కాంగ్రెస్‌ అభ్యర్థి కన్హయ్య కుమార్‌పై దాడి | Congress Candidate Kanhaiya Kumar Attacked In North East Delhi, While Campaigning In Delhi | Sakshi
Sakshi News home page

Kanhaiya Kumar Attacked: కాంగ్రెస్‌ అభ్యర్థి కన్హయ్య కుమార్‌పై దాడి

Published Sat, May 18 2024 7:03 AM

Congress Candidate Kanhaiya Kumar Beaten

దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో ఇంకా ఎన్నికల జరగని నియోజకవర్గాల్లో నేతలు ప్రచారాలు సాగిస్తున్నారు. దేశరాజధాని ఢిల్లీలో మే 25న లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈశాన్య ఢిల్లీ కాంగ్రెస్‌ అభ్యర్థి కన్హయ్య కుమార్‌పై దాడి జరిగింది.

జవహర్ లాల్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం మాజీ నేత, నార్త్ ఈస్ట్ ఢిల్లీ కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్య కుమార్‌పై దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈశాన్య ఢిల్లీలోని ఉస్మాన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్తార్ నగర్‌లో కన్హయ్య కుమార్‌కు పూలమాల వేసే నెపంతో వచ్చిన కొందరు వ్యక్తులు అతనిని చెప్పుతో కొట్టారు. ఈ సమయంలో అక్కడే ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మహిళా కౌన్సిలర్‌పై కూడా వారు దురుసుగా ప్రవర్తించారు. ఈ విషయమై ఆ కౌన్సిలర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో కన్హయ్య కుమార్ ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం నుంచి బయటకు వస్తున్న సమయంలో కొందరు పూలదండలతో రావడం కనిపిస్తుంది. వీరు కన్హయ్యకు పూలమాల వేయకుండా, అతనిపై దాడి చేయడం ఈ వీడియోలో కనిపిస్తుంది. అయితే అక్కడే ఉన్న కన్హయ్య కుమార్ మద్దతుదారులు వెంటనే ఒక యువకుడిని పట్టుకున్నారు.

బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారీ ఆదేశాలతోనే ఈ దాడి జరిగిందని కన్హయ్య ఒక ప్రకటనలో ఆరోపించారు. తనకు అమితంగా పెరుగుతున్న ప్రజాదరణ చూసి, సిట్టింగ్ ఎంపీ తివారీ నిరుత్సాహానికి గురయ్యారని, అందుకే తనపై దాడి చేసేందుకు గూండాలను పంపారని కన్హయ్య పేర్కొన్నారు. మే 25న ఓటింగ్ ద్వారా ప్రజలు దీనికి సమాధానం చెబుతారని అన్నారు.

ఢిల్లీలో మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాల్లో మే 25న ఓటింగ్ జరగనుంది. ఈశాన్య ఢిల్లీ లోక్‌సభ స్థానం నుండి బీజేపీ.. మనోజ్ తివారీని అభ్యర్థిగా నిలబెట్టగా, కాంగ్రెస్ ఈ స్థానం నుంచి కన్హయ్య కుమార్‌ను బరిలోకి దించింది. ఈ సీటులో వీరిద్దరి మధ్య గట్టి పోటీ ఉంటుందని సమాచారం. కన్హయ్య తన రాజకీయాలను జేఎన్‌యూ నుంచి ప్రారంభించారు. మనోజ్ తివారీ నటుడు, గాయకుడు. రాజకీయాల్లోనూ తన సత్తా చాటుతున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement