Farmers movement, Delhi Chalo: కేసు నమోదయ్యాకే అంత్యక్రియలు | Sakshi
Sakshi News home page

Farmers movement, Delhi Chalo: కేసు నమోదయ్యాకే అంత్యక్రియలు

Published Sat, Feb 24 2024 5:51 AM

Farmers movement, Delhi Chalo: Cremation Won not Happen Till FIR Is Filed, Say Union Leaders - Sakshi

చండీగఢ్‌: పంజాబ్‌–హరియాణా సరిహద్దుల్లోని ఖనౌరీ వద్ద బుధవారం ‘ఢిల్లీ చలో’ఆందోళనల్లో పాల్గొన్న రైతులు హరియాణా పోలీసుల మధ్య జరిగిన ఘర్షణలో శుభ్‌కరణ్‌సింగ్‌(21) అనే యువ రైతు గాయాలతో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై రైతు సంఘాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. శుక్రవారం ఖనౌరీ వద్ద కొనసాగుతున్న ఆందోళనలో పలువురు రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు.

శుభ్‌కరణ్‌ మృతికి బాధ్యులైన వారిపై పంజాబ్‌ ప్రభుత్వం కేసు నమోదు చేసే వరకు అంత్యక్రియలు జరిపేది లేదని నేతలు తేల్చి చెప్పారు. శుభ్‌కరణ్‌ను అమరుడిగా ప్రకటించాలని కూడా డిమాండ్‌ చేశారు. రైతుల డిమాండ్‌ మేరకు శుభ్‌కరణ్‌ కుటుంబానికి రూ.కోటి పరిహారంతోపాటు అతడి సోదరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామంటూ పంజాబ్‌ సీఎం మాన్‌ ప్రకటించారు.

రైతు మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలుంటాయని కూడా సీఎం స్పష్టం చేశారు. అనంతరం రైతు నేత సర్వాన్‌ సింగ్‌ పంథేర్‌ మీడియాతో మాట్లాడారు. ‘మాక్కావాల్సింది డబ్బు కాదు. మృతికి బాధ్యులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడమే మాకు ముఖ్యం. ఆ తర్వాతే అంత్యక్రియలు జరుపుతాం. ఇందుకు అవసరమైతే 10 రోజులైనా సరే వేచి ఉంటామని శుభ్‌కరణ్‌ కుటుంబసభ్యులు మాకు చెప్పారు’అని వివరించారు.

రైతులపైకి టియర్‌ గ్యాస్‌..
హిసార్‌: హరియాణా పోలీసులతో శుక్రవారం మరోసారి రైతులు తలపడ్డారు. ఖనౌరీ వద్ద నిరసనల్లో పాల్గొనేందుకు వెళ్తున్న ఖేరి చోప్తా గ్రామ రైతులను పోలీసులు అడ్డగించారు. కొందరు రైతులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఈ సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణలో కొందరు రైతులతోపాటు పోలీసులు గాయపడ్డారు. పోలీసులు వారిపైకి టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. కొందరు రైతులను అదుపులోకి తీసుకున్నారు.

గుండెపోటుతో మరో రైతు మృతి
పంజాబ్‌–హరియాణా సరిహద్దుల్లో ఆందోళనల్లో పాల్గొంటున్న దర్శన్‌ సింగ్‌(62) అనే రైతు గుండెపోటుతో చనిపోయినట్లు రైతు సంఘం నేతలు చెప్పారు. మరోవైపు ఆందోళనలకు సారథ్యం వహిస్తున్న రైతు సంఘాల నేతలు శుక్రవారం పలు అంశాలపై చర్చించారు. తదుపరి కార్యాచరణను 29న ప్రకటిస్తామని మీడియాకు తెలిపారు. శనివా రం కొవ్వొత్తులతో ర్యాలీ చేపడతామ న్నారు.

పంజాబ్‌వ్యాప్తంగా బ్లాక్‌ డే
అమృత్‌సర్‌: రైతులపై పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ పంజాబ్‌ అంతటా రైతులు బ్లాక్‌ డే  పాటించారు. శుభ్‌కరణ్‌ మృతిని నిరసిస్తూ అమృత్‌సర్, లూధియానా, హోషియార్‌పూర్‌ సహా 17 జిల్లాల్లో నిరసనలు చేపట్టినట్లు రైతు సంఘాలు వెల్లడించాయి.

Advertisement
Advertisement