ఏటా పెట్టుబడిసాయం.. | Sakshi
Sakshi News home page

ఏటా పెట్టుబడిసాయం..

Published Sat, Apr 20 2024 1:20 AM

- - Sakshi

కోవెలకుంట్ల: వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసిన వైఎస్సార్‌సీపీ సర్కార్‌ అన్నదాతకు అన్ని విధాలా అండగా నిలుస్తోంది. విత్తనం మొదలుకొని పంట ఉత్పత్తుల కొనుగోలు వరకు అడుగడుగునా తోడుగా ఉంటోంది. అన్నదాత సంక్షేమమే లక్ష్యంగా రైతులకు అనేక పథకాలు అమలు చేస్తోంది. పంటల సాగుకు పెట్టుబడి కోసం ప్రైవేట్‌ వ్యక్తుల వద్ద అప్పులు చేసి అవస్థలు పడకుండా రైతు భరోసా పథకం ద్వారా ప్రతి ఏటా రూ.13,500 నగదు, బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పిస్తోంది. గత టీడీపీ సర్కార్‌ హయాంలో ఉన్న దానికన్నా గరిష్ట రుణపరిమితి గణనీయంగా పెంచి రైతులకు చేయూత నిస్తోంది. నంద్యాల జిల్లాలోని 29 మండలాల పరిధిలో ఏటా ఖరీఫ్‌ సీజన్‌లో 2.28 లక్షల హెక్టార్లు, రబీ సీజన్‌లో 1.14 లక్షల హెక్టార్లలో రైతులు వరి, పత్తి, మినుము, మొక్కజొన్న, జొన్న, పప్పుశనగ, పెసర, పొగాకు, కంది, ఉల్లి, వేరుశనగ, మిరపతోపాటు ఉదాన్యవన పంటలైన మామిడి, సపోట, చీని, ద్రాక్ష, అరటి, తదితర పంటలు సాగు చేస్తున్నారు.

పెరిగిన రుణపరిమితి ఇలా

2019 సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రైతులకు బ్యాంకుల ద్వారా అందించే పంటరుణాలకు సంబంధించి స్కేల్‌ఆఫ్‌ ఫైనాన్స్‌ పెరిగేలా చర్యలు చేపట్టింది. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) ఆధ్వర్యంలో నాబార్డు, లీడ్‌బ్యాంకు, ప్రధాన బ్యాంకర్లు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో జిల్లా స్థాయి సాంకేతిక కమిటీ (డీఎల్‌డీసీ) సమావేశమై వాస్తవ పరిస్థితులపై చర్చించి రుణపరిమితి ప్రతిపాదనలు తయారు చేస్తారు. ఆ ప్రతిపాదనలను రాష్ట్ర సాంకేతిక కమిటీ (ఎస్‌ఎల్‌టీసీ)కి పంపించి రుణపరిమితి ఖరారు చేస్తున్నారు. గతంలో చంద్రబాబు హయాంలో ఈ ప్రక్రియ తూతూ మంత్రంగా చేపట్టి రైతులకు అరకొరగా రుణాలు ఇచ్చేవారు. దీని వల్ల రైతులకు పెద్దగా ప్రయోజనం కలిగేది కాదు. అయితే 2019 తర్వాత రైతులకు మేలు జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారా పంట రుణ సదుపాయం కల్పిస్తూ వస్తోంది. 2018లో వరి సాగుకు బ్యాంకుల ద్వారా ఎకరాకు గరిష్టంగా రూ. 18 వేలు రుణం ఇవ్వగా ప్రస్తుత వైఎస్సార్‌సీపీ హయాంలో రూ. 43 వేలు అందజేస్తున్నారు. వేరుశనగకు రూ. 18 వేలు ఇవ్వగా ఆ మొత్తాన్ని రూ. 38 వేలకు పెంచడం గమనార్హం. ఇలా వివిధ ప్రధాన పంటలకు రుణపరిమితిని భారీగా పెంచారు. ఏప్రిల్‌ నెల నుంచి ఆగస్టు వరకు రైతులు పంట రుణాల రెన్యువల్స్‌, కొత్త రుణాల కోసం బ్యాంకులను వినియోగించుకుంటూ పంట రుణాలు పొందుతున్నారు.

భీమునిపాడులోని రైతు భరోసా కేంద్రం

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి ఏటా వివిధ పంటల సాగుకు రైతులు ఇబ్బందులు పడకుండా ఖరీఫ్‌ సీజన్‌కు ముందే రైతు భరోసా పథకం ద్వారా పెట్టుబడిసాయం అందిస్తోంది. జూన్‌లోనే మొదటి విడతలో వైఎస్సార్‌ రైతు భరోసా, పీఎం కిషాన్‌ కింద రూ. 7,500, అక్టోబర్‌లో రూ. 4 వేలు, జనవరి నెలలో రూ. 2వేల చొప్పున అందజే స్తోంది. పెట్టుబడి సాయంతోపాటు గ్రామ సచివాలయాలకు అనుగుణంగా జిల్లాలో 394 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి నాణ్యమైన విత్తనాలు, కల్తీలేని ఎరువులు, ఆయా పంటల్లో అధిక దిగుబడులు సాధించేందుకు వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం అందజేస్తోంది. మరోవైపు వివిధ బ్యాంకుల ద్వారా పంట రుణాల రెన్యువల్‌, కొత్తగా పంట రుణాల పంపిణీకి ప్రాధాన్యత కల్పించింది. పంట పెట్టుబడులు, ఆయా పంటల్లో వస్తున్న దిగుబడులను బేరీజు వేసుకుని గరిష్ట రుణపరిమితి(స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌) ఖరారు చేసి రైతులకు మేలు చేస్తోంది.

Advertisement
Advertisement