అనుకున్నట్లే అయింది. ఏపీలో కూటమిని కుమ్ములాటలు పూర్తిగా ముంచేసాయి. సఖ్యత లేని కారణంగానే పార్టీల మధ్య ఓటు బదిలీ జరగలేదనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఓటు షేర్ బదిలీ కాకపోవడం ఆయా పార్టీలను కలవరపరుస్తోంది. టిడిపి, బిజెపి, జనసేన పార్టీ నేతల్లో గెలుపుపై ధీమా లేక డీలా పడిపోయారు. పోలింగ్ పూర్తయ్యాక బిజెపి, జనసేన నేతలెవరూ మీడియా ముందుకు రాకపోవడం పరిస్ధితికి అద్దం పడుతోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కూటమి పార్టీల మధ్య అసలేం జరిగిందో చూద్దాం.
కూటమిగా జతకడితే విజయం ఖాయమనుకున్న టిడిపి, బిజెపి, జనసేనలలో పోలింగ్ తర్వాత అయోమయం కనిపిస్తోంది. లెక్కలు తేలిన తర్వాత ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి ఓటు షేర్ బదిలీ కాలేదని అర్థం కావడంతో నేతలు తలలు పట్టుకుంటున్నారు. 2014లో టిడిపి, బిజెపి, జనసేనలతో జట్టుకట్టి బరిలోకి దిగింది. ఆ ఎన్నికల్లో టిడిపి, బిజెపికి మద్దతు పలికిన జనసేన బరిలోకి దిగలేదు. 2019 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చాలన్న ఉద్దేశంతో జనసేన విడిగా పోటీ చేసింది. కాని జనసేన ఒక సీటు గెలుచుకోగా..టీడీపీకి 23 మాత్రమే దక్కాయి. 152 సీట్లతో వైఎస్‌ఆర్‌సీపీ విజయఢంకా మోగించింది.
మళ్ళీ తాజా ఎన్నికలలో ఎట్టి పరిస్ధితుల్లోనైనా వైఎస్సార్ సిపి గెలుపును అడ్డుకోవాలని కుట్రలు, కుతంత్రాలతో 2014లో మాదిరిగా మూడు పార్టీలు మరోసారి కూటమి కట్టాయి. మూడు పార్టీలు కలిస్తే 2019 వచ్చినట్టుగా ఓటు షేర్ దాదాపుగా 50 శాతానికి పెరుగుతుందని అంచనా వేశారు. అయితే మూడు పార్టీల అంచనాలు పూర్తిగా తలక్రిందులయ్యాయి.
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి కూటమిలో కుమ్ములాటలు పోలింగ్ రోజున దెబ్బేసాయి. కనీసం సగం సీట్లలలోనైనా పోటీ చేస్తుందని భావించిన జనసేన పార్టీ నేతల్ని పవన్ తీరు పూర్తిగా నిరాశపరిచింది. కేవలం 21 అసెంబ్లీ సీట్లకి, రెండు పార్లమెంట్ సీట్లకి జనసేన పరిమితం కావడం ఆ పార్టీ నేతలను పూర్తిగా నైరాశ్యంలోకి నెట్టింది. దీనికి తోడు మొదట నుంచి పార్టీ కోసం కష్టపడిన వారిని కాదని చివరి నిమిషంలో పలువురు టీడీపీ నేతల్ని జనసేనలో చేర్చుకుని టిక్కెట్లు ఇవ్వడం పార్టీ సీనియర్ నేతలకి ఆగ్రహం కలిగించింది. గోదావరి జిల్లాల్లో అయితే నియోజకవర్గ ఇన్ చార్జిలకి వెన్నుపోటు పొడుస్తూ జనసేనకు బలం ఉన్న సీట్లను టిడిపికి త్యాగం చేయడం అక్కడి కేడర్‌ను నిరాశలోకి నెట్టింది. దీంతో పలువురు నేతలు జనసేనకి గుడ్ బై చెప్పి వైఎస్సార్ సిపిలో చేరారు.
సీట్ల పంపకాల సమయంలోనే సొంత పార్టీలోనే పవన్ నిప్పు రాజేసుకున్నారు. దీనికి తోడు జనసేన పార్టీ నేతలకి టీడీపీ నుంచి పూర్తి సహకారం లభించలేదు. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురంలో టీడీపీ నేత వర్మ చివరి నిమిషం వరకు కంట్లో నలుసుగానే కొనసాగారు. పవన్ కళ్యాణ్ గెలుపొందితే శాశ్వతంగా పిఠాపురం నుంచి తాను దుకాణం సర్ధుకోవాల్సి ఉంటుందనే భయంతో వర్మ తన క్యాడర్ ని పవన్ కి పూర్తిగా సహకరించనివ్వలేదని తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో పవన్ తో పాటే వర్మ తిరిగినా టిడిపి ఓటు షేర్ జనసేనకి పూర్తిగా బదిలీ కాలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో 21 అసెంబ్లీ స్ధానాలలో ఎన్ని సీట్లలో గెలుస్తామనేది జనసేన చెప్పలేకపోతోంది. ఎన్డీఎ కూటమి గెలుస్తుందంటూ పవన్ పోలింగ్ ముగిసిన తర్వాత కేవలం ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి చేతులు దులిపేసుకున్నారు. చాలా బలంగా ఉన్నామని చెప్పుకున్న గోదావరి జిల్లాలలోనూ కాపు ఓట్లు తప్పితే బిజెపి, టిడిపి ఓట్లు జనసేనకి పడలేదని ఆ పార్టీ నేతలే వాపోతున్నారు.
ఇక బిజెపి కూడా అదే విధమైన అయోమయంతో ఉంది. వాస్తవానికి ఈ పార్టీలో కూడా అంతర్గత కుమ్ములాటలు గెలుపుపై ధీమా లేకుండా చేశాయి. బిజెపి సీనియర్లెవరికీ ఇష్టం లేకపోయినా చివరి నిమిషంలో టిడిపి, జనసేన కూటమితో జతకట్టి పది అసెంబ్లీ స్ధానాలకి, ఆరు పార్లమెంట్ స్ధానాలకి పరిమితం కావడం పార్టీలో సీనియర్లకి మింగుడుపడలేదు. దీంతో పాటు బిజెపిలో మొదట నుంచి ఉన్న వారికి, సీనియర్లకి టిక్కెట్ల కేటాయింపు కోసం సీనియర్లు ఎంత ప్రయత్నించినా..రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరి కుతంత్రాలతో ఒరిజినల్ బిజెపి కాస్తా తెలుగు బిజెపిగా మారిపోయింది. ఇక్కడ కూడా విశాఖపై పట్టున్న జివిఎల్ కి టిక్కెట్ రాకుండా తన సోదరుడు బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ కోసం పురందేశ్వరి చేసిన కుట్రలతో జీవీఎల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. అలాగే రాజమండ్రి నుంచి పోటీ చేయాలని ఆశించిన సోము వీర్రాజుకి టిక్కెట్ ఇవ్వకపోవడం, హిందూపూర్ ఆశించిన విష్టువర్ధన్ రెడ్డికి టిక్కెట్ రాకుండా పురందేశ్వరి అడ్డుపడ్డారు.
ఈ నేపధ్యంలో బీజేపీ అసలు నేతలంతా ప్రచారానికి దూరంగా ఉండిపోయారు. అదే సమయంలో టిడిపి నుంచి బిజెపిలో చేరిన, చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలున్నవారికే టిక్కెట్లు దక్కడం బిజెపిలో తీవ్ర అసంతృప్తిని రేకెత్తించింది. ప్రధాని మోదీ, హోమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా లాంటి నేతలు వచ్చినపుడు తప్పితే మిగిలిన సమయాలలో పార్టీ అభ్యర్థులకు సొంత పార్టీ నేతలు సహకరించలేదని తెలుస్తోంది. దీనికి తోడు టిడిపి, జనసేన నుంచి కూడా ఓటు బదిలీ కాలేదన్న విషయం స్పష్టంగా కనిపిస్తోందని బిజెపి అభ్యర్ధులు వాపోతున్నారు. జనసేన, టిడిపి ఓట్లు తమకు బదిలీ కాకపోవడం చాలా దెబ్బేసిందని వారు చెబుతున్నారు. దీంతో పాటు పోల్ మేనేజ్ మెంట్ లో పూర్తిగా విఫలమయ్యామని రాష్ట్ర బీజేపీ నాయకులు చెబుతున్నారు.
సొంత పార్టీ నేతలకంటే బిజెపి, జనసేనను నమ్ముకుని పూర్తిగా మునిగిపోయామని టిడిపి నేతలు భావిస్తున్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఆ పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటే జనసేన, బిజెపి ఓట్లు తమకు పడకపోవడంపై నైరాశ్యంలో ఉన్నారు. గాజు గ్లాజు గుర్తు ఉన్న చోట మాత్రమే ఓట్లు పడ్డాయని...టిడిపి అభ్యర్ధులు ఉన్న చోట జనసేన ఓట్లు వేయలేదని..చాలా చోట్ల తమకి నచ్చిన పార్టీకి...నేతకి ఓటు వేసుకున్నారని గోదావరి జిల్లాకి చెందిన ఓ టిడిపి నాయకుడు చెబుతున్నారు. గోదావరి జిల్లాలలో టిడిపి, జనసేన కలిస్తే క్లీన్ స్వీప్ అవుతాయని భావించామని కానీ బిజెపితో కలవడం బాగా దెబ్బ కొట్టిందని అంటున్నారు. దీనికి తోడు జనసేన పార్టీ ఓట్లు తమకు పడలేదని..గాజు గ్లాసు లేని చోట పలువురు వైఎస్సార్ సిపికి ఓటు వేయడంతో తమ విజయవకాశాలను దెబ్బ కొట్టిందంటున్నారు. కొన్ని చోట్ల గత అయిదేళ్లగా పార్టీ కోసం కష్టపడిన నేతలని పక్కన పెట్టడం కూడా టిడిపికి మైనస్ అయింది. పశ్చిమగోదావరి జిల్లా ఉండిలో సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుని కాదని వైఎస్సార్ సిపి బహిషృత నేత రఘరామకృష్ణంరాజుకి ఇవ్వడం జిల్లా వ్యాప్తంగా మైనస్ గా మారిందంటున్నారు.
దీనికి తోడు టిడిపి రెబెల్ గా ఉండి నుంచి మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు బరిలో ఉండటం కూడా పూర్తిగా వ్యతిరేకమైందంటున్నారు. ఇలా పలు నియోజకవర్గాలలో సొంత పార్టీ నేతలని కాదని బయట పార్టీ వారికి ఇవ్వడం కూటమి అభ్యర్ధుల గెలుపోటములపై తీవ్ర ప్రభావం చూపుతాయంటున్నారు. టిక్కెట్ రాని నేతలంతా చివరి నిమిషంలో కూటమి నేతలకి షాక్ ఇచ్చారని చెబుతున్నారు. మరోవైపు జనసేన, బిజెపి ఓట్లు కూడా పూర్తిగా టిడిపికి పడలేదని ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలోనే గెలుపుపై టిడిపి ధీమా కోల్పోయి..ఓటమి ఖాయమై నేతలంతా నైరాశ్యంలోకి వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment