చంద్రబాబు, పవన్‌ను ఓ ఆటాడుకున్న సీఎం జగన్‌.. | Sakshi
Sakshi News home page

చంద్రబాబు, పవన్‌ను ఓ ఆటాడుకున్న సీఎం జగన్‌..

Published Tue, Apr 16 2024 7:15 PM

Cm Jagan Sensational Comments Chandrababu pawan Kalyan at Bhimavaram - Sakshi

ఆంధ్రా పొలిటికల్ లీగ్ (ఏపీఎల్) లో ఫోర్లు సిక్సర్లతో హోరెత్తించిన స్పీచ్

ప్రత్యర్థులను కలవరపర్చే రీతిలో యార్కర్ బౌలింగ్

భీమవరం సభలో చెలరేగిన సీఎం జగన్ 

నిజమే.. కొన్ని విషయాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎంత సున్నితంగా స్పందిస్తారో కొన్ని అంశాల్లో అయన అంత నిర్దయగా ఉంటారు అని ఒక్కోసారి అనిపిస్తుంది. పేదలు, రోగులు, ఆపన్నులు.. వృద్ధులు, వికలాంగులు ఎదురైతే అయన ఎంతగా ఆర్తిగా అల్లుకుపోతారన్నది ఎన్నో సందర్భాల్లో రుజువైంది. వేలాదిమంది హాజరయ్యే జనంలో తన కోసం వెతికే కళ్ళు ఎవరివన్నది అయన క్షణంలో గుర్తించి వాళ్ళను తనవద్దకు తీసుకురమ్మని సిబ్బందిని, పోలీసులను ఆయనే పురమాయిస్తారు..

అంటే ఆర్తితో ఉన్నవాళ్లను అయన అంతగా దగ్గరకు తీసుకుంటారు. అదే  తనను అవమానించినవాళ్లను, తనను అవహేళన చేసి వెకిలి నవ్వులు నవ్వే వాళ్ళను,  ప్రజలను వంచించేవాళ్ల విషయంలో సైతం అంతే జోరుగా స్పందిస్తారు. ఈ విషయం భీమవరం సభలో మరోమారు రుజువైంది. ఎక్కడా.. ఈ కోశనా.. చంద్రబాబు, పవన్‌లను బంతి ఆట ఆడేసుకున్నారు.  దాదాపు గంటసేపు సాగిన ఈ ప్రసంగంలో సీఎం వైఎస్ జగన్ మునుపెన్నడూ లేని రీతిలో ప్రతిపక్షాల మీద విరుచుకు పడ్డారు. 

ఐపీఎల్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మను నియంత్రించడం ఫీల్డర్లకు ఎంతటి కష్టమో భీమవరం సభలో జగన్ గళం నుంచి దూసుకొచ్చిన మాటలతూటాలకు సమాధానం ఇవ్వడం అంతకన్నా కష్టం అని ప్రతిపక్ష కూటమికి అర్థం కావడానికి ఎంతోసేపు పట్టదు. రొయ్యకు మీసం.. చంద్రబాబుకు మోసం పుట్టుకతోనే వస్తాయి.. ఒక చీటర్.. ఒక మోసగాడు.. మాయలోడు.. అనదగిన చంద్రబాబు మన ఖర్మకొద్దీ మొన్నటి వరకు మనకు ముఖ్యమంత్రిగా ఉండేవాడు. ఇంకా ఈ డెబ్బై ఐదేళ్ల వయసొచ్చినా బుద్దిరాని చంద్రబాబు నామీద రాళ్లు వేయాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు.

పోనీ ఆయన ఇన్నేళ్ల పాలనలో తనకు, రాష్ట్రానికి ..ప్రజలకు గుర్తుండే పథకం..ప్రాజెక్టు ఒక్కటైనా తీసుకొచ్చారా అంటూ పదేపదే జగన్ వేస్తున్న ప్రశ్నకు ఇంతవరకూ అటునుంచి సమాధానం రాలేదు. ఇక గతంలో అనుభవజ్ఞుడు అంటూ గెలిపించిన చంద్రబాబు గ్రాఫిక్స్ చూపించి ప్యారిస్.. లండన్.. సింగపూర్.. మలేషియా అంటూ బొమ్మలు చూపించారు తప్ప.. ఒక్కటంటే ఒక్కటైనా పూర్తి చేశారా? జిల్లాకో సైబర్ సిటీ కట్టారా? ప్రతి జిల్లాకు బులెట్ రైలు తెచ్చారా? ఉద్యోగాలు తెచ్చారా? పరిశ్రమలు ఏర్పాటు చేశారా? ఇంటికో ఉద్యోగం ఇచ్చారా అంటూ బ్రహ్మోస్ మిస్సైళ్ళ మాదిరిగా దూసుకొచ్చిన ప్రశ్నలు జనాన్ని ఆలోచింపజేశాయి.

మన ప్రభుత్వంలో తెచ్చినట్లుగా పోర్టులు.. మెడికల్ కాలేజీలు.. ఆర్‌బీకేలు.. సచివాలయాలు.. ఆస్పత్రులు.. ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు.. వీటిలో ఒక్కటైనా చంద్రబాబు తెచ్చాడా? అలాంటి చేతగాని చంద్రబాబును జాకీలతో లేపడానికి ఎల్లోమీడియాలు ఎంతో ఆరాటపడుతున్నాయి. రాష్ట్రం ఇలా తయారవడానికి చంద్రబాబు,  దత్తపుత్రుడితోపాటు ఎల్లోమీడియా బాధ్యత వహించాలి అంటూ అయన చేసిన ప్రసంగం ఆద్యంతం ఉద్విగ్నంగా సాగింది.

అంతేగాక గతంలో టీడీపీ తీసుకొచ్చిన మ్యానిఫెస్టోను సైతం మళ్ళీ ప్రజలముందుకు తెచ్చి ఒక్కో హామీని విడమర్చి చెబుతూ ఇది చేశారా? ఈ పథకం వచ్చిందా? ఈ ప్రాజెక్టు తెచ్చారా అంటూ ప్రజలనుంచే సమాధానాలు రాబడుతూ స్వైరవిహారం చేసారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు నేను గుర్తు చేయడమే నా తప్పా? నేను ఆయన్ను అడగడమే నా నేరమా.. అందుకే నామీద చంద్రబాబు కోపమా అంటూ గూటం దించేశారు. మొత్తంగా భీమవరం సభలో జగన్ ప్రసంగం గతంలో సభలకన్నా కాక పుట్టించింది. మొత్తంగా ప్రతిపక్షాలను ఏకిపారేశారు. ఈ టైప్ పొలిటికల్ బౌలింగుతో అయన చిరుత వేగంతో ప్రత్యర్థుల మీదకు విసిరే యార్కర్లకు అట్నుంచి సమాధానం రావడం కష్టమే.
- సిమ్మాదిరప్పన్న

Advertisement

తప్పక చదవండి

Advertisement