గీతాంజలిని దారుణంగా ట్రోల్‌ చేసి వేధించారు: సీఎం జగన్‌ | CM YS Jagan Speech Highlights At Interaction With YSRCP Social Media Workers, Details Inside - Sakshi
Sakshi News home page

సోషల్‌ మీడియా మనతోనే.. దేవుడు ఇంకా ఏదో పెద్ద స్క్రిప్ట్‌ ఏదో రాశాడు: సీఎం జగన్‌

Published Tue, Apr 23 2024 12:52 PM

CM YS Jagan Speech At Interaction With YSRCP Social Media Workers - Sakshi

విశాఖపట్నం, సాక్షి: సోషల్‌ మీడియాలో టీడీపీ, దాని మిత్రపక్షాలు దిగజారి ప్రవర్తిస్తున్నాయని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా ఆనందపురంలో రెండు వేల మందితో కూడిన వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా వింగ్‌తో ముఖాముఖి నిర్వహించారాయన. 

‘‘మనం కూటమి కుట్రలు, కుతంత్రాలతో యుద్ధం చేస్తున్నాం. చంద్రబాబు, దత్తపుత్రుల కుట్రలతో యుద్ధం చేస్తున్నాం. అబద్ధాలు, మోసాలతో యుద్ధం చేస్తున్నాం. నేను ఒక్కడిని ఒకవైపు.. చంద్రబాబు, దత్తపుత్రుడు, ఇతరులు మరోవైపు. ఒకే ఒక్కడిగా ఎన్నికల కురుక్షేత్రంలో దిగుతున్నా. విజయానికి దగ్గరగా ఉన్నామనే.. మనపై దాడి తీవ్రతరం చేశారు.  గీతాంజలిని దారుణంగా ట్రోల్‌ చేసి వేధించారు.

టీడీపీ.. వ్యవస్థ ఎంత దిగజారిందో అనడానికి గీతాంజలి ఆత్మహత్య ఘటనే ఉదాహరణ. కానీ, సోషల్‌ మీడియా మనతోనే ఉంది. సెల్‌ఫోన్‌ ఉన్న ప్రతీ ఒక్కరూ మనతోనే ఉన్నారు. దాడులకు భయపడేది లేదు. దేవుడు ఇంకా ఏదో పెద్ద స్క్రిప్ట్‌ ఏదో రాశాడు. అందుకే దాడి నుంచి బయటపడగలిగాను. ఈసారి ఎన్నికల్లో 175కి 175 రావాలి. 25కి 25 లోక్‌సభ సీట్లు గెలవబోతున్నాం’’ అని సోషల్‌ మీడియా కార్యకర్తలతో సీఎం జగన్‌ అన్నారు. 

సీఎం వచ్చి నేరుగా విశాఖలో కూర్చుంటే.. బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నైతో పోటీ పడే స్థాయికి వెళ్తుంది. విశాఖపట్నం ఏపీకి డెస్టినేషన్‌ అవుతుంది. ఐటీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని సీఎం జగన్‌ తెలిపారు.  ఈ సందర్భంగా పలువురు YSRCP సోషల్‌ మీడియా కార్యకర్తలు తమ మనోగతాన్ని సీఎం జగన్‌తో పంచుకున్నారు.

సోషల్ మీడియా కార్యకర్తలతో  ముఖాముఖి కార్యక్రమంలో సీఎం జగన్‌ ఏమన్నారంటే..

ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన పార్టీ సోషల్ మీడియా ఆఫీస్ బేరర్స్ కు, పార్టీ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్స్ కు, ఇండిపెండెంట్ ఇన్ ఫ్లూయెన్సర్స్ కు, ఎన్ఆర్ఐ యాక్టివిటీలో అక్కడ నుంచి వర్చువల్ గా అటెండ్ అవుతున్న సోషల్ మీడియా సైనికులకు, యూట్యూబ్ నెట్ వర్క్ ద్వారా కనెక్ట్ అయి ఉన్న వాళ్లందరికీ,  ఇక్కడికి రాలేకపోయినా కూడా మీ అభిమానంలో మాత్రం ఎక్కడా కూడా తక్కువ అనేదే లేకుండా మీ అన్నకు, దాదాపుగా 5 సంవత్సరాల పాటు మనం అధికారంలోకి రాకమునుపటి నుంచి ఇప్పటిదాకా ప్రతి సందర్భంలోనూ తోడుగా ఉంటూ వస్తున్న నా చెల్లెమ్మలకు, నా తమ్ముళ్లకు, కొంత మంది నా అన్నలకు కూడా మీ అందరికీ కూడా మీ జగన్, మీ అన్న, మీ తమ్ముడు పేరు పేరునా రెండు చేతులూ జోడించి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాడు. 

ఈరోజు ఇక్కడ మనమంతా  ఏకమయ్యాం
 రాబోయే  మరో 18 రోజుల్లో జరగబోతున్న ఎన్నికల కురుక్షేత్రంలో మనమంతా కూడా క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేసే కార్యక్రమంలో ఈరోజు అందరం కూడా షేర్ చేసుకునే విషయంలో ఏకమయ్యాం. 

ఈరోజు నేను మీ అందరితో కూడా ఒకటే చెబుతున్నాను. మనకు ఒకవైపున చూస్తే, అటువైపు ఉన్న బలాలు మన దగ్గర లేవు. అటువైపు మనం యుద్ధం చేస్తున్నది ఎవరితో అని చూస్తే, ఇటువైపున కేవలం మీ జగన్ ఒకే ఒక్కడు కనిపిస్తాడు. కానీ అటువైపున కూటమిలో వాళ్లను చూస్తే చాలా గంభీరంగా కనిపిస్తుంటుంది. ఒక్క జగన్ మీద ఒక చంద్రబాబు, ఒక దత్తపుత్రుడు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5.. వీళ్లందరూ సరిపోరు అన్నట్టుగా ఒక బీజేపీ, ఒక కాంగ్రెస్. వీళ్లందరే కాకుండా మనం యుద్ధం చేస్తున్నది ఎవరితో అంటే వీళ్ల కుట్రలతో, కుతంత్రాలతో, అబద్ధాలతో, మోసాలతో యుద్ధం చేస్తున్నాం. 

ఈ మధ్య కాలంలో అయితే వాళ్ల ఉక్రోశం ఏ స్థాయిలోకి వెళ్లిపోయింది అంటే చివరికి సోషల్ మీడియాలో మీ జగన్ కు అంటే వాళ్ల అన్నకు తాను సపోర్ట్ చేసింది అని, ఆ సపోర్ట్ కూడా పాపం తాను ఎందుకు చేసిందంటే.. తాను జగనన్న చేసిన మంచితో తాను కూడా బాగుపడింది అని, జగనన్న వల్ల తనకు ఇల్లు వచ్చిందని, ఇంటి స్థలం వచ్చిందని, మిగిలిన పథకాలు కూడా జగనన్న వల్ల వచ్చాయని, తన సంతోషాన్ని తన సోషల్ మీడియాలో పాలు పంచుకుంటే ఏకంగా ఆ గీతాంజలి అనే నా చెల్లెల్లి ఎంత దారుణంగా ట్రోల్ చేశారో అందరం కూడా చూశాం. ఎంతటి దారుణంగా వేధించారో కూడా అందరం చూశాం. చివరికి ఆ చెల్లి సూసైడ్ చేసుకునేంత దూరం కూడా పోయింది అంటే నిజంగా ఈ వ్యవస్థ అన్నది ఎంత దారుణంగా చెడిపోయింది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. 

మనకు సోషలో మీడియా ఉంది.
ఇంతకు ముందు నేను చెప్పాను. జగన్ ఇటువైపున ఒకే ఒక్కడు. అటువైపున చూస్తే ఇంత మంది.. ఈ ఇంత మందికీ తోడు కుట్రలు, కుతంత్రాలు, అబద్ధాలు, మోసాలు, బెదిరింపులు, హెరాస్ మెంటు, అన్నీ కూడా జరుగుతున్నాయి. మరి ఇంత మందితో, ఇన్ని కుట్రలతో, ఇన్నిన్ని ఇబ్బందుల మధ్య మీ జగన్.. మీ అన్న, మీ తమ్ముడు.. తట్టుకొని నిలబడగలుగుతున్నాడంటే కారణం.. వాళ్లకు ఈనాడు ఉండొచ్చు, ఆంధ్రజ్యోతి ఉండొచ్చు, టీవీ5 ఉండొచ్చు. కానీ మనకు.. సోషల్ మీడియా ఉంది. సెల్ ఫోన్ చేతిలో ఉన్న నా ప్రతి చెల్లెమ్మ, ప్రతి తమ్ముడూ జగన్ కు తోడుగా ఉన్నాడు. అందుకే జగన్ ఒంటరి కాదు. జగన్ కు ఇన్ని కోట్ల గుండెలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. జగన్ కోసం ప్రాణం ఇచ్చేదానికి కొన్ని లక్షల గుండెలు అండగా, తోడుగా ఉన్నాయి. 

ఇంత మంది తోడున్న జగన్ ఒంటరివాడు కాదు.
మరి ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ఒంటరి ఎలా అవుతాడు? ఆ దేవుడి దయ మీద జగన్ కు నమ్మకం ఉంది. జగన్ ను ప్రేమించే గుండెల మీద జగన్ కు నమ్మకం ఉంది. మీ అందరూ చేసిన, చేస్తున్న, చూపిస్తున్న అభిమానానికి, ఆప్యాయతలకు మీ జగన్ మాత్రం నిండు మనసుతో ఒకటే చెప్పగలుగుతాడు. మీకు ఎంత చేసినా, ఏమి చేయగలిగినా కూడా అది తక్కువే అవుతుందని మాత్రం ఈ సందర్భంగా సగర్వంగా చెప్పగలుగుతాడు. అన్ని రకాలుగా మీ అందరికీ తోడుగా ఉంటామని మాత్రం మరొక్కసారి భరోసా ఇస్తున్నాను. ఆర్గనైజేషన్ ను కూడా స్ట్రీమ్ లైన్ చేసే విషయంలో చాలా ఎఫెక్టివ్ గా స్ట్రీమ్ లైనింగ్ కూడా జరిగింది. భార్గవ్ కూడా చాలా క్రియాశీలకంగా స్ట్రీమ్ లైనింగ్ చేసే కార్యక్రమంలో తాను కూడా ముందుండి అడుగులు వేస్తున్నాడు.


మీ అందరికీ భరోసా ఇస్తున్నా...
అందరం కూడా మీ అందరికీ కూడా ఒకటే అసూరెన్స్ ఇస్తున్నాం.మీ వెనకాల ఉండేది ఒక్క జగనే కాదు. మీ వెనకాల ఉన్నది ఒక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మొత్తం మీ వెనకాల ఉంది అని చెబుతున్నాను.ప్రతి నియోజకవర్గంలోనూ తోడుగా ఉంది. ప్రతి మండలంలోనూ, ప్రతి గ్రామంలోనూమీకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా చెబుతున్నాను. 

ఈ విషయాలన్నీ మీ అందరికీ చెబుతూ, సోషల్ మీడియా పరంగా మీరు ఏదైనా అడగాలి అనుకుంటే మీ అన్న, మీ తమ్ముడు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడని ఈ సందర్భంగా చెబుతూ ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడమని కూడా కోరుతున్నాను. 

సిటీ ఆఫ్ డెస్టినీ రేపు ఆంధ్రా డెస్టినీ కాబోతుంది
ఈ రోజు ఎలాగూ అందరూ విశాఖపట్నానికి వచ్చారు. కొంతమంది విశాఖపట్నం వాసులు, కొంత మంది విశాఖపట్నం బయట నుంచి కూడా వచ్చిన వాళ్లు. ఈరోజు ఈ సిటీని చూస్తున్నారు కదా.. ఈ సిటీ ఆఫ్ డెస్టినీ అనేది రేప్పొద్దున ఆంధ్ర రాష్ట్ర డెస్టినీ అవుతుందన్నది మాత్రం ఈ సందర్భంగా కచ్చితంగా తెలియజేస్తున్నాను. 

ఈ విషయం తెలియజేస్తూ, ఎప్పుడైతే ఒక ముఖ్యమంత్రి వచ్చి ఈ సిటీలో కూర్చోవడం మొదలు పెడతాడో, ఎప్పుడైతే ముఖ్యమంత్రి ఈ సిటీ నుంచి పరిపాలన చేయడం మొదలు పెడతాడో అప్పుడు ఈ సిటీ అన్నది హైదరాబాద్ తో పోటీ పడే పడే పరిస్థితి, చెన్నై, బెంగళూరుతో పోటీ పడే పరిస్థితి, ఐటీని ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ కు తీసుకుని పోయే పరిస్థితి కూడా ఉంటుంది. ఈ మాట చెబుతూ మైకులో మాట్లాడాలని ఎవరైనా అనుకుంటే మీ దాకా మైకు వస్తుంది. మీరు ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. నేను ఎదైనా నోట్ చేసుకోవాల్సి ఉంటే నోట్ చేసుకుంటాను. మీకు ఏదైనా నేను సమాధానం చెప్పాల్సి వస్తే చెప్తాను. థ్యాంక్యూ. అని సీఎం జగన్‌ ప్రసంగంలో పేర్కొన్నారు.

సోషల్ మీడియా ప్రతినిధులు మాట్లాడిన అనంతరం సీఏం జగన్‌ ఏం మాట్లాడారంటే..

జగనన్న మీకు ఎప్పుడూ అండగా, తోడుగా ఉంటాడు
మీ అందరితో కూడా ఒకే ఒక విషయం చెప్పదల్చుకున్నాను. చాలా మంది మాట్లాడగలిగారు. ఇంకా చాలా మంది మాట్లాడలేని పరిస్థితి. కానీ మీ అందరితో ఒకటే చెబుతున్నాను. మీ అందరికీ కూడా తోడుగా, మీ జగనన్న ఎప్పుడూ మీకు అండగా ఉంటాడని మాత్రం ఈ సందర్భంగా చెబుతున్నాను. 

దేవుడు పెద్ద స్క్రిప్టే రాశాడు
ఇంకొక విషయం కూడా చెబుతున్నాను. ఈ దెబ్బ ఇక్కడ (నుదురుపైన) తగిలింది అంటే అది ఇక్కడా(కంటి మీద) తగల్లేదు. ఇక్కడా (కణత మీద) తగల్లేదు అంటే దేవుడు ఇంకా పెద్ద స్క్రిప్టే మనతో రాయించే కార్యక్రమంలో ఉన్నాడు అని దాని అర్థం. కాబట్టి భయం లేదు. 

పైన దేవుడు – కింద మీరు అండగా ఉండగా మీ అన్నకు భయంలేదు
మనం గెలిచేది 175కు 175 సీట్లే అని 25కు 25 ఎంపీ సీట్లే.  ఒక్క సీటు కూడా ఎక్కడా తగ్గేందుకు వీల్లేదు. మీ భుజస్కందాల మీద ఫోన్ అనే ఈ ఆయుధం మీ చేతుల్లో ఉందనేది గుర్తుపెట్టుకోమని అందరితో కోరుతున్నాను. అటు వైపున 100 ఈనాడులు వచ్చినా, 100  ఆంధ్ర జ్యోతులు వచ్చినా, 100  టీవీ 5లు వచ్చినా, 100 మంది చంద్రబాబులు, 100 మంది దత్తపుత్రులు వచ్చినా, జాతీయ పార్టీలు పరోక్షంగానూ, ప్రత్యక్షంగానూ మద్దతు పలికినా, కుట్రలు పన్నినా కుతంత్రాలు పన్నినా, అబద్ధాలు చెప్పినా, మోసాలు చేసినా మీ అందరికీ ఒకటే చెబుతున్నాను మీ జగన్‌కు  భయం లేదు. మీ అన్నకు.  మీ తమ్ముడుకి భయం లేదు. కారణం పైన దేవుడు ఉన్నాడు. కింద మీరంతా మీ అన్నకు అండగా ఉన్నారు. 

మీ అందరి ప్రేమానురాగాలకు, ఆప్యాయతలకు ఇక్కడ ఉన్న వాళ్లకు, ఇక్కడికి రాలేకపోయిన చాలా మంది ఆత్మీయులకు, దేశంలోనే కాకుండా విదేశాల్లో ఉండి కూడా వారి ప్రేమానురాగాలు, ఆప్యాయతలు చూపిస్తున్న నా అన్నదమ్ములకు, అక్కచెల్లెమ్మలకు అందరికీ కూడా మీ జగన్ మరొక్కసారి మనసారా చేతులు జోడించి పేరు పేరునా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను ఇటువైపున తిరుగుతా వచ్చినంత మేర సెల్ఫీ తీసుకుంటాను అంటూ... సీఎం వైఎస్‌ జగన్ తన ప్రసంగాన్ని ముగించారు.

Advertisement
Advertisement