IT, ED: నేతలు, సినీ ప్రముఖుల ఇళ్లలో సోదాలు | Sakshi
Sakshi News home page

తమిళనాడు: డీఎంకే నేతలు, సినీ ప్రముఖుల ఇళ్లలో ఈడీ, ఐటీ దాడులు

Published Tue, Apr 9 2024 10:42 AM

Tamil Nadu ED IT Raids April 09 Updates  - Sakshi

సాక్షి, చెన్నై: తమిళనాడులో జాతీయ దర్యాప్తు సంస్థల దాడులు కలకలం రేపుతున్నాయి. అధికార పార్టీ డీఎంకేకు చెందిన కొందరు నేతలతో పాటు పలువురు సినీ ప్రముఖుల ఇళ్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సోదాలు నిర్వహిస్తోంది. అదే సమయంలో.. మరోవైపు కొందరు వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాల్ని లక్ష్యంగా చేసుకుని ఆదాయ పన్నుల శాఖ దాడులు కొనసాగిస్తోంది.

చెన్నై సహా 35కు పైగా ప్రాంతాల్లో ఈడీ మంగళవారం ఉదయం ఏకకాలంలో సోదాలకు దిగింది. డీఎంకే బహిష్కృత నేత.. సినీ నిర్మాత జాఫర్ సాదిక్‌కు సంబంధించిన ఆఫీసులతో పాటు, అతనితో పరిచయం ఉన్నవాళ్ల ఇళ్లు, ఆఫీసులకు ఈడీ బృందాలు చేరుకున్నాయి. ఇందులో డీఎంకే నేతలతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఉన్నారు. భారీ డ్రగ్స్ కేసుకు సంబంధించి మనీలాండరింగ్ విచారణలో భాగంగా ఈడీ ఈ సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది.

ఇక, రూ.2,000 కోట్ల డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో జాఫర్‌ సాదిక్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు మార్చి 9వ తేదీన అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. డీఎంకేలో పని చేసిన సాదిక్ పలు తమిళ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. అయితే అరెస్ట్‌ తర్వాత డీఎంకే అతన్ని పార్టీ నుంచి తొలగించింది. మరోవైపు సినీ పరిశ్రమలో, వ్యాపార వర్గాల్లో సాదిక్‌తో పరిచయాలు ఉన్నవారిపై కూడా ఎన్‌సీబీ దృష్టి సారించింది. ఈ కేసుకు సంబంధించి చిత్ర దర్శకుడు, నటుడు అమీర్‌తో పాటు మరో ఇద్దరు వ్యాపారవేత్తలను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) ఇటీవలె ఢిల్లీలో విచారించిన సంగతి తెలిసిందే.

తాజాగా దర్శన నటుడు అమీర్‌ ఇంట్లో ఈడీ అధికారులు కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అమీర్‌ తీసిన మూడు చిత్రాల్లోనూ సాదిక్‌ నిర్వాణ భాగస్వామ్యం ఉండడం గమనార్హం.  అలాగే పలువురు డీఎంకే ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. ఎన్‌సీబీ నమోదు చేసిన కేసును, మరికొన్ని ఎఫ్‌ఐఆర్‌లను పరిగణలోకి తీసుకుని సాదిక్, ఇతరులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. 

రూ.32 కోట్లు స్వాధీనం
మరోవైపు.. తమిళనాడులో ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ దాడులు కొనసాగుతున్నాయి. పొల్లాచ్చిలో ఎంబీఎస్‌ పౌల్ట్రీ ఫామ్స్‌ నడుపుతున్న వ్యాపారవేత్తల ఇళ్లలో ఐటీ బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి.  అరుల్‌మురుగన్‌, శరవణ మురుగన్‌, ఇళ్లు, కార్యాలయాలు ఉన్నాయి. ఈ సోదాల్లో రూ.32 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

Advertisement
Advertisement