బిందువే సిరుల సింధువు | agriculture development in andhra pradesh | Sakshi
Sakshi News home page

బిందువే సిరుల సింధువు

Published Tue, Apr 30 2024 1:28 AM | Last Updated on Tue, Apr 30 2024 1:28 AM

agriculture development in andhra pradesh

వలస బతుకులను మార్చేసిన నీటి బిందువు.. సూక్ష్మ సేద్యంతో గెలిచిన ‘పోళ్లోపల్లి’ 

కరవు నేలలో సిరుల సాగు 

దశాబ్దాల వెతలకు శాశ్వత విముక్తి 

సొంతూరిలో లక్షలార్జిస్తున్న అన్నదాతలు.. గ్రామంలో ప్రతి తలుపు తట్టిన సంక్షేమం 

ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఊళ్లలో మార్పు

సాక్షి, అమరావతి : అన్నమయ్య జిల్లా చిట్వేల్‌ మండలం పోళ్లోపల్లి రైతులను వర్షాభావం ఏళ్ల తరబడి పట్టి పీడించింది. అక్కడి రైతులు రాగి, సజ్జలు, ఉలవలు, అలసందలు, పెసర, మినుములు, పొద్దు తిరుగుడు మినహా ఇతర పంటలను సాగు చేయరు. కరవు కాటకాల వల్ల ఆరు తడి పంటలు సైతం ఏనాడూ పూర్తిగా చేతికందని దుస్థితి. గత్యంతరం లేక బతుకుదెరువు కోసం కొందరు కువైట్‌కు మరికొందరు పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లారు.

దశాబ్దాల పాటు ఊళ్లో యువకులెవరూ కానరాని విచిత్రం ఆ ఊరి సొంతం. ఈ గ్రామంలో 1,800 కుటుంబాల్లో 134 మంది రైతులుండేవారు. సేద్యం కలిసిరాక 100 మందికి పైగానే గ్రామం నుంచి వలస వెళ్లారు. అప్పో సప్పో చేసి సేద్యం చేసే వారి సంఖ్య 30కి మించి ఉండేదికాదు. ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడా గ్రామంలో మోటారు సైకిల్‌ లేని ఇల్లు లేదు. ప్రతి పదిళ్లకూ ఒక కారు ఉంది. పిల్లలు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళుతున్నారు.

ఒకప్పుడు ఈ ఊరి యువకులకు పిల్లనివ్వడానికే సంకోచించేవారు. ఇప్పుడు సంబంధాలు కుదుర్చుకోవడానికి పోటీ పడుతున్నారు. ఎందుకింత మార్పు అంటే..? సంక్షేమం ఆ గ్రామంలో ప్రతి తలుపూ తట్టింది. సేద్యంలో ఆ ఊరు గెలిచింది. సేద్యం లాభదాయకంగా మారి వలసలకు పగ్గాలు వేసింది. వేసిన పంటలు చేతికందుతున్నాయి. పెట్టుబడి పదింతలు మిగులుతోంది. పోళ్లోపల్లి రూపురేఖలను బిందుసేద్యం మార్చేసింది. 

కువైట్‌ నుంచి 90 శాతం స్వగ్రామానికి..
ఒకప్పుడు అక్కడ పంటలకు నీటితడులు పెట్టేందుకు రాత్రనకా, పగలనకా చెలగ పార చేత పట్టుకుని పొలాల్లోనే కాపురాలు పెట్టేవారు. మోటారు కరెంటు కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసేవారు. పంటలు పండించడానికి ఇంటిల్లిపాదీ కష్టపడే వారు. ఇప్పుడు పగటి పూటే 9 గంటల పాటు నిరాటంకంగా ఉచిత విద్యుత్తు అందుతుండడంతో నీటి తడుల కోసం బెంగలేకుండా పోయింది. 

కావాల్సినంత నీరందుతోంది. సూక్ష్మ సేద్యానికి సంక్షేమం తోడవడంతో వలస వెళ్లిన వారిలో నూటికి 90 మంది తిరిగి స్వగ్రామం బాటపట్టారు. ప్రస్తుతం ఆ గ్రామంలో రైతుల సంఖ్య 230కి పెరిగింది. ఒకప్పుడు సొంత పొలాలనే ఖాళీగా వదిలేసిన రైతులు ఇప్పుడు పక్క ఊళ్లోని పొలాలనూ కౌలుకు తీసుకుని సిరుల పంటలు పండిస్తున్నారు. 90 శాతం సబ్సిడీ (రూ.1.50 కోట్లు)తో నూరు శాతం విస్తీర్ణం (280 ఎకరాలు)లో బిందు పరికరాలను అమర్చుకున్నారు. బొప్పాయి, అరటి, జామ, సీతాఫలం.. ఇలా వివిధ రకాలను సాగు చేస్తూ లక్షలు గడిస్తున్నారు. 

సంక్షేమంతో గ్రామానికి రూ.7 కోట్లు 
వైఎస్సార్‌ రైతు భరోసా, పంటల బీమా, పంట నష్టపరిహారం, పంట రుణాలు, సున్నా వడ్డీ రాయితీ వంటి రైతు సంక్షేమ పథకాలతో పాటు అమ్మఒడి, చేయూత, ఆసరా లాంటి డజనుకు పైగా సంక్షేమ పథకాల రూపంలో గ్రామస్తులు రూ.7 కోట్లకు పైగా లబ్ధి పొందారు. ఫలితంగా వారిలో కొనుగోలు శక్తి పెరిగి పల్లె రూపురేఖలు మారాయి. సూక్ష్మసేద్యంతో ప్రభుత్వం తోడుగా నిలబడడంతో నాలుగేళ్లలో సుమారు రూ.1,500 కోట్లతో 6 లక్షల ఎకరాల్లో బిందు, తుంపర పరికరాలను అమర్చుకుని 2.25 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందారు.  

ఐదేళ్లలో రాష్ట్రంలో 7.33 లక్షల ఎకరాలకు విస్తరణ 
రాష్ట్రంలో 12 లక్షల మంది రైతులు 34.70 లక్షల ఎకరాల్లో బిందు, 12.98 లక్షల ఎకరాల్లో తుంపర సేద్యం చేస్తున్నారు. రాష్ట్రంలో మరో 28 లక్షల ఎకరాలు బిందు, తుంపర సేద్యానికి అనువైనదిగా ప్రభుత్వం గుర్తించింది. ఈ ఐదేళ్లలో 7.33 లక్షల ఎకరాలను కొత్తగా సాగులోకి తీసుకొచ్చి 2.60 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చింది. సబ్సిడీ రూపంలో రూ.2,669.85 కోట్లు జమ చేసింది. ఇందులో చంద్రబాబు ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.800.16 కోట్లూ ఉన్నాయి.

 గత ప్రభుత్వంలో సిఫార్సులున్న వారికే పరికరాలు ఇచ్చేవారు. గత ఐదేళ్లలో జగన్‌ ప్రభుత్వంలో అర్హతే కొలమానంగా అడిగిన ప్రతి రైతుకు సిఫార్సులకు తావులేకుండా, కుల, రాజకీయ పక్షపాతం లేకుండా అర్హులందరికీ పరికరాలిచ్చారు. రైతులు తమ వాటా చెల్లించిన 15 రోజుల్లోగానే నేరుగా వారి క్షేత్రాలకు పరికరాలను తీసుకెళ్లి మరీ అమర్చారు. ఈ పథకం కింద లబ్ధి పొందే ఎస్సీ, ఎస్టీ రైతులకు మేలు చేసేందుకు తుంపర, బిందు పరికరాలపై కేంద్రం విధించే 12 శాతం జీఎస్టీలో 50 శాతం పన్నుల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. ఇలా రూ.60 కోట్లకు పైగా జీఎస్టీ భారాన్ని రైతుల తరపున ప్రభుత్వం భరించింది. 

 రైతులకు రూ.1,034 కోట్ల పెట్టుబడి ఆదా 
సూక్ష్మసేద్యంలో గతేడాది జాతీయ స్థాయిలో ఐదవ స్థానంలో ఉన్న ఏపీ ఈ ఏడాది 4వ స్థానంలో నిలిచింది. దేశంలోనే అత్యుత్తమ 20 జిల్లాల్లో ఐదు జిల్లాలు (ప్రకాశం, అనంతపురం, వైఎస్సార్, అన్నమయ్య, శ్రీ సత్యసాయి) ఏపీకి చెందినవే. బిందు, తుంపర సేద్యంపై ఆర్బీకేల ద్వారా, ఆర్బీకే చానల్‌ ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఎరువుల యాజమాన్యం, విద్యుత్‌ ఆదా, కూలీల ఖర్చు, నీటి ఆదాలపై విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఈ పథకం విస్తరణ ద్వారా 36,650 టన్నుల ఎరువులు, 11,383 లక్షల యూనిట్ల విద్యుత్, 110 టీఎంసీల నీరు ఆదా కాగా, రైతులకు రూ.1,034 కోట్ల కూలీల ఖర్చు మిగిలిందని గుర్తించారు. 

కువైట్‌ను వీడి కన్నతల్లి ఒడికి.. 
పోళ్లోపల్లికే చెందిన సంగరాజు చంద్రశేఖర్‌రాజు సేద్యం కలిసి రాకపోవడంతో 17 ఏళ్ల క్రితం కువైట్‌ వెళ్లి అక్కడే ఉంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. మూడేళ్ల క్రితం గ్రామానికి తిరిగి వచి్చన ఆయన 90 శాతం ప్రభుత్వ సబ్సిడీతో డ్రిప్‌ ఏర్పాటు చేసుకున్నారు. 2.5 ఎకరాల్లో పచ్చ అరటి సాగు చేశారు. రూ.1.50 లక్షలు వ్యయం కాగా , రూ.6 లక్షల ఆదాయం వచి్చంది. మరో పది ఎకరాలు కౌలుకు తీసుకుని అమృతపాణి, సుగంధ అరటి, డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు చేస్తున్నారు. రైతు భరోసా సహా వివిధ సంక్షేమ పథకాల ద్వారా రూ.2.56 లక్షలు అందాయి. ‘ఇద్దరు పిల్లలను కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో చదివిస్తున్నా. ఇక సేద్యం వదిలి పెట్టను. ఊళ్లోనే దర్జాగా జీవిస్తా’..నంటూ ధీమాగా చెబుతున్నారాయన. 

పిల్లలకు కార్పొరేట్‌  చదువులు.. 
వ్యవసాయం కలిసిరాక కువైట్‌ వెళ్లిన నా భర్త సుబ్బరాజు మూడేళ్ల కిందట  సొంతూరొచ్చారు. 5 ఎకరాల్లో తైవాన్‌ జామ, మరో 5 ఎకరాల్లో అరటి, బొప్పాయి  సాగు చేపట్టాం. ప్రభుత్వ సబ్సిడీతో ఫారం పాండ్‌తో పాటు 90 శాతం సబ్సిడీపై రూ.1.30 లక్షల విలువైన డ్రిప్‌ పరికరాలు తీసుకున్నా. జామకు రూ.3 లక్షలు ఖర్చు చేస్తే రూ.15 లక్షల ఆదాయం వచి్చంది. మరో 8 ఎకరాలు కౌలుకు తీసుకుని అమృతపాణి జి–9 రకాన్ని వేశాం. రైతు భరోసా, సున్నా వడ్డీ, అమ్మఒడి, ఆసరా వంటి పథకాల ద్వారా రూ.1.13 లక్షల ఆరి్థక సాయం అందింది. బిందు సేద్యంతో పాటు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు తోడవడంతో అమ్మాయిని వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలోనూ, ఇద్దరు కుమారులను కార్పొరేట్‌ విద్యాసంస్థలో చదివిస్తున్నా.  -ఉమ్మలరాజు సుజాత 

సమాజంలో గౌరవం పెరిగింది.. 
దినసరి కూలీగా పనిచేస్తూ ఐటీఐ చదువుకున్నా. ఉద్యోగం పేరిట మోసపోవడంతో కూలి పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. నాకున్న 4 ఎకరాలకు 90 శాతం సబ్సిడీపై రూ.2 లక్షల విలువైన డ్రిప్‌ పరికరాలు సమకూర్చుకున్నా. బొప్పాయిలో మేలైన రెడ్‌ లేడీ రకం సాగు చేశా. ఏడాదిలో రూ.15 లక్షల ఆదాయం వచి్చంది. రైతుభరోసా, ఈబీసీ నేస్తం, సున్నా వడ్డీ, ఆసరా పథకాల ద్వారా రూ.65 వేల వరకు లబ్ధి పొందాం. ఆర్థిక పరిస్థితి‡ మెరుగుపడడంతో సమాజంలో గౌరవం పెరిగింది.  –పందేటి కృష్ణమరాజు 

పిల్లలను మోడల్‌ స్కూల్‌లో చదివిస్తున్నా.. 
4.5 ఎకరాల్లో డ్రిప్‌ పరికరాల కోసం దరఖాస్తు చేస్తే 90 శాతం సబ్సిడీపై 2.61 లక్షల విలువైన డ్రిప్‌ పరికరాలు అమర్చారు. కోలియోసిస్‌ అనే మెడిసిన్‌ ప్లాంటేషన్‌ చేశా. ఎకరాకు సగటున రూ.15 వేలు ఖర్చు చేశా. రూ.2.80 లక్షల ఆదాయం వచి్చంది. డ్రిప్‌తో 5 ఎకరాలు కౌలుకు తీసుకుని నిమ్మ వేశా. రూ.లక్ష పెట్టుబడి పెడితే రూ.6 లక్షలు ఆదాయం తీశాను. సంక్షేమ పథకాల ద్వారా రూ.1.91 లక్షల మేర లబ్ధి పొందా. ఫలితంగా పిల్లలను మోడల్‌ స్కూల్‌లో చదివిస్తున్నా. బిందు సేద్యంతో వ్యవసాయం లాభసాటిగా మారింది. సంక్షేమ ఫలాలు అందడంతో నిశి్చంతగా జీవిస్తున్నా.  –మందా సుధాకర్‌ 

ఫలిస్తున్న సీఎం జగన్‌ కృషి 
ఉద్యాన హబ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలన్న సంకల్పంతో రాష్ట్రంలో సూక్ష్మ సేద్యానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అధిక ప్రాధాన్యమిస్తున్నారు. చంద్రబాబు ఎగ్గొట్టిన రూ.800 కోట్ల బకాయిలను చెల్లించడమే కాకుండా ఐదేళ్లలో రూ.2,670 కోట్ల సబ్సిడీ చెల్లించాం. 7.33 లక్షల ఎకరాలకు విస్తరించగలిగాం.    –కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి 

30 ఏళ్ల తర్వాత మళ్లీ వ్యవసాయం..

పోళ్లోపల్లికి చెందిన రైతు ఆనాల నరసింహులు 1989లో వ్యవసాయం భారమై బతుకుదెరువు కోసం కువైట్‌ వెళ్లాడు. అక్కడ పడరాని పాట్లు పడి, సరైన సంపాదన లేక కుంగిపోయాడు. 2019లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక సూక్ష్మసేద్యంతో రైతులు లాభాలార్జిస్తున్నారని తెలిసి, నాలుగేళ్ల క్రితం గ్రామానికి తిరిగొచ్చి రెండెకరాల్లో నిమ్మ, 1.5 ఎకరాల్లో చీనీ వేశారు. నిమ్మ కాపు ప్రారంభమైన రెండేళ్లలోనే రూ.2.50 లక్షల ఆదాయం వచి్చంది.

డ్రిప్‌ కోసం 2022లో ఆర్బీకేలో దరఖాస్తు చేసుకుంటే, సిఫార్సులతో పని లేకుండా 90 శాతం సబ్సిడీపై 3.5 ఎకరాల్లో రూ.62,934 విలువైన పరికరాలను అమర్చారు. పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్, డ్రిప్‌ ఇరిగేషన్‌తో సాగు సాఫీగా సాగుతోంది. కువైట్‌కు తిరిగి వెళ్లాలన్న ఆలోచన విరమించుకుని 30 ఏళ్ల తర్వాత మళ్లీ వ్యవసాయం చేపట్టిన నరసింహులు లాభాలు గడిస్తున్నారు. రైతు భరోసా, సున్నావడ్డీ, ఆసరా, జగనన్న విద్యాదీవెన, వసతిదీవెన లాంటి పథకాల ద్వారా ఆయన కుటుంబం లబ్ధి పొందింది. ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు చేయగా, కొడుకును కార్పొరేట్‌ కళాశాలలో చదివిస్తున్నట్లు ఎంతో ఆనందంగా చెప్పారాయన 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement