Sakshi News home page

Apple: స్పైవేర్‌ దాడులు జరగొచ్చు

Published Fri, Apr 12 2024 5:33 AM

Apple alerts users in India and other countries of potential spyware attack - Sakshi

మరోమారు యూజర్లను హెచ్చరించిన యాపిల్‌ సంస్థ

న్యూఢిల్లీ: ప్రభుత్వ మద్దతున్న సైబర్‌ నేరగాళ్లు మీ ఐఫోన్‌ తదితర యాపిల్‌ ఉత్పత్తులపై సైబర్‌దాడులు చేయొచ్చని గతంలో హెచ్చరించి తీవ్ర చర్చకు తెరలేపిన యాపిల్‌ సంస్థ తాజాగా మరోమారు అలాంటి హెచ్చరికనే చేసింది. పెగాసస్‌ తరహా అత్యంత అధునాతనమైన స్పైవేర్‌ దాడులు కీలకమైన పాత్రికేయులు, కార్యకర్తలు, రాజకీయవేత్తలు, దౌత్యవేత్తలను లక్ష్యంగా చేసుకుని జరగొచ్చని యాపిల్‌ ఏప్రిల్‌ పదో తేదీ ఒక ‘థ్రెట్‌’ నోటిఫికేషన్‌లో పేర్కొంది.

‘‘కొనుగోలుచేసిన అధునాతన స్పైవేర్‌తో సైబర్‌ దాడులు జరిగే అవకాశాలను ముందే పసిగట్టి యూజర్లకు సమాచారం ఇవ్వడం, వారిని అప్రమత్తం చేయడం కోసం థ్రెట్‌ నోటిఫికేషన్లను రూపొందించాం. సాధారణ సైబర్‌నేరాల కంటే ఈ దాడులు చాలా సంక్షిష్టమైనవి. అత్యంత తక్కువ మందినే లక్ష్యంగా చేసుకుంటారు కాబట్టి ఎవరిపై, ఎందుకు దాడి చేస్తారో చెప్పడం కష్టం. అయితే దాడి జరిగే అవకాశాన్ని మాత్రం ఖచ్చితంగా అంచనావేసి ముందే యూజర్లను అప్రమత్తం చేస్తాం’’ అని థ్రెట్‌ నోటిఫికేషన్‌లో యాపిల్‌ హెచ్చరించింది.

సార్వత్రిక ఎన్నికలకు సంసిద్ధమవుతున్న భారత్‌సహా 60 దేశాల్లోని యూజర్లకు యాపిల్‌ ఈ నోటిఫికేషన్లు పంపించింది. ఇజ్రాయెల్‌ తయారీ పెగాసస్‌ స్పైవేర్‌ సాయంతో మొబైల్‌ ఫోన్‌కు వాట్సాప్‌ ద్వారా మిస్డ్‌కాల్‌ ఇచ్చి కూడా ఆ ఫోన్‌ను సైబర్‌నేరగాళ్లు తమ నియంత్రణలోకి తెచ్చుకోవచ్చు.

‘‘ఎవరైనా యూజర్‌ను సైబర్‌నేరగాళ్లు లక్ష్యంగా చేసుకుంటే ముందే గుర్తించి ఆ యూజర్‌ను హెచ్చరిస్తాం. ఐఫోన్‌ను సైబర్‌భూతం నుంచి కాపాడాలంటే దానిని లాక్‌డౌన్‌ మోడ్‌లో పెట్టుకోవచ్చు. అప్పుడు ఆ ఫోన్‌లో ఫింగర్‌ఫ్రింట్‌ సెన్సార్, ఫేఫియల్‌ రికగ్నీషన్, వాయిస్‌ రిగ్నీషన్‌ ఏవీ పనిచేయవు. ఒకవేళ మనమే మళ్లీ వాడుకోవాలంటే పిన్‌ లేదా పాస్‌కోడ్‌ లేదా ప్యాట్రన్‌ సాయంతోనే మళ్లీ ఫోన్‌ను పనిచేసేలా చేయొచ్చు’’ అని యాపిల్‌ సూచించింది.

ఒక సర్వే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 49 శాతం సంస్థలు తమ ఉద్యోగుల డివైజ్‌లపై సైబర్‌ దాడులు/ ఉల్లంఘన ఉదంతాలను పసిగట్ట లేకపోతు న్నాయి. భారత్‌లో లెక్కిస్తే మొబైల్‌ మాల్‌వే ర్‌ సాయంతో సగటు వారానికి 4.3 శాతం సంస్థలపై సైబర్‌ దాడులు జరుగుతు న్నాయి. అదే ఆసియాపసిఫిక్‌ ప్రాంతంలో అయితే గత ఆరు నెలల్లో సగటును 2.6 శాతం సంస్థలపై సైబర్‌ దాడులు చోటుచేసుకున్నాయి.

Advertisement
Advertisement