సెమీ కండక్టర్ల రంగంలో గ్లోబల్‌ పవర్‌గా ఇండియా | Sakshi
Sakshi News home page

సెమీ కండక్టర్ల రంగంలో గ్లోబల్‌ పవర్‌గా ఇండియా

Published Thu, Mar 14 2024 5:54 AM

PM Narendra modi lays foundation stone for three semiconductor plants - Sakshi

ప్రధాని మోదీ వెల్లడి

3 చిప్‌ ప్లాంట్లకు శంకుస్థాపన  

గాందీనగర్‌:  సెమీ కండక్టర్ల రంగంలో మన దేశం కీలక పాత్ర పోషించబోతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈ రంగంలో భారత్‌ గ్లోబల్‌ పవర్‌గా ఎదిగే రోజు ఎంతో దూరంలో లేదని అన్నారు. ఇండియాలో రూ.1.25 లక్షల కోట్లతో స్థాపించనున్న మూడు సెమీ కండక్టర్ల తయారీ ప్లాంట్లకు ప్రధాని మోదీ బుధవారం వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఇందులో రెండు గుజరాత్‌లో, ఒకటి అస్సాంలో రాబోతున్నాయి.

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... గత ప్రభుత్వాలు దేశీయంగా సెమీ కండక్టర్ల తయారీని పట్టించుకోలేదని పరోక్షంగా కాంగ్రెస్‌పై మండిపడ్డారు. అభివృద్ధి పట్ల అంకితభావం లేకపోవడమే ఇందుకు కారణమని చెప్పారు. దేశ శక్తి సామర్థ్యాలను, ప్రాధాన్యతలను, భవిష్యత్తు అవసరాలను గుర్తించడంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యా యని ఆక్షేపించారు. మన దే శాన్ని సెమీ కండక్టర్ల తయారీ హబ్‌గా తీర్చిదిద్దాలని తమ ప్రభుత్వం సంకల్పించిందని వెల్లడించారు.

దేశీయంగా చిప్‌ల తయారీతో యువతకు ఎన్నెన్నో ఉ ద్యోగ, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. దేశాభివృద్ధికి ఈ రంగం దోహదపడుతుందని వివరించారు. సెమీ కండక్టర్‌ మిషన్‌ను రెండేళ్ల క్రితం ప్రకటించామని, తర్వాత కొన్ని నెలల వ్యవధిలోనే అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నామని, ఈరోజు మూడు పరిశ్రమలకు శంకుస్థాపన చేశామని వ్యాఖ్యానించారు. అనుకున్నది సాధించే శక్తి భారత్‌కు, ప్రజాస్వామ్యానికి ఉందని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.  

పీఎం–సూరజ్‌ నేషనల్‌ పోర్టల్‌ ప్రారంభం  
కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ఎస్సీ, ఎస్టీలు, బీసీలే అత్యధికంగా లబ్ధి పొందుతున్నారని ప్రధాని మోదీ చెప్పారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఆయా వర్గాలను విస్మరించాయని ఆరోపించారు. దేశాభివృద్ధిలో ఎస్సీ, ఎస్టీ, బీసీల పాత్రను కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఏనాడూ గుర్తించలేదని విమర్శించారు. దళిత, గిరిజన వర్గాలకు చెందిన రామ్‌నాథ్‌ కోవింద్, ద్రౌపదీ ముర్మును తాము రాష్ట్రపతులను చేశామని అన్నారు.

అణగారిన వర్గాలను అత్యున్నత పదవుల్లో నియమిస్తున్నామని, ఇది ఇకపైనా కొనసాగుతుందని వివరించారు. ప్రధానమంత్రి సామాజిక్‌ ఉత్థాన్, రోజ్‌గార్‌ ఆధారిత్‌ జన్‌కల్యాణ్‌(పీఎం–సూరజ్‌) నేషనల్‌ పోర్టల్‌ను మోదీ బుధవారం ప్రారంభించారు. ఈ పోర్టల్‌ ద్వారా ఎస్టీలు, ఎస్సీలు, వెనుకబడిన తరగతులతోపాటు పారిశుధ్య కార్మికులు రుణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

Advertisement
 
Advertisement
 
Advertisement