Sakshi News home page

పెంచిన పాము కాటేస్తే.. సరిగ్గా పాక్ దుస్థితి ఇదే

Published Sun, Jul 30 2023 9:21 AM

ttp strengthened in pak after talibans return - Sakshi

ఆఫ్ఘానిస్థాన్‌లో తాలిబాన్‌ పాలన మొదలయ్యాక పాకిస్తాన్‌లో తెహ్రిక్‌-ఈ తాలిబాన్‌ పాకిస్తాన్‌(టీటీపీ) మరింత పుంజుకున్నదని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్‌ఎస్‌సీ)కి చెందిన మానిటరింగ్ కమిటీ ఒక నివేదికలో తెలిపింది. 

పాకిస్తాన్‌లోని గిరిజన ప్రాంతాలపై పట్టు కోసం
ఆఫ్ఘానిస్థాన్‌ సరిహద్దుల్లో ఉన్న పాకిస్తాన్‌లోని గిరిజన ప్రాంతాలపై నియంత్రణ సాధించేందుకు టీటీపీ తన ప్రయత్నాలను ముమ్మరం చేసిందని ఈ నివేదిక వెల్లడించింది. కాబూల్ పతనం అనంతరం ఈ దిశగా ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయని సమాచారం. టీటీపీ సరిహద్దు ఆవల నుండి తాలిబాన్‌ మద్దతు పొందుతోంది. పాకిస్తాన్‌పై పట్టు బిగించడంలో టీటీపీ ఊపందుకుంటున్నట్లు సభ్య దేశాల అంచనా. ఆఫ్ఘానిస్తాన్‌ను తాలిబాన్ స్వాధీనం చేసుకోవడం ద్వారా ధైర్యాన్ని పొందిన టీటీపీ ఇప్పుడు పాకిస్తాన్‌లో భూభాగంపై నియంత్రణను తిరిగి స్థాపించాలనే ఆశయంతో పనిచేస్తున్నదని నివేదిక తెలియజేస్తున్నది. 

బలోపేతమవుతున్న టీటీపీ
పాకిస్తాన్‌లో ఇటీవల జరిగిన తీవ్రవాద దాడులు టీటీపీ బలోపేతాన్ని రుజువు చేస్తున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లోని ముఖ్య లక్ష్యాలు, పట్టణ ప్రాంతాల్లో సాఫ్ట్ లక్ష్యాలపై టీటీపీ దృష్టి సారిస్తోందని నివేదిక పేర్కొంది. ఆఫ్ఘానిస్తాన్‌లో టీటీపీ యధేచ్ఛగా తన కార్యకలాపాలను కొనసాగిస్తే అది ప్రాంతీయ ముప్పుగా మారుతుందని సభ్య దేశాలు ఆందోళన చెందుతున్నాయని నివేదిక పేర్కొంది. యూఎన్‌ఎస్‌సీలోని కొన్ని సభ్య దేశాలు కూడా టీటీపీ తిరిగి పుంజుకోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భవిష్యత్‌లో టీటీపీ వివిధ విదేశీ సంస్థలతో అనుబంధం ఏర్పరుచుకోవచ్చని, సమీప భవిష్యత్తులో అల్-ఖైదాతో విలీనమయ్యే అవకాశం కూడా ఉండవచ్చని నివేదిక తెలిపింది.



టీటీపీకి అల్‌-ఖైదా మార్గనిర్దేశం
అల్‌-ఖైదా ఇప్పటికే టీటీపీకి మార్గనిర్దేశం చేస్తోందని, పాకిస్తాన్ లోపల లక్షిత ఉగ్రవాద దాడులను నిర్వహించడానికి సహాయం చేస్తున్నదని నివేదిక పేర్కొంది. ఆఫ్ఘానిస్థాన్‌లోని కునార్ ప్రావిన్స్‌లో నిషేధిత సంస్థ ఈస్ట్ టర్కెస్తాన్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ (ఈటీఐఎం)శిక్షణా శిబిరాలను టీటీపీ నాయకులు ఉపయోగిస్తున్నారని, ఇది తాలిబాన్ పాలన కింద వివిధ సమూహాల మధ్య సమన్వయం, మద్దతును సూచిస్తున్నదని నివేదిక తెలిపింది. 

20కిపైగా ఉగ్రసంస్థలకు ఆఫ్ఘానిస్తాన్‌ అండ?
తీవ్రవాదం విషయంలో ఆఫ్ఘానిస్తాన్‌ ప్రపంచవ్యాప్తంగా పేరొందింది. దాని పొరుగున ఉన్న పాకిస్తాన్‌లో అశాంతిని వ్యాప్తి చేయడానికి పనిచేస్తున్న 20కి మించిన ఉగ్రవాద సమూహాలకు ఆఫ్ఘానిస్తాన్‌ సురక్షితమైన ప్రాంతంగా ఉంది. తాలిబాన్, టీటీపీ, అల్ ఖైదాలు సైద్ధాంతికంగా కూడా సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాయనేది  వాస్తవం. ఆఫ్ఘానిస్తాన్‌లో తాలిబాన్, అల్ ఖైదాలు రహస్యంగా పనిచేస్తున్నాయి. అల్ ఖైదా తన కార్యాచరణ సామర్థ్యాన్ని రహస్యంగా పునర్నిర్మించుకుంటూ, నూతనంగా యువతను రిక్రూట్ చేయడానికి ఆఫ్ఘానిస్తాన్‌ను రవాణా కేంద్రంగా ఉపయోగిస్తోంది.



ప్రాంతీయ తీవ్రవాద గ్రూపుల సహకారంతో..
అల్ ఖైదా నాయకులు ఆఫ్ఘానిస్తాన్‌లో ఉన్న నాన్-ఆఫ్ఘన్ మూలాలు కలిగిన ప్రాంతీయ తీవ్రవాద గ్రూపులతో సహకారాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్, జమాత్ అన్సరుల్లా సహకారంతో మధ్య ఆసియాతో పాటు ఇతర దేశాలలో చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆ నివేదికలో పేర్కొంది.
ఇది కూడా చదవండి: పాపం.. జపాన్ భవిష్యత్తు అలా ఏడ్చింది

Advertisement

What’s your opinion

Advertisement