జట్టులో స్థానం కోల్పోయాక... ఫ్రాన్స్ వెళ్లి ఫిట్‌నెస్ శిక్షణ తీసుకున్న యువరాజ్ సింగ్... ఆ తర్వాత భారత ‘ఎ’ జట్టు తరఫున, చాలెంజర్ ట్రోఫీలో ‘బ్లూ’ జట్టు తరఫున అద్భుతంగా ఆడాడు. తిరిగి టీమిండియా జట్టులోకి ఎంపిక కావడమే లక్ష్యంగా పోరాడాడు.
చెన్నై: జట్టులో స్థానం కోల్పోయాక... ఫ్రాన్స్ వెళ్లి ఫిట్‌నెస్ శిక్షణ తీసుకున్న యువరాజ్ సింగ్... ఆ తర్వాత భారత ‘ఎ’ జట్టు తరఫున, చాలెంజర్ ట్రోఫీలో ‘బ్లూ’ జట్టు తరఫున అద్భుతంగా ఆడాడు. తిరిగి టీమిండియా జట్టులోకి ఎంపిక కావడమే లక్ష్యంగా పోరాడాడు. మరి యువీ కష్టానికి ఫలితం దక్కుతుందో లేదో సోమవారం తేలనుంది. ఆస్ట్రేలియాతో ఏకైక టి20, తొలి మూడు వన్డేల కోసం భారత జట్టును ఎంపిక చేసేందుకు నేడు సెలక్టర్లు సమావేశం కానున్నారు.
జింబాబ్వే పర్యటనకు వెళ్లకుండా విశ్రాంతి తీసుకున్న ధోని, ఇతర క్రికెటర్లు మళ్లీ జట్టులోకి రానున్నారు. సెహ్వాగ్, గంభీర్, జహీర్‌లకు మరోసారి మొండిచెయ్యి తప్పకపోవచ్చు. చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టులో మార్పులు లేకుండా, అదనంగా యువరాజ్ ఒక్కడిని జట్టుతో చేర్చే అవకాశం ఉంది. ఒకవేళ 16 మంది కాకుండా... 15 మందితోనే జట్టును ఎంపిక చేస్తే యువరాజ్ కోసం... మురళీ విజయ్, దినేశ్ కార్తీక్‌లలో ఒకరిని తప్పించాల్సి ఉంటుంది. ఇర్ఫాన్ పఠాన్ గాయం కారణంగా అందుబాటులో లేని కారణంగా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కోటాలో అభిషేక్ నాయర్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.