భరోసా కావాలి! | Sakshi
Sakshi News home page

భరోసా కావాలి!

Published Fri, May 10 2024 12:06 AM

Sakshi Editorial On Corona Vaccine

పిల్ల పోయినా... పురుటి కంపు పోలేదని ఒక ముతక సామెత. కరోనా అనే మాట క్రమంగా విన మరుగవుతూ వస్తున్నా, దాని ప్రకంపనలు మాత్రం మానవాళిని ఆందోళనకు గురి చేస్తూనే ఉన్నాయి. కరోనా టీకా కోవిషీల్డ్‌పై తాజాగా వస్తున్న వార్తలే అందుకు తార్కాణం. సదరు టీకా తీసుకోవడం వల్ల మనిషిలో రక్తం గడ్డలు కట్టడం, రక్తంలోని ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గడం (వైద్య పరిభాషలో ‘థ్రోంబో సైటోపేనియా సిండ్రోమ్‌’ – టీటీఎస్‌) లాంటి అరుదైన దుష్ప్రభావాలుంటాయని దాన్ని రూపొందించిన బ్రిటన్‌ దిగ్గజ ఔషధ సంస్థ ఆస్ట్రాజెనెకా లండన్‌ కోర్టులో ఒప్పుకుంది. 

దాంతో గత వారం గందరగోళం మొదలైంది. తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఆ టీకాను ఉపసంహరిస్తు న్నట్టు ఆస్ట్రాజెనెకా బుధవారం ప్రకటించడంతో, భారత్‌లో కోవిషీల్డ్‌గా, యూరప్‌లో వాక్స్‌జెవ్రి యాగా అమ్ముడైన కోవిడ్‌ టీకాపై రచ్చ పరాకాష్ఠకు చేరింది. కరోనా టీకాల భద్రతపై చాలాకాలంగా జరుగుతున్న చర్చలకు తాజా పరిణామాలు యాదృచ్ఛికంగా కొత్త ఊపిరినిచ్చాయి. మన దేశంలో సుప్రీమ్‌ కోర్ట్‌ సైతం ఆస్ట్రాజెనెకా టీకాపై వచ్చిన పిటిషన్‌ విచారణకు అంగీకరించడం గమనార్హం. 

ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే – కోవిడ్‌ మహమ్మారితో ప్రపంచం అల్లాడుతున్న సమయంలో ప్రజారోగ్యంలో ఆక్స్‌ఫర్డ్‌ – ఆస్ట్రాజెనెకా టీకా కీలక భూమిక పోషించింది. క్లినికల్‌ పరీక్షల అనంతరం 2021 జనవరి 4న టీకా తొలి డోస్‌ వినియోగించారు. ఆ ఒక్క ఏడాదే దాదాపు 250 కోట్ల డోసులు వేశారు. లక్షలాది ప్రాణాలను కాపాడారు. 2021 ప్రథమార్ధంలో భారతదేశంలో డెల్టా వేరియంట్‌ పెచ్చరిల్లినప్పుడు కూడా ఇదే సంజీవని. 

ప్రపంచదేశాల మధ్య టీకాల సరఫరాలో చిక్కులున్నప్పుడూ ఆ మానవతా సంక్షోభ పరిష్కారానికి అందుబాటులో ఉన్న కొన్నిటిలో ఇదీ ఒకటి. ఫైజర్, మోడర్నా, నోవావ్యాక్స్, వగైరాల లానే ఈ టీకా కూడా అనేక స్థాయుల పరీక్షలకు లోనైంది. మూడు విడతల ట్రయల్స్‌లో వేలాది ప్రజలపై పరీక్షలు చేసి, సురక్షితమనీ, ప్రభావశీలమనీ తేలాకనే అను మతులిచ్చారు. బ్రిటన్‌ సహా యూరప్‌లోని పలు దేశాల్లో 2021 ఆరంభంలో దీన్ని పంపిణీ చేశారు.

నిజానికి, ఈ టీకా వినియోగం వల్ల కొన్ని దుష్ఫలితాలు ఉండవచ్చని బ్రిటన్‌ ప్రభుత్వం 2021 ఫిబ్రవరిలోనే చెప్పింది. కానీ, ప్రపంచవ్యాప్తంగా వారానికి 40 లక్షల కొత్త కేసులొస్తూ, కరోనా తీవ్రత భయం రేపుతున్న సమయమది. దిక్కుతోచని ఆ పరిస్థితుల్లో... టీకాతో అరుదుగా వచ్చే ముప్పు కన్నా ఉపయోగాలే ఎక్కువని ప్రపంచ ఆరోగ్య సంస్థ లాంటివి భావించాయి. పైగా, మహిళలు వాడే గర్భనిరోధక మాత్రల లాంటి అనేక ఇతర ఔషధాలతో పోలిస్తే ఈ టీకాతో రక్తం గడ్డలు కట్టే రేటు బాగా తక్కువనీ, ప్రతి వెయ్యిమందిలో ఒక్కరికే ఆ ప్రమాదం ఉంటుందనీ లెక్కల్లో తేల్చారు. 

అందుకే, ప్రపంచ క్షేమం కోసం ఈ టీకాను కొనసాగించారు. ఇక, భారత్‌ సంగతెలా ఉన్నా విదేశాల్లో కరోనా టీకాతో సహా ఏ ఔషధంతో ఇబ్బంది తలెత్తినా బాధితులకు నష్టపరిహార పథకాలున్నాయి. అయితే, అక్కడ కూడా నష్టపరిహారం అందడంలో చిక్కులు ఎదురవడంతో సమస్య వచ్చింది. టీటీఎస్‌ వల్ల బ్రిటన్‌లో కనీసం 81 మంది చనిపోగా, వందల మంది అనారోగ్యం బారిన పడ్డారు. నష్టపరిహారం కోరుతూ బాధిత కుటుంబాలు కోర్టుకెక్కాయి. అలా దాదాపు 51 కేసులు ఎదుర్కొంటున్న ఆస్ట్రాజెనెకా లండన్‌లోని హైకోర్ట్‌లో తొలిసారిగా టీకా దుష్ప్రభావాలను అంగీకరించింది. 

సహజంగానే ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా, మరీ ముఖ్యంగా 175 కోట్లకు పైగా కోవిషీల్డ్‌ టీకా డోసులు తీసుకున్న మన దేశ ప్రజానీకంలో కలకలం రేపింది. ఒక దశలో లక్షలాది ప్రజానీకాన్ని కాపాడి, ప్రపంచానికి రక్షాకవచంగా కనిపించిన టీకా ఇప్పుడిలా భయాందోళనలకు కారణం కావడం విచిత్రమే. కానీ, ప్రాణాంతక మహమ్మారిని కట్టడి చేసేందుకు మరో మార్గం లేని దశలో ఈ టీకాలే దిక్కయ్యాయని మర్చిపోరాదు. 

ప్రాణరక్షణ కోసం ప్రపంచంలోని అన్ని ప్రభుత్వాలూ, ఔషధ సంస్థలూ టీకాలను తీసుకురావడంలో కొంత హడావిడి పడివుండవచ్చు. లాభనష్టాలపై ప్రజల్ని మరింత చైతన్యం చేసి, టీకా కార్యక్రమం చేపట్టి ఉండవచ్చు. అయితే, కోట్లాది ప్రాణాలకు ముందుగా ప్రాథమిక భద్రతే ధ్యేయంగా టీకాల వినియోగం త్వరితగతిన సాగిందని అర్థం చేసు కోవాలి. పైగా, టీకా దుష్ప్రభావాలు అత్యంత అరుదుగా కొందరిలోనే కనిపిస్తాయని వైద్య నిపు ణులు ఇప్పటికీ స్పష్టం చేస్తున్నందున అతిగా ఊహించుకొని ఆందోళన చెందడం సరికాదు.

ఆస్ట్రాజెనెకా వారి టీకా మంచిదే అయినా, ఫైజెర్, మోడర్నా లాంటి ఇతర టీకాలు మెరుగైనవని నిపుణుల మాట. మరింత భద్రత, ప్రభావశీలత ఉన్న ఎంఆర్‌ఎన్‌ఏ వెర్షన్లు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. దానికి తోడు బాధితుల కేసులు. ఫలితంగా, ఆస్ట్రాజెనెకా తన టీకాలను ఉపసంహ రించుకోక తప్పలేదు. కోర్టు కేసులకూ, తమ ఉపసంహరణకూ సంబంధం లేదనీ, రెండూ కాకతాళీ  యమేననీ ఆ సంస్థ చెబుతున్నా, ఇదంతా నష్టనివారణ చర్యల్లో భాగంగానే కనిపిస్తోంది. అది అటుంచితే, రోగుల భద్రతే తమ ప్రాధాన్యమని ఆస్ట్రాజెనెకా పునరుద్ఘాటిస్తే సరిపోదు. 

టీకా వాడకం వల్ల తలెత్తిన ఆరోగ్య సమస్యలకు విరుగుడు ఆలోచించి, ప్రజల్లో భరోసా పెంచాలి. బాధ్యత వహించి, బాధిత రోగులకు సత్వర నష్టపరిహారం చెల్లించి తీరాలి. టీకాలో లోపమెక్కడ జరిగిందో క్షుణ్ణంగా పరిశోధించాలి. ప్రభుత్వాలు సైతం ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలి. టీకా వినియోగం సురక్షితమేనని ప్రకటించడానికి అనుసరిస్తున్న ప్రమాణాలేమిటో ఒకసారి సమీక్షించాలి. కఠినమైన ప్రమాణాలు పాటించకుండానే కోవిషీల్డ్‌ వినియోగానికి పచ్చజెండా ఊపిన నియంత్రణ అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే, ప్రస్తుత పరిణామాలతో ప్రజలకు టీకాల పైన, వాటి తయారీదార్లపైన, చివరకు ఆరోగ్య వ్యవస్థ మీదే నమ్మకం సడలితే అది మరింత ప్రమాదం. 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement