T20 World Cup 2024: చిరస్మరణీయం.. తొలి విజయం సాధించిన పసికూన | T20 World Cup 2024, UGA vs PNG: Uganda Beat Papua New Guinea In Their 1st Match | Sakshi
Sakshi News home page

T20 World Cup 2024: చిరస్మరణీయం.. తొలి విజయం సాధించిన పసికూన

Published Thu, Jun 6 2024 9:32 AM | Last Updated on Thu, Jun 6 2024 11:52 AM

T20 World Cup 2024, UGA vs PNG: Uganda Beat Papua New Guinea In Their 1st Match

క్రికెట్‌ పసికూన, ఆఫ్రికా దేశం ఉగాండ ప్రపంచకప్‌ టోర్నీల్లో తమ తొలి విజయాన్ని నమోదు చేసింది. టీ20 వరల్డ్‌కప్‌ 2024లో భాగంగా పపువా న్యూ గినియాతో జరిగిన మ్యాచ్‌లో ఉగాండ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 

ఉగాండ ఆటగాళ్లు, అభిమానులు తమ తొలి విజయాన్ని ఘనంగా సెలబ్రేట్‌ చేసుకున్నారు. అభిమానుల కేరింతలు, డ్యాన్స్‌లతో గయానాలోని ప్రావిడెన్స్‌ స్టేడియం హోరెత్తిపోయింది. మ్యాచ్‌ అనంతరం ఉగాండ ఆటగాళ్ల సంబురాలు అంబరాన్ని అంటాయి.

వివరాల్లోకి వెళితే.. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకున్న ఉగాండ.. పీఎన్‌జీని 77 పరుగులకే (19.1 ఓవర్లలో) కుప్పకూల్చింది. ఉగాండ బౌలర్లు మూకుమ్మడిగా దాడి చేసి పీఎన్‌జీ బ్యాటింగ్‌ లైనప్‌ను మడత పెట్టారు. 

43 ఏళ్ల స్పిన్నర్‌ ఫ్రాంక్‌ న్సుబుగా పీఎన్‌జీ పాలిట సింహ స్వప్నమయ్యాడు. ఫ్రాంక్‌ 4 ఓవర్లలో కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఫ్రాంక్‌ స్పెల్‌లో 2 మెయిడిన్‌ ఓవర్లు ఉండటం విశేషం. 

ఫ్రాంక్‌తో పాటు అల్పేశ్‌ (4-1-17-2), జుమా మియాగి (4-0-10-2), కోస్మాస్‌ క్యేవుటా (3.1-0-17-2), కెప్టెన్‌ మసాబా (4-0-17-1) కూడా అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. పీఎన్‌జీ ఇన్నింగ్స్‌లో కేవలం ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోర్‌ చేయగలిగారు. వీరిలో హిరి హిరి (15) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఉగాండ 26 పరుగులకే సగం​ వికెట్లు కోల్పోయి దారుణ పరాజయాన్ని మూటగట్టుకునేలా కనిపించింది. అయితే రియాజత్‌ అలీ షా (33), జుమా మియాగి (13) బాధ్యతాయుతంగా బ్యాటింగ్‌ చేసి ఉగాండను గెలిపించారు. 

వీరిద్దరు ఓ మోస్తరుగా రాణించడంతో ఉగాండ 18.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. రియాజత్‌, మియాగి మినహా ఉగాండ ఇన్నింగ్స్‌లో ఎవరూ రెండంకెల స్కోర్‌ చేయలేదు. పీఎన్‌జీ బౌలర్లలో అలెయ్‌ నావ్‌ (4-0-16-2), నార్మన్‌ వనువా (4-0-19-2), చాడ్‌ సోపర్‌ (4-0-13-1), అస్సద్‌ వలా (2-0-10-1) పొదుపుగా బౌలింగ్‌ చేయడంతో పాటు వికెట్లు తీసి ఉగాండను ఇబ్బంది పెట్టారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement