బీజేపీ పెద్దలతో సమావేశాల్లో ఏం చెప్పినా ‘ఎస్ బాస్’
అన్నిటికీ తల ఊపి.. చచ్చిచెడీ పొత్తు
బయట మాత్రం డాంబికాలు.. పొత్తుకు వాళ్లే పిలిచారని వ్యాఖ్య
అన్ని రాష్ట్రాలూ ల్యాండ్ టైట్లింగ్ చట్టం తేవాలన్నది కేంద్రమే
ఆ చట్టం ఇంకా అమల్లోకి రాకముందే బాబు బ్యాచ్ దుష్ప్రచారం
ఆ చట్టం ద్వారా ప్రభుత్వం భూములు లాక్కుంటోందంటూ విషం
మరి ఆ చట్టాన్ని తెమ్మన్న బీజేపీతో జట్టు కట్టడమెందుకు బాబూ?
స్టీల్ ప్లాంటు ప్రయివేటీకరణకే కట్టుబడి ఉన్నామంటున్న బీజేపీ
ఆ పార్టీతో కూటమి గట్టి.. అలా జరగనివ్వబోమంటూ బాబు బడాయి
ప్రత్యేక హోదాపైనా ఇంతే.. అది ముగిసిన అధ్యాయమన్న బీజేపీ
ప్యాకేజీ తీసుకుని మరీ.. ఎన్నికల ముందు నారా నోట హోదా మాట
దాన్ని మేనిఫెస్టోలో చేర్పించగలరా? అని ప్రశ్నిస్తే మాత్రం మౌనం
ముస్లిం రిజర్వేషన్లను తొలగిస్తామని స్పష్టంగా చెబుతున్న కమలం
ఆ ప్రస్తావన వచ్చినపుడు బాబు మాత్రం మౌనం
తమతో అన్నింటికీ బాబు అంగీకరించారని బీజేపీ స్పష్టీకరణ
అంటే.. బాబు లోపల అంగీకరించి,బయట బడాయికి పోతున్నాడనేది తేటతెల్లం
ఈ వైఖరులతో మరోసారి బయటపడ్డ బాబు బ్రాండ్.. మోసం
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి : చంద్రబాబుతో తమకు అన్ని అంశాల్లోనూ సెటిల్‌మెంట్ కుదిరిందని, అన్నీ పరిష్కారమయ్యాయని పీయూష్ గోయల్ స్పష్టంగా చెప్పారు. తమ అజెండాతో చంద్రబాబు ఏకీభవించినట్లు ఆయన స్పష్టంగా చెప్పారు. మరి ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని ప్రతిపాదించిన బీజేపీతో ఏకీభవించి.. ఆ చట్టాన్ని ఇక్కడ వ్యతిరేకిస్తున్నారంటే ఏంటర్థం? ఆ పార్టీతో కలిసి పోటీ చేస్తూ ఆ చట్టాన్ని రద్దు చేస్తాననటం ఎవరిని మోసం చేయడానికి? ఇది దుర్మార్గం కాదా?
ప్రత్యేక హోదా ముగిసిందని చెబుతున్న బీజేపీతో జట్టు కట్టి.. లేదు లేదు ప్రత్యేక హోదా సాధిస్తామని చెబుతున్న చంద్రబాబు మోసగాడు కాడా? స్టీల్ ప్లాంటును ప్రయివేటీకరించే విషయంలో తమ వైఖరి మారలేదని స్పష్టంగా చెబుతున్న బీజేపీతో కూటమి గట్టి పోటీ చేస్తూ.. ప్రయివేటీకరణను అడ్డుకుంటామని చెబుతున్న బాబు మాటలు అసలు ఒక్క శాతమైనా నమ్మేట్టున్నాయా?
ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తామని, ఉమ్మడి శిక్షా స్మృతి తెస్తామని స్పష్టంగా చెబుతున్న బీజేపీతో కలిసి పోటీ చేస్తూ.. వాటిపై దాటవేత వైఖరి అనుసరిస్తుండటం బాబు దివాలాకోరు తనానికి పరాకాష్ట కాదా? అయినా చంద్రబాబును మోస్తున్న అను‘కుల’ మీడియాకు గానీ, పచ్చ ముఠాకు గానీ సిగ్గుందని అనుకోగలమా?
బీజేపీతో పొత్తు కోసం ఢిల్లీ చుట్టూ తిరిగి.. పార్టీ పెద్దల అపాయింట్‌మెంట్లు దొరక్కపోయినా పడిగాపులు కాసి... చచ్చీ చెడీ, శరణు శరణు అంటూ వేడుకుని మరీ పొత్తు పెట్టుకున్న వ్యవహారం యావత్తు ప్రజానీకం చూసిందే. కానీ పొత్తు కుదుర్చుకుని ఢిల్లీ నుంచి వచ్చాక చంద్రబాబు ఏమన్నాడో తెలుసా? ‘‘వాళ్లు అడిగితే మేం పొత్తు పెట్టుకున్నాం’’ అని. అదీ చంద్రబాబు ట్రేడ్ మార్కు.
బీజేపీ
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రయివేటీకరిస్తాం. ఇప్పటికీ మా వైఖరి అదేనని న్యాయస్థానాల సాక్షిగా బీజేపీ చెబుతోంది. ఈ మధ్యే రాష్ట్ర హైకోర్టులో అఫిడవిట్ వేసి మరీ... విశాఖ స్టీల్‌పై తమ వైఖరి ఏమాత్రం మారలేదని స్పష్టంగా చెప్పింది.
టీడీపీ
బీజేపీతో కలిసి పోటీ చేస్తున్న చంద్రబాబు నాయుడు మాత్రం.. విశాఖ స్టీల్ ప్లాంటు ప్రయివేటీకరణ జరగనివ్వనని బయట బహిరంగ సభల్లో చెబుతున్నాడు. ఈయనకు తోడు మరో భాగస్వామిగా ఉన్న దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ సైతం ప్రయివేటీకరణ జరగనివ్వనని
హూంకరిస్తున్నాడు. మరి ఆ మాట బీజేపీతో చెప్పించవచ్చు కదా? మీ మేనిఫెస్టోలో పెట్టవచ్చు కదా? ఎందుకీ దగుల్బాజీ మాటలు? ఇంకెన్నాళ్లు ఈ మోసపు బతుకులు?
బీజేపీ
ముస్లింలు ఆర్థికంగా బాగా వెనకబడి ఉన్నారని గ్రహించిన దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి.. వారిని బీసీల్లో చేర్చి 4 శాతం రిజర్వేషన్లను కల్పించారు. నాటి నుంచీ అవి కొనసాగుతున్నాయి. కానీ బీజేపీ మాత్రం మతపరమైన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమంటోంది. తాము గనక అధికారంలోకి వస్తే.. ఈ రిజర్వేషన్లను తొలగిస్తామని బీజేపీ అగ్ర నేతలు ఇప్పటికే స్పష్టంగా చెప్పారు.
టీడీపీ
బీజేపీతో కూటమి గట్టి పోటీ చేస్తున్న చంద్రబాబు నాయుడు తాను ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకమని చెప్పటం లేదు. ఆ విషయాన్ని ఎప్పటికప్పుడు దాటవేస్తూ... పక్క దోవ పట్టిస్తూ... ప్రచారాన్ని లాగించేస్తున్నాడు.
బీజేపీ
తాము కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రాగానే ముస్లింలకు వర్తించేలా ఉమ్మడి పౌర స్మృతి (సీసీసీ)ని తీసుకు వస్తామని బీజేపీ చెబుతోంది.
టీడీపీ
దీనిపైనా చంద్రబాబు దాటవేతనే అనుసరిస్తున్నాడు.బీజేపీతో కలిసి పోటీ చేస్తూ.. వాళ్లతో అధికారం పంచుకుంటానని చెబుతున్న చంద్రబాబు వాళ్ల అజెండాతో తాను ఏకీభవిస్తున్నట్లు చెప్పటం లేదెందుకు? ఎన్నాళ్లీ మోసం? రెండు నాల్కలతో ఎందరిని మభ్యపెడతారు?
బీజేపీ
ప్రత్యేక హోదా ముగిసిపోయిన అధ్యాయమని, ఇక దాని గురించి ప్రస్తావించే అవకాశం గానీ, అవసరం గానీ లేదని బీజేపీ పదేపదే చెబుతోంది. ఈ మధ్యే రాష్ట్రానికి వచ్చిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సైతం... ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయమన్నారు. ఈ హోదాకు తగ్గట్లుగా ప్రత్యేక ప్యాకేజీని గతంలోనే చంద్రబాబు నాయుడు తీసుకున్నారని, కనక దీనిపై ఆయన తమను అడిగే పరిస్థితి లేదని చెప్పారు.
టీడీపీ
సిగ్గూ, మర్యాదా అన్నీ వదిలేసిన చంద్రబాబు నాయుడు.. ఇప్పటికీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారు. తాము గెలిస్తే రాష్ట్రానికి బీజేపీ సాయంతో ప్రత్యేక హోదాను సాధిస్తామని మళ్లీ మళ్లీ చెబుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని చెబుతుంటే... సాక్షాత్తు ప్యాకేజీ తీసుకున్న చంద్రబాబు మళ్లీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతుండటం ఎవరి చెవుల్లో పువ్వులు పెట్టడానికి? పోనీ ప్రత్యేక హోదా అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టగలవా చంద్రబాబూ?
Comments
Please login to add a commentAdd a comment