వరల్డ్ క్రికెట్ భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు ఉన్న క్రేజే వేరు. ఏ దేశంలో ఆడుతున్నారనేది సంబంధం లేకుండా దాయాదుల పోరును చూసేందుకు ప్రేక్షకులు స్టేడియాలకు పోటెత్తుతారు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు టీవీలకు అతుక్కుపోతారు.
ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా గత కొన్నేళ్లుగా ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరు జట్లు కేవలం ఐసీసీ టోర్నీ, ఆసియాకప్‌లలో మాత్రం తలపడుతోంది.
దీంతో తమ ఆరాధ్య జట్లు ఎప్పుడెప్పుడు తలపడతాయా క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అభిమానుల నిరీక్షణకు తెరదించే సమయం అసన్నమైంది. టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా జూన్ 9న న్యూయర్క్ వేదికగా భారత్-పాకిస్తాన్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు జట్ల బలాబలాలపై ఓ లుక్కేద్దం.
పాక్‌ను మట్టికరిపిస్తుందా?
ఈ ఏడాది పొట్టి ప్రపంచకప్‌ను టీమిండియా విజయంతో ఆరంభించింది. ఐర్లాండ్‌పై గెలిచి మంచి జోష్‌లో ఉన్న భారత జట్టు.. అదే జోరును చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌పై కూడా కొనసాగించాలని భావిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ అన్ని విభాగాల్లో భారత జట్టు పటిష్టంగా కన్పిస్తోంది.
బ్యాటింగ్ విభాగంలో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ వంటి అద్బుతమైన ఆటగాళ్లు ఉన్నారు. వీరిందరూ ఐపీఎల్‌లో సత్తాచాటి ఈ మెగా టోర్నీలో అడుగుపెట్టారు.
ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్, సూర్యకుమార్ విఫలమైనప్పటకి.. రోహిత్, పంత్ మాత్రం తమ బ్యాట్‌కు పనిచెప్పారు. మరోవైపు ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో నిరాశపరిచిన స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. తన ఫామ్‌ను తిరిగి పొందడం టీమిండియాకు కలిసొచ్చే ఆంశం.
ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో హార్దిక్ 3 వికెట్ల తేడాతో సత్తాచాటాడు. అటు బౌలింగ్ పరంగా భారత జట్టు మెరుగ్గా ఉంది. టీమిండియా బౌలింగ్ ఎటాక్‌కు జస్ప్రీత్ బుమ్రా నాయకత్వం వహిస్తుండగా.. సిరాజ్, అర్షదీప్ తమ బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నారు. ఐర్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనూ ఈ పేస్‌త్రయం నిప్పులు చేరిగారు. మరోసారి భారత బ్యాటర్లు, బౌలర్లు చెలరేగితే పాకిస్తాన్‌కు తిప్పలు తప్పవు.
పాక్ మ్యాజిక్ చేస్తుందా?
ఇక పాకిస్తాన్ జట్టు ప్రస్తుతం చెప్పుకొదగ్గ ఫామ్‌లో లేదు. ఈ మెగా టోర్నీ ఆరంభానికి ముందు ఇంగ్లండ్ చేతిలో సిరీస్ ఓటమి చవిచూసింది. తేకాకుండా ఐర్లాండ్ పర్యటనలో జరిగిన తొలి టీ20లో కూడా పాకిస్తాన్ పరాయం పాలైంది. వరుస ఓటములతో అమెరికా గడ్డపై అడుగుపెట్టిన బాబర్ సేన యఎస్‌ఏతో తొలి మ్యాచ్‌కు సిద్దమైంది.
అయితే టీ20ల్లో భారత్‌పై పాకిస్తాన్‌కు మంచి రికార్డు లేనప్పటకి.. దాయాదిని మాత్రం తక్కువగా అంచనా వేయలేం. కెప్టెన్ బాబర్ ఆజంతో పాటు పేసర్ షహీన్ షా అఫ్రిది పాక్ జట్టుకు కొండంత బలం. వీరిద్దరితో పాటు మహ్మద్ రిజ్వాన్, ఫఖార్ జమాన్, ఇఫ్తికర్ ఆహ్మద్ వంటి కీలక ఆటగాళ్లు ఉన్నారు.
అదేవిధంగా సీనియర్ పేసర్ మహ్మద్ అమీర్ కూడా రీ ఎంట్రీ ఇవ్వడం పాక్ జట్టుకు కలిసిచ్చే ఆంశం. దాయాది జట్టు మాత్రం సమిష్టగా రాణిస్తే టీమిండియా గట్టి పోటీ ఎదురుకాక తప్పదు. అయితే పాకిస్తాన్‌ను మాత్రం కొన్ని బలహీనతలు వెంటాడుతున్నాయి. ఒత్తిడికి అస్సలు తట్టుకోలేదు. అదేవిధంగా పాకిస్తాన్ ఫీల్డింగ్ కూడా చాలా దారుణంగా ఉంటుంది. తమ లోపాలను పాకిస్తాన్ ఏ మెరకు అధిగమిస్తుందో వేచి చూడాలి.
టీమిండియాదే పై చేయి..
ఇక టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో పాకిస్తాన్‌పై టీమిండియాదే పై చేయి. ఇప్పటివరకు ఇరు జట్లు పొట్టి ప్రపంచకప్‌లో ఏడు సార్లు ముఖాముఖి తలపడగా.. భారత్ ఆరింట విజయం సాధించగా, పాక్ కేవలం ఒకే మ్యాచ్‌లో గెలుపొంది. 2021 టీ20 వరల్డ్‌కప్‌లో భారత్‌పై 10 వికెట్ల తేడాతో పాక్ విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment