మ్యాచ్‌లో మిస్ అయిన టార్గెట్ 300ను నేటి మ్యాచ్‌లో తప్పక రీచ్ అవ్వాలని ఎస్‌ఆర్‌హెచ్ ఆటగాళ్లు కూడా పట్టుదలగా ఉన్నారు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఏ జట్టు 300 పరుగులు చేయలేదు. ఐపీఎల్‌లో టాప్-3 అత్యధిక స్కోర్లు (287, 286, 277) సన్‌రైజర్స్ ఖాతాలోనే ఉన్నాయి. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ తప్పక 300 మార్కును తాకుతుందని క్రికెట్ పండితులు జోస్యం చెబుతున్నారు. దీని కోసమే సన్‌రైజర్స్ ఆడే ప్రతి మ్యాచ్‌ను అభిమానులు ఫాలో అవుతున్నారు.
నేడు మ్యాచ్ జరుగబోయే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం పిచ్ బ్యాటర్లకు స్వర్గధామం. ప్రస్తుతం సన్‌రైజర్స్ ఆటగాళ్లు ఉన్న ఫామ్‌ను బట్టి చూస్తే.. నేటి మ్యాచ్‌లో మరోసారి పరుగుల వరద పారడం ఖాయమని తెలుస్తుంది. నాలుగు రోజుల క్రితం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 286 పరుగులు చేయగా.. ఛేదనలో రాయల్స్ కూడా ఏమాత్రం తగ్గకుండా 242 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో రాయల్స్ 44 పరుగుల తేడాతో ఓడినా అద్భుతంగా పోరాడింది.
రాయల్స్ మ్యాచ్‌తో సన్‌రైజర్స్ తరఫున అరంగేట్రం చేసిన ఇషాన్ కిషన్.. విధ్వంసకర సెంచరీతో విరుచుకుపడ్డాడు. 47 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 106 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో మిగతా సన్‌రైజర్స్ ఆటగాళ్లు కూడా 200పైగా స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు సాధించారు. హెడ్ అర్ద సెంచరీ చేశాడు. అభిషేక్, క్లాసెన్ తమదైన శైలిలో ఉన్న కాసేపు విధ్వంసం సృష్టించారు. నితీశ్ రెడ్డి కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
ఐపీఎల్‌లో సన్‌రైజర్స్, లక్నో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడాయి. ఇందులో లక్నో మూడు గెలువగా.. సన్‌రైజర్స్ కేవలం ఒకే మ్యాచ్‌లో విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య చివరిగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్సే విజయం సాధించింది. గత సీజన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో లక్నో నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్ తొలి అర్ద భాగంలోనే ఛేదించి, 10 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఈ సీజన్‌లో సన్‌రైజర్స్, లక్నో రెండూ బలంగా కనిపిస్తున్నాయి. ఇరు జట్లలో విధ్వంసకర వీరులున్నారు. సన్‌రైజర్స్‌లో అభిషేక్, హెడ్, ఇషాన్, క్లాసెన్, నితీశ్ ఉంటే.. లక్నోలో మిచెల్ మార్ష్, పూరన్, మార్క్రమ్, మిల్లర్, పంత్ ఉన్నారు. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో ఓడినా లక్నో బ్యాటింగ్‌లో అదరగొట్టింది.
ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో మార్ష్, పూరన్ సుడిగాలి అర్ద శతకాలతో విరుచుకుపడ్డారు. ఈ మ్యాచ్‌లో లక్నో బౌలర్లు కూడా రాణించారు. అయితే ప్రత్యర్ధి ఆటగాళ్లు అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్ లక్నో చేతుల్లో నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నారు. గత మ్యాచ్‌తో పోలిస్తే నేటి మ్యాచ్‌లో లక్నో బౌలింగ్ మరింత బలపడనుంది. గాయం కారణంగా తొలి మ్యాచ్‌కు దూరంగా ఉన్న ఆవేశ్ ఖాన్ నేటి మ్యాచ్‌లో బరిలోకి దిగవచ్చు.
తుది జట్లు (అంచనా)..
సన్‌రైజర్స్: అభిషేక్ శర్మ, ట్రవిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ , అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్ (కెప్టెన్), హర్షల్ పటేల్, ఆడమ్ జంపా, మహమ్మద్ షమీ, సిమర్జీత్ సింగ్
లక్నో: ఐడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, రిషబ్ పంత్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, శార్దూల్ ఠాకూర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, దిగ్వేష్ రాఠీ, అవేష్ ఖాన్, మణిమారన్ సిద్దార్థ్