22న ఎమ్మెల్యే కాటసాని నామినేషన్‌ | Sakshi
Sakshi News home page

22న ఎమ్మెల్యే కాటసాని నామినేషన్‌

Published Fri, Apr 19 2024 1:05 AM

- - Sakshi

మొదటి రోజు జిల్లా వ్యాప్తంగా

9 నామినేషన్లు

నంద్యాల పార్లమెంట్‌కు ఇద్దరు,

అసెంబ్లీ నియోజకవర్గాలకు

ఏడుగురు అభ్యర్థుల నామినేషన్‌

శ్రీశైలం స్థానానికి వైఎస్సార్‌సీపీ

అభ్యర్థి ఒకసెట్‌, టీడీపీ అభ్యర్థి

రెండు సెట్లు దాఖలు

భారీ ర్యాలీగా వచ్చి నామినేషన్‌ వేసిన

ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి

ప్రచార రథంపై నుంచి అభివాదం చేస్తున్న ఎమ్మెల్యే శిల్పా, చిత్రంలో

ఎంపీ అభ్యర్థి పోచా, ఎమ్మెల్యే శిల్పా రవి, బుడ్డా శేషారెడ్డి తదితరులు

నంద్యాల: సార్వత్రిక ఎన్నికల ఘట్టం ప్రారంభమైంది. గురువారం ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కావడంతో జిల్లాలో ఒక పార్లమెంట్‌ స్థానానికి, ఆరు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల అధికారులు నామినేషన్లు స్వీకరించారు. పార్లమెంట్‌ స్థానానికి నంద్యాల కలెక్టర్‌రేట్‌లో, అసెంబ్లీ స్థానాలకు ఆయా నియోజకవర్గాల తహసీల్దార్‌, ఆర్‌డీఓ కార్యాలయాల్లో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు నామినేషన్లు స్వీకరించారు. నామినేషన్ల స్వీకరణ సందర్భంగా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియో తీయించారు. నామినేషన్‌ కేంద్రంలోకి అనుమతి ఉన్న నాయకులను మాత్రమే లోపలికి పంపించారు. గురువారం నంద్యాల పార్లమెంట్‌కు ఇద్దరు, జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏడుగురు అభ్యర్థులు తమ నామినేషన్‌ పత్రాలను సంబంధించిన రిటర్నింగ్‌ అధికారులకు అందజేసినట్లు జిల్లా కలెక్టర్‌ శ్రీనివాసులు తెలిపారు. నంద్యాల పార్లమెంట్‌ ఎన్నికలకు సంబంధించి ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా తరఫున మహమ్మద్‌ అతుల్లాఖాన్‌ ఒకసెట్‌, బహుజన సమాజ్‌ పార్టీ తరపున చిన్న మౌలాలి ఒకసెట్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. జిల్లాలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఏడుగురు అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. శ్రీశైలం నియోజకవర్గ అసెంబ్లీకి వైఎస్సార్‌సీపీ తరఫున శిల్పాచక్రపాణిరెడ్డి ఒక సెట్‌, జాతీయ చేతి వృత్తుల ఐక్యవేదిక పార్టీ సి.నాగేశ్వరరావు ఒకసెట్‌, టీడీపీ అభ్యర్థులుగా బుడ్డా రాజశేఖర్‌రెడ్డి ఒకసెట్‌, బుడ్డా శైలజా ఒకసెట్‌ నామినేషన్లు దాఖలు చేశారు. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి స్వతంత్ర అభ్యర్థులుగా విష్ణువర్ధన్‌రెడ్డి, బి.శ్రావణకుమార్‌ చెరో ఒక సెట్‌ నామినేషన్లు దాఖలు చేయగా సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా తరపున షేక్‌మహమ్మద్‌ ఫాజిల్‌ ఒక సెట్‌ దాఖలు చేశారు.

అట్టహాసంగా శిల్పా నామినేషన్‌

శ్రీశైలం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా శిల్పాచక్రపాణిరెడ్డి గురువారం ఉదయం 11.10 గంటలకు ఆత్మకూరులో అట్టహాసంగా నామినేషన్‌ దాఖలు చేశారు. ముందుగా ప్రచార వాహనంపై శిల్పాచక్రపాణిరెడ్డి, నంద్యాల ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుడ్డా శేషారెడ్డి, శ్రీశైలం నియోజకవర్గ పరిశీలకులు హబీబుల్లా, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులతో కలిసి భారీ ర్యాలీగా పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి కొత్త బస్టాండు మీదుగా తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకున్నారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా భారీగా కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు. నామినేషన్‌ అనంతరం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శిల్పాచక్రపాణిరెడ్డి మాట్లాడుతూ శ్రీశైలం నియోజకవర్గంలోని నలుమూలల నుంచి స్వచ్ఛందంగా నామినేషన్‌ కార్యక్రమానికి వేలాదిగా తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ‘మీ కుటుంబంలో మంచి జరిగి ఉంటేనే ఓటు వేయండి’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్భయంగా ఓట్లు అడుగుతున్నారంటే ప్రజలకు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలే తమ ధైర్యమన్నారు. చంద్రబాబు నాయుడు ఓట్ల కోసం ఎన్ని హామీలు అయినా ఇస్తారని, ఆయన దొంగ హామీలను ప్రజలు నమ్మే స్థితిలో నేడు లేరన్నారు. ఎన్నికలప్పుడు మాత్రమే చంద్రబాబుకు, కూటమి నాయకులకు ప్రజలు గుర్తు వస్తారని, చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌, పురందేశ్వరిలు ప్రజలను మభ్య పెట్టేందుకు చూస్తున్నారని, వారిని నమ్మవద్దన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 99శాతం నెరవేర్చిన ఘనత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికే దక్కిందని, మాట ఇస్తే 100శాతం అమలు చేసి తీరుతామన్నారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ నంద్యాల పార్లమెంట్‌ అభ్యర్థిగా పోచా బ్రహ్మానందరెడ్డిని, ఎమ్మెల్యేగా శిల్పా చక్రపాణిరెడ్డి అయిన తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

మొదటి రోజు ప్రశాంతం

శ్రీశైలం నియోజకవర్గ స్థానానికి వైఎస్సార్‌సీపీ, టీడీపికి చెందిన ఇద్దరు అభ్యర్థులు గురువారం నామినేషన్లు దాఖలు చేస్తుండటంతో పోలీసులు ఆత్మకూరులో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరుపార్టీల అభ్యర్థులు భారీ ర్యాలీతో నామినేషన్లు దాఖలు చేయడానికి వచ్చినా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందుజాగ్రత్తగా చర్యలు తీసుకు న్నారు. దీంతో ప్రశాంత వాతావరణంలో నామినేషన్ల ప్రక్రియ పూర్తి చేశారు. ఉదయం 11 గంటల తర్వాత వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శిల్పాచక్రపాణిరెడ్డి, మధ్యాహ్నం 2 గంటల తర్వాత టీడీపీ అభ్యర్థులు బి.రాజశేఖర్‌రెడ్డి, బి.శైలజ నామినేషన్లు దాఖలు చేయడానికి వేర్వేరుగా సమయం ఇచ్చి నామినేషన్లు వేయించడంతో అంతా ప్రశాంతంగా ముగిసింది.

నాలుగు నియోజకవర్గాల్లో నిల్‌..

జిల్లాలోని ఆరు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ జరగగా అందులో నాలుగు అసెంబ్లీ స్థానాలకు గురువారం ఒక్కరు కూడా నామినేషన్లు దాఖలు చేయలేదు. జిల్లాలోని ఆళ్లగడ్డ, నందికొట్కూరు, బనగానపల్లె, డోన్‌ అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు.

పాణ్యం: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పాణ్యం నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఈనెల 22వ తేదీన నామినేషన్‌ వేయనున్నారు. ఉదయం 9 గంటలకు ఎమ్మె ల్యే స్వగృహం నుంచి ర్యాలీ ప్రారంభమై కర్నూలు కలెక్టరేట్‌ వరకు సాగుతుంది. పాణ్యం ఈఆర్‌ఓ కార్యాలయంలో నామినేష్‌ పత్రాలను దాఖలు చేస్తారు. నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొనాలని పార్టీ నేతలు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

1/1

Advertisement
Advertisement