Sagubadi: మార్కెట్‌ను బట్టి సేద్యం! ఆపై నేరుగా ప్రజలకే అమ్మకం.. | Sakshi
Sakshi News home page

Sagubadi: మార్కెట్‌ను బట్టి సేద్యం! ఆపై నేరుగా ప్రజలకే అమ్మకం..

Published Tue, Apr 2 2024 8:49 AM

Sagubadi: A Farmer Who Follows Modern Methods In The Cultivation Of Water Melon Crop - Sakshi

రైతు దంపతులు బండారి వెంకటేష్, విజయకు ప్రయోగాలంటే ప్రాణం. చదివింది పదో తరగతే అయినా, ఉద్యాన పంటల సాగులో భేష్‌ అనిపించుకుంటున్నారు. ఇతర రైతులకు భిన్నంగా  మార్కెట్‌కు తగిన పంటలు పండించడం, దళారులకు విక్రయించకుండా నేరుగా మార్కెటింగ్‌ చేయటం వారి సక్సెస్‌కు ముఖ్య కారణాలుగా నిలిచాయి.

వెంకటేష్, విజయ దంపతులది జగిత్యాల జిల్లాలోని సారంగాపూర్‌ మండలం పెంబట్ల గ్రామం. ఖర్భూజ (పుచ్చ) పంటను తమకున్న 3 ఎకరాల్లో నవంబర్‌ నుండి మే నెల వరకు గత మూడేళ్లుగా సాగు చేస్తున్నారు. దీని పంట కాలం 90 రోజులు. ఒకేసారి పొలం మొత్తంలో విత్తనాలు వేయకుండా, కొన్ని రోజుల వ్యవధిలో ఐదు దఫాలుగా విత్తుతారు. శివరాత్రి నుంచి ఎండలు ముదురుతాయి. అప్పటి నుంచి మే వరకు పుచ్చకాయలు మార్కెట్‌కు వచ్చేలా సాగు చేస్తారు. ప్రతి రోజు టన్ను నుంచి టన్నున్నర కాయలు జగిత్యాల మార్కెట్‌కు తీసుకువచ్చి విక్రయిస్తుంటారు. మార్కెట్‌ల్లో డిమాండ్‌ ఉన్న ఖర్భూజ రకాలను సాగుచేస్తుంటారు.

ఈ ఏడాది ఐదు రకాల ఖర్భూజ పండ్లను సాగు చేశారు. సాధారణ ఖర్భూజ (సూపర్‌ క్వీన్‌ రకం), లోపల పసుపు పచ్చగా బయట ఆకుపచ్చగా ఉండే విశాల్‌ రకం, లోపల ఎర్రగా బయట పసుపు పచ్చగా ఉండే అరోహి రకం, గుండ్రంగా ఉండే జన్నత్‌ రకం, మస్క్‌మిలన్‌ (జ్యూస్‌ రకం) సాగు చేశారు. ఈ విత్తనాలను బెంగళూర్‌ నుంచి తెప్పించారు.

ఖర్భూజ విత్తనాలు వేయక ముందు భూమిలో కోళ్ల ఎరువు, పశువుల పేడ వేసి, రెండు సార్లు దున్నిస్తారు. తర్వాత, బెడ్‌ మేకర్‌తో బెడ్‌ తయారు చేసి, మల్చింగ్‌ షీట్‌ వేసి, డ్రిప్‌ ద్వారా సాగు నీరు అందిస్తుంటారు. రసాయన ఎరువులు, పురుగు మందులు పెద్దగా వాడకుండా సమగ్ర సస్యరక్షణ చర్యలు తీసుకుంటారు.

జగిత్యాలలో ఖర్భూజ కాయలు అమ్ముతున్న వెంకటేష్‌

3 నెలలు కష్టపడి పంట పండించి, ఆ పంటను దళారులకు విక్రయిస్తే కిలోకు రూ. 5–6 ధర కూడా రాదు. అందుకని ఈ రైతు దంపతులు తామే నేరుగా వినియోగదారులకు అమ్ముతారు. విజయ సాయంత్రం తోటకు వెళ్లి కూలీల సాయంతో కాయలను తెంపుతుంటారు. వెంకటేష్‌ ఉదయం ఐదు గంటలకే నిద్ర లేచి, ఒక్కరిద్దరి సహాయంతో కాయలను ట్రాక్టర్‌లో లోడ్‌ చేస్తారు. ఇంటి వద్ద భోజనం చేసి ఉ. 8 గంటలకు జగిత్యాలకు వచ్చి, ప్రభుత్వ మహిళా డిగ్రి కళాశాల వద్ద అమ్ముతారు. ఈ సమాచారం సోషల్‌ మీడియాలో ప్రచారం కావడంతో మంచి గిరాకీ వస్తోంది. కిలో రూ. 25 నుంచి 49 వరకు రకాన్ని బట్టి విక్రయిస్తున్నారు. మార్కెట్‌ కంటే తక్కువ ధరకు ఇవ్వడంతో పాటు కాయలు నాణ్యతగా, రంగు రంగుల్లో ఉండటంతో  వినియోగదారులు సైతం ఈ రైతు దగ్గర కొనటానికి ఆసక్తి చూపుతున్నారు.

ఖర్భూజ సాగుతో పాటు ఏడాది పొడవునా ఏదో రకం కూరగాయలు, పండుగలప్పుడు పూలు కూడా సాగు చేస్తున్నారు. ఏ పంట పెట్టినా, అందులో అధిక దిగుబడులు సాధిస్తారు. వ్యవసాయాన్ని వ్యాపారంలా మార్చితేనే రైతులకు లాభం అనే మాటను వీరు చేసి చూపిస్తున్నారు. పలువురు యువ రైతులు వీరిని అనుసస్తున్నారు. – పన్నాల కమలాకర్‌ రెడ్డి, సాక్షి, జగిత్యాల అగ్రికల్చర్‌

డిమాండ్‌ను బట్టి పంట మార్చుతాం!
ఐదారు రకాల ఖర్భూజ కాయలు పండించేందుకు చాలా కష్టపడుతున్నాం. ఆ పంటను దళారులకు విక్రయిస్తే విత్తనాల ఖర్చు కూడా రావడం లేదు. మార్కెట్‌లో డిమాండ్‌ను బట్టి రకాన్ని మార్చుతాం. నా పంటకు నేనే రాజును. నేరుగా అమ్ముతున్నాను. ఫేస్‌బుక్, వాట్సాప్‌ వంటి సోషల్‌ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నాం. ప్రజలు మా దగ్గర కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. మార్కెట్‌ను గమనించుకుంటూ.. భార్యభర్త కలిసి పనిచేస్తే వ్యవసాయం తృప్తిగా ఉంటుంది. మంచి ఆదాయమూ వస్తుంది. – బండారి వెంకటేష్, విజయ (62818 13273).

నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్‌

ఇవి చదవండి: Sagubadi: నేలపైన కాదు.. నేరుగా వేర్లకే 'తడి తగిలేలా'..

Advertisement
Advertisement