Sakshi News home page

కొరకరాని కొయ్య ట్రంప్‌!

Published Wed, Mar 6 2024 4:39 AM

Sakshi Editorial On USA Elections And Donald Trump

ఎన్ని అడ్డదారులు తొక్కినా, ఎలాంటి ప్రసంగాలు చేస్తున్నా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మొదట రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిత్వాన్నీ, ఆ తర్వాత అధ్యక్ష స్థానాన్నీ డోనాల్డ్‌ ట్రంప్‌ గెల్చుకోవటం ఖాయమని తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి. కొలరాడోలో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిత్వం కోసం జరిగే ఎన్నికలో బ్యాలెట్‌ పత్రంపై ట్రంప్‌ పేరు తొలగించాలన్న ఆ రాష్ట్ర సుప్రీంకోర్టు తీర్పును దేశ సర్వోన్నత న్యాయస్థానం ఏకగ్రీవంగా తోసిపుచ్చటం ఆయనకు కొత్త శక్తినిస్తుందనటంలో సందేహం లేదు.

‘సూపర్‌ ట్యూజ్‌డే’ కింద మంగళవారం ఒకేసారి పదిహేను రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం ఎన్నికలు జరగనుండగా ఒకరోజు ముందు ఈ తీర్పు వెలువడింది. ట్రంప్‌ ఇప్పటికే అయోవా, న్యూహాంప్‌షైర్, నెవడా ప్రైమరీలను గెల్చుకోవటంతోపాటు తన ప్రత్యర్థి హేలీకి బలం వుంటుందని భావించిన ఆమె స్వస్థలం సౌత్‌ కరోలినాలో సైతం సత్తా నిరూపించుకున్నారు. ‘సూపర్‌ ట్యూజ్‌డే’ పోలింగ్‌లో సైతం ఆయనదే పైచేయి అని ప్రాథమిక సమాచారం చెబుతోంది.

అయితే రకరకాల కేసుల్లో చిక్కుకుని వాటినుంచి బయటపడటానికి అనుసరించాల్సిన వ్యూహంపై న్యాయవాదులతో నిరంతరం సంప్రదింపులు జరపాల్సిరావటం, న్యాయస్థానాలకు హాజరుకావటం ట్రంప్‌ ప్రచారాన్ని దెబ్బతీస్తోందనే చెప్పాలి. న్యాయస్థానాలకు సెలవు దినాలైన శని, ఆదివారాల్లో మాత్రమే ఆయన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. వాటిల్లో సైతం సరిగా దృష్టి సారించలేకపోతున్నారు. ప్రసంగాలకు బదులు కరచాలనాలతో సరిపెడుతున్నారు. 

అయితే ఇదంతా ట్రంప్‌ స్వయంకృతం. దేశాధ్యక్ష ఎన్నికల్లో తనకు లభించిన విజయాన్ని డెమాక్రాటిక్‌ పార్టీ కొల్లగొట్టిందని ఆరోపిస్తూ కాపిటల్‌ హిల్‌పైకి మద్దతుదార్లను ఉసిగొల్పి విధ్వంసానికి కారకులయ్యారు. దాదాపు మూడు గంటలపాటు ఆ భవన సముదాయాన్ని మూకలు చేజిక్కించుకున్నాయి. ఆయన ప్రత్యర్థి, డెమాక్రాటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ విజయాన్ని ధ్రువీకరించటానికి 2021 జనవరిలో అమెరికా సెనేట్, ప్రతినిధుల సభ సంయుక్త సమావేశాన్ని నిర్వహిస్తున్న సమయంలో జరిగిన ఆ దాడి దేశంలోనే కాదు... ప్రపంచవ్యాప్తంగా అందరినీ నివ్వెరపరిచింది.

నిజానికి ఈ కేసులోనే కొలరాడో సుప్రీంకోర్టు అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీపడే అర్హతను ట్రంప్‌ కోల్పో యారని తీర్పునిచ్చింది. రాజ్యాంగంపై ప్రమాణం చేసి అధికారంలోకొచ్చిన ఎవరైనా అందుకు భిన్నంగా తిరుగుబాట్లను రెచ్చగొడితే భవిష్యత్తులో పదవులు చేపట్టటానికి అనర్హులవుతారని చెప్పే రాజ్యాంగం 14వ సవరణలోని సెక్షన్‌ 3కి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంది. మెయిన్, ఇల్లి నాయీ సుప్రీంకోర్టులు సైతం ఇలాగే నిర్ణయం తీసుకునే అవకాశం వున్నదని అందరూ అనుకున్నారు. కానీ దేశ సుప్రీంకోర్టు తీర్పుతో అవి నిలిచిపోయాయి.

జాతీయ స్థాయి ఎన్నికల్లో పోటీపడే అభ్యర్థులపై ఇలా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం నిర్ణయాలు తీసుకుంటే... అవి పరస్పర విరుద్ధంగా వుంటే ఒకరకమైన అరాచకానికి దారితీస్తుందని ధర్మాసనంలోని తొమ్మిదిమంది న్యాయ మూర్తులూ భావించారు. వీరిలో ఆరుగురు మితవాద న్యాయమూర్తులైతే మరో ముగ్గురు ఉదార వాదులు. దేశమంతటికీ వర్తించేలా పార్లమెంటు మాత్రమే అలాంటి నిర్ణయం తీసుకోవాలన్నది వారి ఉద్దేశం. అయితే పార్లమెంటు ఉభయసభలైన సెనేట్, ప్రతినిధుల సభల్లో అధికార విపక్షాలిద్దరికీ చెరోచోటా ఆధిక్యత వున్నప్పుడు సమస్య మరింత జటిలంగా మారుతుంది.

ట్రంప్‌ అధ్యక్ష పదవి గెల్చుకున్నాక దాన్ని ధ్రువీకరించటానికి నిర్వహించే పార్లమెంటు సమావేశం కాస్తా ఆయన ఎన్నికను రద్దు చేస్తే దేశవ్యాప్తంగా ఎలాంటి పరిస్థితులు చోటుచేసుకుంటాయన్నది ఊహాతీతం. కాపిటల్‌ హిల్‌పై దాడికి సంబంధించి ట్రంప్‌పై నాలుగు వేర్వేరు కేసులు విచారణలో వున్నాయి. వాటిల్లోని దాదాపు 93 ఆరోపణలనూ ఆయన తోసిపుచ్చారు. ఆ నేరాలు తాను చేయలేదనటం మాత్రమే కాదు... ఇవన్నీ పదవిలో వుండగా వచ్చిన ఆరోపణలు కనుక అధ్యక్షుడిగా తనకు రక్షణ వుంటుందంటున్నారు.

అధ్యక్ష పదవిలో వున్న నాయకుడిపై క్రిమినల్‌ నేరారోపణలు రావటం అమెరికా చరిత్రలో ఇదే మొదటిసారి.  కాపిటల్‌ హిల్‌పై దాడికి ఆయన పిలుపు ఇచ్చివుండొచ్చుగానీ, ఆయన స్వయంగా ఈ దాడిలో పాల్గొనలేదన్నది ట్రంప్‌ న్యాయవాదుల వాదన. ఈ విషయంలో దేశ సుప్రీంకోర్టు ఏం చెబుతుందన్నది ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న. వాస్తవానికి వచ్చే నెల 22న సుప్రీంకోర్టు దీనిపై విచారణను ప్రారంభించాలి. కానీ ప్రతి దశలోనూ ఏదో ఒక అభ్యంతరంతో అడ్డుకుంటున్న ట్రంప్‌ న్యాయవాదులు దాన్ని సజావుగా సాగనిస్తారా అన్నది చూడాల్సివుంది. 

అయితే ట్రంప్‌ కష్టాలు ఈ కేసుతో తీరిపోతాయనడానికి లేదు. ఆయన చుట్టూ మరిన్ని కేసులున్నాయి. నీలి చిత్రాల తార స్టార్మీ డేనియల్స్‌ తనపై ఆరోపణలు చేయకుండా వుండటానికి ఆమెకు భారీ మొత్తంలో డబ్బు ముట్టజెప్పారన్న అభియోగం అందులో ఒకటి. న్యూయార్క్‌ రియల్‌ ఎస్టేట్‌ మోసం కేసులో ఆయన 50 కోట్ల డాలర్ల పరిహారం చెల్లించాలని తీర్పు వెలువడింది. ప్రస్తుతం ఆ మొత్తాన్ని సమీకరించటానికి ఆయన పాట్లు పడుతున్నారు. అధ్యక్ష ఎన్నికల కోసం విరాళాలు సేకరించటం సరేసరి.

ఇదిగాక ట్రంప్‌ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని కాలమిస్టు జీన్‌ కరోల్‌ ఆరోపించారు. అందులో 50 లక్షల డాలర్ల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించగా, ఆమె పరువు ప్రతిష్ఠలు దెబ్బతీశారన్న ఆరోపణకు సంబంధించి 8 కోట్ల 30 లక్షల డాలర్లు ఇవ్వాలని మరో కోర్టు నిర్ణయించింది. వీటిపై అప్పీళ్లకు వెళ్లదల్చుకున్నారు. జనంలో వరస విజయాలు సాధిస్తున్న ట్రంప్‌ను న్యాయస్థానాల ద్వారా నిరోధించే డెమాక్రాటిక్‌ పార్టీ వ్యూహం వారికి ఏమేరకు లాభిస్తుందో వేచిచూడాలి.   

Advertisement
Advertisement