Sakshi News home page

కమలదళం.. వికేంద్రీకరణం! 

Published Sat, Apr 20 2024 5:45 AM

BJP strategy for double digit seats - Sakshi

క్షేత్రస్థాయిలో పోలింగ్‌ బూత్‌లు కేంద్రంగా ప్రచార ప్రణాళికలు 

వీలైనన్ని ఎక్కువసార్లు ఓటర్లను కలిసేలా సన్నాహాలు 

అగ్రనేతలు వచ్చినప్పుడే పెద్ద బహిరంగ సభలు 

ఇంటింటి ప్రచారంపైనే ప్రధానంగా దృష్టి 

వీధి మలుపు సమావేశాలు, ‘ఔట్‌రీచ్‌’కు ప్రాధాన్యత 

డబుల్‌ డిజిట్‌ సీట్ల కోసం బీజేపీ వ్యూహం 

సాక్షి, హైదరాబాద్‌ :  రాష్ట్రంలో డబుల్‌ డిజిట్‌ ఎంపీ సీట్లు గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న కమలదళం ఇందుకోసం వికేంద్రీకరణ వ్యూహాన్ని అమలు చేస్తోంది. క్షేత్రస్థాయిలో పోలింగ్‌ బూత్‌లు కేంద్రంగా ప్రణాళికలు రచించింది. గత నెల ఎల్‌బీ స్టేడియంలో రాష్ట్రవ్యాప్తంగా 30 వేల మంది పోలింగ్‌ బూత్‌ కమిటీల అధ్యక్షులు, ఆపై మండల, జిల్లా స్థాయి అధ్యక్షులకు పార్టీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేసిన దిశానిర్దేశానికి అనుగుణంగా ముందుకు సాగనుంది. పోలింగ్‌ బూత్‌ల కేంద్రంగా కార్యకలాపాలపై ప్రత్యేకంగా దృష్టిని కేంద్రీకరిస్తోంది. వికేంద్రీకరణ పద్ధతిలో క్షేత్రస్థాయికి ప్రాధాన్యతనిస్తూ వివిధ స్థాయిల్లో వివిధ రకాల ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతోంది.  

ఓటర్లను పలుమార్లు కలిసేలా.. 
వచ్చేనెల 13న పోలింగ్‌ జరిగేలోగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పోలింగ్‌ బూత్‌ పరిధిలోని ప్రతి ఇంటి తలుపు మూడుమార్లు తట్టి ఓటర్లను కలుసుకుని బీజేపీకి మద్దతు కోరాలని ఇప్పటికే నిర్ణయించారు. దీనితో పాటు ఒక్కో లోక్‌సభ సీటు పరిధిలో కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేసుకుని బూత్‌ కమిటీలను పరవేక్షించనున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్దిదారుల నుంచి క్రమం తప్పకుండా ఫీడ్‌బ్యాక్‌ తీసుకోవడం, తమ వద్దనున్న డేటాతో సరి చూసుకోవడం లాంటివి చేపట్టాలని నిర్ణయించారు.

ఇందులో భాగంగా ఈ నెల 15, 16, 17 తేదీల్లో తొలివిడత కార్యక్రమం ముగిసింది. ఈ నెల 28, 29, 30 తేదీల్లో రెండో విడత, సరిగ్గా పోలింగ్‌కు ముందు మే 9, 10, 11 తేదీల్లో మూడోవిడతలో ప్రతి ఇంటికీ వెళ్లి ప్రతి ఓటర్‌ను కలిసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధమవుతున్నారు. బూత్‌ స్థాయిలో కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారులను కలిసి పూర్తిస్థాయిలో మద్దతు కూడగట్టాలని, ఈ నెల 29న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిశాక క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయాలని నిర్ణయించారు.  

నామినేషన్‌ కార్యక్రమాలకు కేంద్ర మంత్రులు 
ఈ నెల 25 నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ కాగా 22 నుంచి బీజేపీ అభ్యర్థుల నామినేషన్‌ పత్రాల సమర్పణ ఊపందుకోనుంది. తొలి రెండురోజుల్లో సికింద్రాబాద్‌ (కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి) సహా ఐదుచోట్ల అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఇక 22న జహీరాబాద్‌లో బీబీ పాటిల్, చేవెళ్లలో కొండా విశ్వేశ్వరరెడ్డి, నల్లగొండలో సైదిరెడ్డి, మహబుబాబాద్‌లో సీతారాం నాయక్‌ నామినేషన్లు దాఖలు చేయనున్నారు.

23న భువనగిరిలో బూర నర్సయ్య, 24న పెద్దపల్లిలో గోమాస శ్రీనివాస్, ఆదిలాబాద్‌లో నగేష్, హైదరాబాద్‌ మాధవీలత, వరంగల్‌లో ఆరూరి రమేష్, చివరిరోజు 25న కరీంనగర్‌లో బండి సంజయ్, నిజామాబాద్‌లో అర్వింద్, నాగర్‌కర్నూల్‌లో భరత్‌ ప్రసాద్‌ నామినేషన్లు వేస్తారు. ఈ కార్యక్రమాల్లో కేంద్ర మంత్రులు పీయూష్‌ గోయల్, జైశంకర్, అనురాగ్‌ ఠాకూర్, కిరణ్‌ రిజిజు, గుజరాత్, ఉత్తరాఖండ్‌ సీఎంలు భూపేంద్ర పటేల్, పుష్కర్‌సింగ్‌లు పాల్గొననున్నారు.  

మే మొదటి వారంలో కార్నర్‌ మీటింగులు 
ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేయడంలో భాగంగా మే 1 నుంచి 8 దాకా కార్నర్‌ మీటింగులు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. మూడు, నాలుగు పోలింగ్‌ బూత్‌లకు కలిపి ఓ కార్నర్‌ మీట్‌ను నిర్వహించి ఓటర్లను స్వయంగా కలుసుకోవడం ద్వారా పార్టీ అభ్యర్థి గెలుపు కోసం మరోసారి అప్పీల్‌ చేయనున్నారు. పోలింగ్‌కు ముందు పదిరోజులు అభ్యర్థులు పూర్తిగా క్షేత్రస్థాయి సమావేశాలు, బూత్‌ పర్యటనల్లో పాల్గొనేలా వ్యూహ రచన చేస్తున్నారు.

పోలింగ్‌ బూత్‌ స్థాయిలో కేడర్‌తో ప్రచారం, ఓటర్‌ ఔట్‌ రీచ్‌ కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే 17 ఎంపీ స్థానాలకు పార్లమెంట్‌ కన్వినర్లు, ఇన్‌చార్జిలు, పొలిటికల్‌ ఇన్‌చార్జిల నియామకం పూర్తికావడంతో వారంతా తమకు అప్పగించిన విధుల్లో నిమగ్నమయ్యారు. మే మొదటి వారం నుంచి 11వ తేదీ మధ్య మోదీ, అమిత్‌షా, నడ్డా, ఇతర ముఖ్యనేతలు ఎన్నికల ప్రచారానికి రానున్నారు. వారు వచ్చినప్పుడే పెద్ద బహిరంగ సభలు ఉంటాయి.

వికేంద్రీకరణ వ్యూహంలో భాగంగా మిగతా ప్రచారమంతా పలుమార్లు క్షేత్రస్థాయిలో ఓటర్లను కలుసుకోవడం, చిన్న చిన్న సభలు, సమావేశాలు, వీధి చివర మీటింగ్‌లు లాంటి వాటిపైనే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి నిర్వహించనున్నారు.  

Advertisement
Advertisement