చాలెంజర్ ట్రోఫీ విజేత ‘బ్లూ’
ఇండోర్: భారత సెలక్టర్ల దృష్టిని ఆకర్షించడానికి లభించిన సువర్ణావకాశాన్ని గంభీర్, సెహ్వాగ్ వృథా చేసుకున్నారు. చాలెంజర్ ట్రోఫీలో పేలవ ఆటతీరుతో విఫలమయ్యారు. మరోవైపు యువరాజ్ సింగ్ కూడా నిరాశపరిచినా... ఇండియా బ్లూ జట్టు చాలెంజర్ ట్రోఫీని గెలుచుకుంది. భువనేశ్వర్ కుమార్ (4/39) ప్రతిభతో ఆదివారం జరిగిన ఫైనల్లో బ్లూ జట్టు 50 పరుగుల తేడాతో ఢిల్లీపై గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బ్లూ జట్టు 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది.
మనీష్ పాండే (78 బంతుల్లో 62; 6 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్. హైదరాబాదీ ఆటగాడు అక్షత్ రెడ్డి (22), కెప్టెన్ యువరాజ్ సింగ్ (29) విఫలమయ్యారు. ఢిల్లీ జట్టు 44.4 ఓవర్లలో 224 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. గంభీర్ (4), ఉన్ముక్త్ చంద్ (6), విరాట్ కోహ్లి (23), సెహ్వాగ్ (5) విఫలం కావడంతో... 46 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ ఇక కోలుకోలేకపోయింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ భువనేశ్వర్ కుమార్ నాలుగు వికెట్లు తీశాడు.