టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం రేగింది. ఓ మాజీ క్రికెటర్ తనకు పదే పదే ఫోన్లు చేస్తూ.. అవినీతికి పాల్పడాల్సిందిగా కోరుతున్నాడంటూ ఉగాండా ప్లేయర్ అంతర్జాతీయ క్రికెట్ మండలికి ఫిర్యాదు చేశాడు.
తనను ఫిక్సింగ్‌కు ఉసిగొల్పేలా వ్యవహరించినట్లు సదరు క్రికెటర్ పేర్కొన్నట్లు ఐసీసీ వర్గాలు వార్తా సంస్థ పీటీఐకి వెల్లడించాయి. కాగా అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా టోర్నీకి ఉగాండా తొలిసారి అర్హత సాధించింది.
వెస్టిండీస్, అఫ్గనిస్తాన్, న్యూజిలాండ్, పపువా న్యూగినియాలతో కలిసి గ్రూప్-సిలో ఉన్న ఉగాండా.. లీగ్ దశలో నాలుగింట కేవలం ఒకే ఒక్క మ్యాచ్ గెలిచింది. పపువా న్యూగినియాపై గెలుపొంది ప్రపంచకప్ టోర్నీలో బోణీ కొట్టింది.
ఇదిలా ఉంటే.. గయానాలో మ్యాచ్ సందర్భంగా తనకు బుకీల నుంచి ఫోన్‌కాల్ వచ్చినట్లు ఓ ఉగాండా ప్లేయర్ ఐసీసీకి ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. కెన్యాకు చెందిన మాజీ క్రికెటర్ వివిధ ఫోన్ నంబర్ల నుంచి పదే పదే కాల్ చేశాడని.. సదరు ప్లేయర్ ఐసీసీ అవినీతి నిరోధక విభాగం(ఏసీయూ)కి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
ఇందుకు సంబంధించి ఐసీసీ వర్గాలు పీటీఐతో మాట్లాడుతూ.. ‘‘పెద్ద జట్లతో పోలిస్తే ఉగాండా వంటి అసోసియేట్ దేశాలకు సంబంధించిన ఆటగాళ్లను టార్గెట్ చేయటమే సులువని భావిస్తారు బుకీలు. వారిని ఈజీగా ట్రాప్ చేయొచ్చనే ఉద్దేశంతో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడతారు.
అయితే, సదరు ప్లేయర్ ముందుగానే ఐసీసీ దృష్టికి ఈ విషయం తీసుకురావడం మంచిదైంది. వరల్డ్‌కప్ వంటి మెగా ఈవెంట్లలో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి.
కాబట్టి ఐసీసీ ఏసీయూ అధికారులు తప్పకుండా ఓ కన్నేసే ఉంచుతారు. క్రికెట్‌కు మచ్చతెచ్చేలా వ్యవహరించే ఏ ఒక్కరిని ఐసీసీ ఉపేక్షించదు. ఈ ఘటనపై ప్రొటోకాల్ ప్రకారం.. దర్యాప్తు జరిపి తగిన చర్యలు తీసుకుంటాం’’ అని పేర్కొన్నాయి. కాగా ఐసీసీ నిబంధనల ప్రకారం తమకు ఇలాంటి కాల్స్ వస్తే ఆటగాళ్లు మండలి దృష్టికి తీసుకురావాలి. లేదంటే కఠిన చర్యలు ఉంటాయి.
కాగా టీ20 ప్రపంచకప్-8లో ఇప్పటికే సూపర్-8 బెర్తులు ఖరారయ్యాయి. గ్రూప్-1లో టీమిండియా, అఫ్గనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్... గ్రూప్-2లో ఇంగ్లండ్, సౌతాఫ్రికా, అమెరికా, వెస్టిండీస్ ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment