Sakshi News home page

● ఉద్యమం, అభివృద్ధిలో ఎక్కడ ఉన్నారో చెప్పాలి ● బీఆర్‌ఎస్‌ సమావేశంలో పువ్వాడ, నామ, తాతా మధు

Published Sat, Apr 20 2024 12:10 AM

మాట్లాడుతున్న మాజీ మంత్రి పువ్వాడ, పక్కన ఎంపీ అభ్యర్థి నామ, ఎమ్మెల్సీ మధు, తదితరులు - Sakshi

ఖమ్మంమయూరిసెంటర్‌: రాష్ట్ర ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చిన కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని.. కొన్నాళ్లకే ఆ పార్టీ తీరు ప్రజలకు అర్థమైపోయిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌, బీఆర్‌ఎస్‌ ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఖమ్మంలోని బీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయంలో శుక్రవారం లోక్‌సభ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి పువ్వాడ మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నామ నాగేశ్వరరావు విజయానికి ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని కోరారు. కాగా, ఒకప్పుడు బీఆర్‌ఎస్‌ది కుటుంబ పాలన అంటూ మాట్లాడిన నాయకులు, కొందరు మంత్రులు ఇప్పుడు ఎంపీ టికెట్‌ తమ కుటుంబానికే కావాలనే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్‌, ఆయన కుటుంబం తెలంగాణ ఉద్యమంలో పాల్గొని, తెలంగాణ అభివృద్ధికి పాటుపడ్డారని తెలిపారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్‌ నాయకులు తెలంగాణ ఉద్యమం, అభివృద్ధిలో ఎక్కడ ఉన్నారో చెప్పాలని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ప్రతికూల వాతావరణం వచ్చినా... లోక్‌సభ ఎన్నికల్లో నామను గెలిపించుకోవాలని కోరారు. ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతీసారి ఎన్నికల్లో ప్రజలు తనను ఆశీర్వదించడానికి నాయకులు, కార్యకర్తల శ్రమే కారణమని తెలిపారు. పార్టీ తరఫున ప్రతీ ఓటర్‌ను కలిసి బీఆర్‌ఎస్‌ హయాంలో జరిగిన అభివృద్ధి, కాంగ్రెస్‌ చేస్తున్న మోసాలను వివరించాలని కోరారు. పార్లమెంటరీ నాయకుడిగా రాష్ట్ర నిధులు, విభజన హామీల కోసం గళం విప్పానని గుర్తుచేశారు. ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ ప్రజలు మళ్లీ కేసీఆర్‌ వైపు చూస్తున్నారని అన్నారు. గత తొమ్మిదేళ్లల్లో చూడని నీటి ఎద్దడి కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే వచ్చిందని తెలిపారు. మేయర్‌ పునుకొల్లు నీరజ, డీసీసీబీ మాజీ చైర్మన్‌ కూరాకుల నాగభూషణం, బీఆర్‌ఎస్‌ నగర, రఘునాథపాలెం మండల అధ్యక్షులు పగడాల నాగరాజు, వీరూనాయక్‌తో పాటు బచ్చు విజయ్‌కుమార్‌, మెంతుల శ్రీశైలం, తాళ్లూరి జీవన్‌కుమార్‌, బొమ్మెర రామ్మూర్తి, డోకుపర్తి సుబ్బారావు, తాజుద్దీన్‌, కర్నాటి కృష్ణ, మక్బూల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement