యానాంలో నేడు పోలింగ్‌ | Sakshi
Sakshi News home page

యానాంలో నేడు పోలింగ్‌

Published Fri, Apr 19 2024 2:40 AM

ఈవీఎంలను పోలింగ్‌బూత్‌లకు 
తీసుకువెళుతున్న ఎన్నికల సిబ్బంది - Sakshi

యానాం: పుదుచ్చేరి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానాంలో శుక్రవారం జరిగే మొదటి దఫా పోలింగ్‌కు ఎన్నికల యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 33 పోలింగ్‌ బూత్‌లకు ఈవీఎంలు తదితర ఎన్నికల సామగ్రితో సిబ్బంది బస్సులో తరలివెళ్లారు. స్థానిక సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూమ్‌ నుంచి ఈవీఎంలను తీసుకువెళ్లారు. ప్రైసెడింగ్‌ ఆఫీసర్‌, పోలింగ్‌ ఆఫీసర్లు, వాలంటీర్లు, పోలీసుయంత్రాంగం సైతం ఆయా పోలింగ్‌బూత్‌లకు చేరుకున్నారు. యానాంతో పాటు పుదుచ్చేరి ప్రాంతం నుంచి సైతం అదనపు పోలీసు బలగాలు తరలివచ్చా యి. వీరితో పాటు పారా మిలటరీ దళాలను ఆయా పోలింగ్‌బూత్‌ల వద్ద నియమించారు. 33 పోలింగ్‌బూత్‌లకు 33 ఈవీఎంలతో పాటు రిజర్వుగా మరో 13 ఈవీఎంలు ఉంచినట్లు అధికారులు తెలిపారు. సుమారు 300కు పైగా ఎన్నికల సిబ్బందిని నియమించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అన్ని రాజకీయ పక్షాలు సహకరించాలని అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి మునిస్వామి కోరారు. ఎస్పీ రాజశేఖరన్‌, సీఐ షణ్ముగం తదితరులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

Advertisement
Advertisement