వచ్చేస్తున్నా అంటూ ఓ డేట్ చెప్పారు. అయితే ఆ డేట్‌కి కాకుండా కాస్త లేట్‌గా వస్తా అంటున్నారు. చెప్పిన డేట్‌కన్నా ముందే వస్తా అంటున్నవారూ ఉన్నారు. ఈ మధ్య కొన్ని తెలుగు చిత్రాల విడుదల తేదీలు తారుమారయ్యాయి. ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ అలా వాయిదాలు పడి, ఫైనల్లీ ఈ 27న థియేటర్స్‌కి వస్తోంది. ఇలా రిలీజ్ డేట్‌ను తారుమారు చేసుకున్న కొన్ని చిత్రాల గురించి తెలుసుకుందాం.
దేవర.. ఓ పెద్ద కథ
‘జనతా గ్యారేజ్’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో ‘దేవర’ సినిమాని ప్రకటించినప్పుడే విడుదల తేదీ (2024 ఏప్రిల్ 5న)ని కూడా ప్రకటించారు మేకర్స్. కానీ కథ పెద్దది కావడంతో ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నట్లుగా ఆ తర్వాత పేర్కొన్నారు. అయితే చిత్రీకరణ ప్లాన్ చేసిన ప్రకారం జరగకపోవడంతో తొలి భాగం విడుదలను అక్టోబరు 10కి వాయిదా వేశారు.
కానీ కాస్త ముందుకి వస్తున్నాడు ‘దేవర’. సెప్టెంబరు 27న విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు. ముందుగా ప్రకటించిన మరో సినిమా సెప్టెంబరు 27న రాకపోవడంతో ఈ తేదీకి ‘దేవర’ రావడానికి రెడీ అయ్యాడట. కల్యాణ్‌రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, కె. హరికృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా జాన్వీ కపూర్ తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయం కానున్నారు.
పుష్పరాజ్... సీన్ రిపీట్
‘పుష్ప’ ఫ్రాంచైజీ తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’ 2021 డిసెంబరు 17న విడుదలై, మంచి విజయం సాధించింది. హీరో పుష్పరాజ్‌గా టైటిల్ రోల్ చేసిన అల్లు అర్జున్‌కి ఉత్తమ జాతీయ నటుడి అవార్డుని తెచ్చిపెట్టింది ఈ చిత్రం. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రష్మికా మందన్నా కథానాయిక. ఇక తొలి భాగం సాధించిన విజయంతో జోష్‌గా మలి భాగం ‘పుష్ప: ది రూల్’ను ఆరంభించారు. కొంత చిత్రీకరణ తర్వాత ఈ సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. కానీ అనుకున్న సమయానికి చిత్రీకరణ పూర్తి కాలేదు.
క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాలేక ‘పుష్ప: ది రూల్’ రిలీజ్‌ను ఆగస్టు 15 నుంచి డిసెంబరు 6కు వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. ‘పుష్ప: ది రైజ్’ను కూడా తొలుత 2021 ఆగస్టు 13న విడుదల చేయాలనుకున్నారు. కానీ డిసెంబరులో విడుదల చేశారు. అలాగే ‘పుష్ప 2: ది రూల్’ని 2024 ఆగస్టు 15న రిలీజ్ చేయాలనుకుని డిసెంబరు 6కి మార్చారు. తొలి భాగానికి జరిగిన సీన్ రిపీట్ అయింది. మైత్రీమూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
డబుల్ ఇస్మార్ట్ రెడీ
‘ఇస్మార్ట్ శంకర్’గా హీరో రామ్‌లోని మాస్ యాంగిల్‌ని ఓ రేంజ్‌లో చూపించారు దర్శకుడు పూరి జగన్నాథ్. ఈ చిత్రం 2019లో విడుదలై, సూపర్ హిట్‌గా నిలిచింది. ‘ఇస్మార్ట్ శంకర్’ కథలో సీక్వెల్‌కు స్కోప్ ఉండటంతో రామ్‌తోనే ‘డబుల్ ఇస్మార్ట్’ను ప్రకటించారు పూరి. ఈ సినిమా ప్రకటించిన రోజునే 2024 మార్చి 18న రిలీజ్ చేయనున్నట్లు కూడా వెల్లడించారు. కానీ విడుదల కాలేదు. ఆ తర్వాత జూలైలో విడుదల కావొచ్చనే ప్రచారం సాగింది. ఈ మూవీ చిత్రీకరణ అనుకున్నట్లుగా సాగలేదట. దీంతో ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాను ఆగస్టు 15న రిలీజ్‌కి రెడీ చేస్తున్నట్లుగా తాజాగా ప్రకటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మాతలు.
ముందుకు రానున్న లక్కీ భాస్కర్
‘మహానటి’, ‘సీతారామం’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్. ఈ హీరో ప్రస్తుతం చేస్తున్న సినిమా ‘లక్కీ భాస్కర్’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ‘లక్కీ భాస్కర్’ని సెప్టెంబరు 27న విడుదల చేస్తున్నట్లుగా ఇటీవల ప్రకటించారు. కానీ ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా అదే తేదీకి తెరపైకి రానుంది. ‘లక్కీ భాస్కర్’ సినిమా నిర్మాతల్లో ఒకరైన సూర్యదేవర నాగవంశీ ‘దేవర’ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను తీసుకున్నారట.
దీంతో ఒకే రోజు ఒకే బ్యానర్ నుంచి రెండు సినిమాల విడుదల ఎందుకని భావిస్తున్నారట నాగవంశీ. ఈ నేపథ్యంలో ‘లక్కీ భాస్కర్‌ను కాస్త ముందుగానే ఆగస్టులో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారని భోగట్టా. అయితే ఆగస్టు 15న ఇప్పటికే రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’, కీర్తీ సురేష్ ‘రఘుతాత’ సినిమాలు ఉన్నాయి. సో.. ‘లక్కీ భాస్కర్’ ఏ తేదీన వస్తాడో చూడాలి. ఇక దుల్కర్ సూపర్ హిట్ మూవీ ‘సీతారామం’ 2022 ఆగస్టు తొలివారంలో విడుదలైంది. ఈ సెంటిమెంట్‌ని అనుసరించి, ‘లక్కీ భాస్కర్’ని కూడా ఆగస్టు తొలి వారంలో రిలీజ్ చేస్తారా? అనే చర్చ కూడా జరుగుతోంది.
ఈ కోవలోనే మరికొన్ని సినిమాల రిలీజ్ డేట్‌లు ముందుకు, వెనక్కు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment