మనవాళ్ల కోసం ఎకరాకు పదివేలు.. రాజధాని ప్రాంతంలో సేకరణ  | Sakshi
Sakshi News home page

మనవాళ్ల కోసం ఎకరాకు పదివేలు.. రాజధాని ప్రాంతంలో సేకరణ 

Published Tue, Mar 5 2024 12:53 PM

Amaravati Sympathizer Farmers collecting funds for TDP - Sakshi

టీడీపీ కోసం సానుభూతిపరుల చందాలు 

‘‘మనకు ఇదే ఆఖరి అవకాశం.... ఇప్పుడు తప్పితే మరెప్పుడూ రాలేం.. ఈసారి మనం ప్రాణాలకు తెగించి పోరాడాలి.. అవసరమైతే చందాలు ఇవ్వాలి.. విరాళాలు ఇవ్వాలి.. భోజనాలు పెట్టాలి.. ఆస్తులైనా అమ్మాలి... మనవాళ్లను మన పార్టీని మనం కాపాడుకోవాలి.. లేదంటే మన పార్టీతో బాటు మన పెద్దరికాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలి.’’  ఇదీ అమరావతి ప్రాంతంలో భూములున్న రైతులు.. చంద్రబాబు సామాజికవర్గం మోతుబరుల్లోని అభిప్రాయం.

అమరావతి ప్రాంతంలో భూములు ఇచ్చినవాళ్లు.. అమరావతి కారణంగా భూముల ధరలు పెరిగి అమాంతం కోటీశ్వరులు అయినవాళ్లు.. వ్యాపారాలు చేసి పోగేసిన వాళ్లు.. వీళ్లంతా ఎక్కువమంది టీడీపీ సానుభూతిపరులుగా ఉన్నారు. గతంలో రాజధాని పేరిట బాగా లబ్ధిపొందిన ఈ వర్గం వారు 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవడంతో హతాశులయ్యారు. ఇక కొందరైతే భారీగా భూముల ధరలు పెరుగుతాయని అప్పులు తెచ్చిమరీ భూములుకొన్నవాళ్ళు ఆ మేరకు ధరలు పెరగకపోవడం... రాజధాని కుంభకోణాలు బయటపడడంతో ఆ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోవడం... కోర్టు కేసుల్లో కొన్ని భూములు చిక్కుకోవడంతో తమ కలలు కల్లలయ్యాయని కలవరపడ్డారు.

ఆ నష్టాన్ని పూరించుకోవాలని, మళ్ళీ రాజధాని పేరిట లబ్ధిపొందాలని సర్వదా ప్రయత్నిస్తున్నారు. మళ్ళీ ఐదేళ్లు గడిచాక అసెంబ్లీ ఎన్నికలకు సమయం వచ్చింది. దీంతో ఇప్పుడు వాళ్లంతా ఏకమయ్యారు. ఈ ప్రాంతంలో ఎకరా భూమి ఉన్నవాళ్లు కనీసం రూ. 10 వేలు టీడీపీకి విరాళం ఇవ్వాలని .. ఆ మేరకు ఎంత ఎక్కువ భూమి ఉంటె అంత మొత్తంలో డబ్బులు జమచేసి టీడీపీకి విరాళంగా ఇవ్వాలని, టీడీపీ అభ్యర్థులను గెలిపించుకోవాలని తీర్మానించారు.

ఈమేరకు గ్రామాలూ.. వార్డులు.. మండలాలవారీగా చంద్రబాబు సామాజికవర్గం ప్రజలు.. వ్యాపారులు రైతులు కూడా ఎకరానికి కనీసం పదివేలు ఖచ్చితంగా ఇవ్వాలన్న నిబంధన విధించి ఆ మేరకు పని చేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే గ్రామ.. మండలాల వారీగా కమిటీలు వేసి వసూళ్లు చేపడుతున్నారు. 

అందరం ఐక్యంగా ఉండాలని, ఈసారి వైయస్సార్ కాంగ్రెస్ గెలిస్తే తెలుగుదేశానికి పుట్టగతులు ఉండవని, అందుకే ఖచ్చితంగా టీడీపీని గెలిపించుకునే బాధ్యత తామే తీసుకోవాలని తీర్మానించారు. ఈ క్రమంలో వారి వారి స్థాయిని బట్టి చందాలు రెడీ చేస్తున్నారు. ఇక ఇక్కడ భూములు కొనేసి ప్రవాసాంధ్రులు , అమెరికాలోని తానా(TANA) సంఘం సభ్యులు... వారి బంధుమిత్రులు సైతం ఈ బాధ్యతల్లో యాక్టివ్ గా పాల్గొనేలా చూస్తున్నారు. విదేశాల్లోని యువత, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు.. సాఫ్ట్ వేర్, ఇతర వృత్తుల్లోని వాళ్ళను సైతం ఈ చందాల కార్యక్రమంలో చేర్చుకుని టీడీపీ కోసం అందరం పని చేయాల్సిన అవసరాన్ని వాళ్లకు పదేపదే చెబుతున్నారు. 

///సిమ్మాదిరప్పన్న ///

Advertisement
Advertisement