
బంతితో 3 వికెట్లు... బ్యాట్‌తో 93 పరుగులు
సీనియర్ మహిళల చాలెంజర్ ట్రోఫీ
డెహ్రాడూన్: జాతీయ సీనియర్ చాలెంజర్ ట్రోఫీలో తెలంగాణ ఆల్‌రౌండర్ గొంగడి త్రిష (137 బంతుల్లో 93; 15 ఫోర్లు, 1 సిక్స్) సత్తా చాటింది. టీమ్ ‘డి’కి ప్రాతినిధ్యం వహిస్తున్న త్రిష... టీమ్ ‘సి’తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. ఎర్రబంతితో మూడు రోజుల పాటు జరుగుతున్న ఈ మ్యాచ్‌లో బుధవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమ్ ‘డి’ 99 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది.
త్రిష త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా... ధారా గుజ్జర్ (212 బంతుల్లో 103 బ్యాటింగ్; 15 ఫోర్లు) అజేయ శతకంతో చెలరేగింది. కెప్టెన్ స్నేహ్ రాణా (28; 3 ఫోర్లు), నందిని (32; 5 ఫోర్లు), అమన్‌జ్యోత్ కౌర్ (34 బంతుల్లో 39 బ్యాటింగ్; 6 ఫోర్లు) రాణించారు. అంతకుముందు టీమ్ ‘సి’ 405/9 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.
హసబ్నిస్ (185 బంతుల్లో 169; 20 ఫోర్లు, 6 సిక్స్‌లు), షఫాలీ వర్మ (104 బంతుల్లో 108; 19 ఫోర్లు) సెంచరీలతో కదంతొక్కారు. టీమ్ ‘డి’ బౌలరల్లో త్రిష, కాశ్వీ గౌతమ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. నేడు ఆటకు ఆఖరి రోజు కాగా... ప్రస్తుతం చేతిలో 5 వికెట్లు ఉన్న టీమ్ ‘డి’... ప్రత్యర్థి స్కోరుకు ఇంకా 83 పరుగులు వెనుకబడి ఉంది. ధారా గుజ్జర్‌తో పాటు అమన్‌జ్యోత్ కౌర్ క్రీజులో ఉంది.