
న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ ఎంపికపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ రోజు సాయంత్రం 5గంటలకు ఢిల్లీలోని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాసంలో బీజేపీ, మిత్రపక్షాల కేంద్రమంత్రులు భేటీ కానున్నారు.
2014, 2019 ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్ని దక్కించుకోవడంతో బీజేపీ కేంద్రంలో అధికారాన్ని చేపట్టింది. ఆ పార్టీ ఎంపీలే స్పీకర్‌లుగా బాధ్యతలు చేపట్టారు. 16వ లోక్‌సభ స్పీకర్‌గా బీజేపీ ఎంపీ సుమిత్రా మహాజన్ (2014), 17వ లోక్‌సభ స్పీకర్‌గా ఓంబిర్లా (2019) సేవలందించగా, ఏఐఏడీఎంకే నేత ఎం.తంబిదురై డిప్యూటీ స్పీకర్లుగా పనిచేశారు.
అయితే 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పేలవ ప్రదర్శనతో కేవలం 240 స్థానాల్ని దక్కించుకుంది. ఇతర పార్టీలైన జేడీయూ, టీడీపీల పొత్తుతో మూడో దఫా అధికారం చేపట్టింది. దీంతో లోక్‌సభ స్పీకర్ పదవి తమకూ కావాలంటూ జేడీయూ, టీడీపీలు పోటీ పడుతుండగా.. కమలం అగ్రనాయకత్వం మాత్రం ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బీజేపీ ఎంపీలనే స్పీకర్‌లుగా ఎంపిక చేసేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.
రేసులో ఆ ఇద్దరు
లోక్‌సభ ఎన్నికల ముందు ఒడిశా నుంచి బీజేపీలో చేరిన కటక్ ఎంపీ ఎంపీ భర్తృహరి మహతాబ్, ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందరేశ్వరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండగా.. ఓం బిర్లానే మరోసారి లోక్‌సభ స్పీకర్‌గా నియమించే అవకాశం ఉందంటూ జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.
ప్రొటెం స్పీకర్‌గా
రాజ్యాంగ నిబంధనలు ప్రకారం.. కొత్త లోక్‌సభ మొదటి సారి సమావేశానికి ముందు స్పీకర్ పదవి ఖాళీ అవుతుంది. కొత్త ఎంపీలతో ప్రమాణస్వీకారం చేయించడానికి సీనియర్ సభ్యుడ్ని ప్రొటెం స్పీకర్‌గా రాష్ట్రపతి నియమిస్తారు. ప్రొటెం స్పీకర్ రేసులో కాంగ్రెస్ సీనియర్ నేత కొడికున్నిల్ సురేశ్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ప్రొటెం స్పీకర్,స్పీకర్,డిప్యూటీ స్పీకర్ ఎవరనేది ఈ రోజు సాయంత్ర ఎన్డీయే, దాని మిత్రపక్ష పార్టీల కేంద్రమంత్రుల సమావేశం అనంతరం స్పష్టత రానుంది.
Comments
Please login to add a commentAdd a comment