challenger trophy
-
భారత జట్లలో కల్పన, అంజలి, అరుంధతి
ముంబై: సీనియర్ మహిళల టి20 చాలెంజర్ ట్రోఫీలో పాల్గొనే భారత ‘ఎ’... ‘బి’... ‘సి’ జట్లను సోమవారం ప్రకటించారు. ఈ టోర్నీ జనవరి 4 నుంచి 11 వరకు కటక్లో జరుగుతుంది. భారత ‘బి’ జట్టులో ఆంధ్ర అమ్మాయిలు రావి కల్పన, అంజలి శర్వాణిలకు స్థానం లభించగా... భారత ‘సి’ జట్టులో హైదరాబాద్ అమ్మాయి అరుంధతి రెడ్డి ఎంపికైంది. భారత ‘ఎ’ జట్టుకు హర్మన్ప్రీత్ కౌర్... ‘బి’ జట్టుకు స్మృతి మంధాన... ‘సి’ జట్టుకు వేద కృష్ణమూర్తి సారథ్యం వహిస్తారు. -
యువీకి అవకాశం దక్కేనా!
చెన్నై: జట్టులో స్థానం కోల్పోయాక... ఫ్రాన్స్ వెళ్లి ఫిట్నెస్ శిక్షణ తీసుకున్న యువరాజ్ సింగ్... ఆ తర్వాత భారత ‘ఎ’ జట్టు తరఫున, చాలెంజర్ ట్రోఫీలో ‘బ్లూ’ జట్టు తరఫున అద్భుతంగా ఆడాడు. తిరిగి టీమిండియా జట్టులోకి ఎంపిక కావడమే లక్ష్యంగా పోరాడాడు. మరి యువీ కష్టానికి ఫలితం దక్కుతుందో లేదో సోమవారం తేలనుంది. ఆస్ట్రేలియాతో ఏకైక టి20, తొలి మూడు వన్డేల కోసం భారత జట్టును ఎంపిక చేసేందుకు నేడు సెలక్టర్లు సమావేశం కానున్నారు. జింబాబ్వే పర్యటనకు వెళ్లకుండా విశ్రాంతి తీసుకున్న ధోని, ఇతర క్రికెటర్లు మళ్లీ జట్టులోకి రానున్నారు. సెహ్వాగ్, గంభీర్, జహీర్లకు మరోసారి మొండిచెయ్యి తప్పకపోవచ్చు. చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టులో మార్పులు లేకుండా, అదనంగా యువరాజ్ ఒక్కడిని జట్టుతో చేర్చే అవకాశం ఉంది. ఒకవేళ 16 మంది కాకుండా... 15 మందితోనే జట్టును ఎంపిక చేస్తే యువరాజ్ కోసం... మురళీ విజయ్, దినేశ్ కార్తీక్లలో ఒకరిని తప్పించాల్సి ఉంటుంది. ఇర్ఫాన్ పఠాన్ గాయం కారణంగా అందుబాటులో లేని కారణంగా పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ కోటాలో అభిషేక్ నాయర్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. -
చాలెంజర్ ట్రోఫీ విజేత ‘బ్లూ’
ఇండోర్: భారత సెలక్టర్ల దృష్టిని ఆకర్షించడానికి లభించిన సువర్ణావకాశాన్ని గంభీర్, సెహ్వాగ్ వృథా చేసుకున్నారు. చాలెంజర్ ట్రోఫీలో పేలవ ఆటతీరుతో విఫలమయ్యారు. మరోవైపు యువరాజ్ సింగ్ కూడా నిరాశపరిచినా... ఇండియా బ్లూ జట్టు చాలెంజర్ ట్రోఫీని గెలుచుకుంది. భువనేశ్వర్ కుమార్ (4/39) ప్రతిభతో ఆదివారం జరిగిన ఫైనల్లో బ్లూ జట్టు 50 పరుగుల తేడాతో ఢిల్లీపై గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బ్లూ జట్టు 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. మనీష్ పాండే (78 బంతుల్లో 62; 6 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్. హైదరాబాదీ ఆటగాడు అక్షత్ రెడ్డి (22), కెప్టెన్ యువరాజ్ సింగ్ (29) విఫలమయ్యారు. ఢిల్లీ జట్టు 44.4 ఓవర్లలో 224 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. గంభీర్ (4), ఉన్ముక్త్ చంద్ (6), విరాట్ కోహ్లి (23), సెహ్వాగ్ (5) విఫలం కావడంతో... 46 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ ఇక కోలుకోలేకపోయింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ భువనేశ్వర్ కుమార్ నాలుగు వికెట్లు తీశాడు.