‘నా కాళ్లకు ప్రయాణ దాహం పట్టుకుంది’ అంటున్నారు యువ ఆర్టిస్ట్‌లు. ఆ ప్రయాణ అనుభవాలు వారి కళకు బలాన్ని ఇస్తున్నాయి. సమాజంతో కలిసి పనిచేయడానికి అవసరమైన స్ఫూర్తిని ఇస్తున్నాయి. పబ్లిక్ ఆర్ట్‌గా ప్రాచుర్యం ΄పొందిన ‘మ్యూరల్ ఆర్ట్’ ద్వారా మానసిక ఆరోగ్యం నుంచి మహిళాశక్తి వరకు ఎన్నో విషయాలను ప్రచారం చేస్తున్నారు. కార్టూన్‌లతో నవ్వించడమే కాదు ఆరోగ్య సమస్యల గురించి ఆలోచించేలా చేస్తున్నారు. కళకు సామాజిక ప్రయోజనాన్ని జోడించిన వారి క్రియేటివ్ జర్నీ గురించి....
ముంబైకి చెందిన మేఘకు మ్యూరల్ ఆర్ట్ అంటే ఎంత ఇష్టమో ప్రయాణాలు అంటే కూడా అంతే ఇష్టం. ఆ ప్రయాణాలలో ప్రకృతి అందాలను ఆస్వాదించడం అంటే ఇష్టం.ఆమె దృష్టిలో ప్రకృతి అనేది విశాలమైన కాన్వాస్. అస్సాంలోని పచ్చటి కొండల నుంచి జమ్మూ కశ్మీర్‌లోని తెల్లటి మంచుల కొండల వరకు నదుల జలకళ నుంచి ఎడారుల ఇసుక మెరుపుల వరకు ఎన్నో ప్రాంతాల అందాలను ఆస్వాదించింది.
తన కళకు ఇన్‌స్పిరేషన్ తాను వెళ్లిన ప్రాంతాలే. ‘ప్రయాణం అంటే ప్రతి రోజు ఒక కొత్త ఎనర్జీతో నిద్ర లేచే ఉత్సాహం. ఆ ఉత్సాహ శక్తి మన కళలో ప్రతి ఫలిస్తుంది’ అంటుంది మేఘ.మానసిక ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కలిగించడానికి తన మ్యూరల్ ఆర్ట్‌ను సాధనంగా వాడుకుంటుంది స్నేహ చక్రవర్తి. ‘మైండ్ అండ్ మ్యాటర్’ చారిటబుల్ ట్రస్టుతో కలిసి ‘ది ట్రావెల్ అండ్ పెయింట్: ఇండియా టూర్’ చేసింది. ఆల్ ఇండియా ఆర్ట్ టూర్‌లో ఎన్నో కొత్త విషయాలు తెలుసుకుంది. అట్టడుగు వర్గాల పిల్లలతో సంభాషించి వారితో స్నేహం చేసే అవకాశం వచ్చింది.
‘కళ’ అనేది మానసిక ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో విస్తృతంగా ప్రచారం చేస్తోంది స్నేహ చక్రవర్తి.తిరువనంతపురానికి చెందిన అమితకు చిన్నప్పటి నుంచి చిత్రకళ అంటే ఇష్టం. ప్రయాణాలు అంటే మరీ ఇష్టం. ‘మొదట్లో ప్రముఖ చిత్రకారుల ఆర్ట్‌వర్క్స్‌ను అనుసరిస్తూ ఆనందించేదాన్ని. అయితే అసలైన ఆనందం నాకు వివిధ ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడి ప్రజలతో మాట్లాడినప్పుడు దొరికింది. ఒక ప్రాంతానికి తనదైన అందాలు ఉన్నట్లే సమస్యలు కూడా ఉంటాయి. ఆ సమస్యలను నా కళ ద్వారా ప్రతిబింబించాలనుకుంటు న్నాను’ అంటుంది అమిత.
చిత్రకళకు సంబంధించి నిర్దిష్టమైన శైలికి పరిమితం కావడం అంటే అమితకు ఇష్టం లేదు. ఐడియాల విషయంలో ఔట్ ఆఫ్ బాక్స్ ఆలోచించడం ఆమెకు ఇష్టం. ‘యూనిక్ ఎక్స్‌ప్రెషన్’ను అమితంగా ఇష్టపడుతుంది.మేఘ, స్నేహ, అమితలుæమాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఎంతోమంది యువ కళాకారులు తమవైన కళారూపాలతో సమాజంతో కలిసి నడుస్తున్నారు. సామాజిక కళకు సై అంటున్నారు.
జస్ట్ లోకల్...
చెన్నైకి చెందిన పదహారుమంది యువ ఆర్టిస్ట్‌లు ఐశ్వర్య మణివణ్ణన్ మార్గదర్శకత్వంలో ‘లోకల్’ థీమ్‌తో వందకుపైగా కళారూపాలు ఆవిష్కరించారు. టెక్నాలజీపై అతిగా ఆధారపడడం వల్ల కోల్పోతున్నది ఏమిటో తెలియజేస్తాయి ఈ చిత్రాలు. సామాజిక మాధ్యమాల ద్వారా ఎక్కడో జరిగే సంఘటనల గురించి తెలుసుకునే మనం, సమీపంలోని వాటి గురించి మాత్రం తెలుసుకోలేము. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడో విషయాల గురించి అన ర్గళంగా చెప్పగలిగే వాళ్లలో చాలామందికి లోకల్ విషయాలలో అంతంత మాత్రమే అవగాహన ఉంటుంది.
‘తమ స్థానికతతో కళాకారులు మమేకం కావడానికి లోకల్ అనే థీమ్ ఉపయోగపడుతుంది’ అంటుంది ఐశ్వర్య. చెన్నైలోని వైబ్రెంట్ స్ట్రీట్ లైఫ్... అందులోని సాంస్కృతిక వైవిధ్యం అంటే ఐశ్వర్యకు ఇష్టం. తన స్టూడెంట్స్‌తో కలిసి నార్త్ చెన్నైలోని కాశిమేడుకు వెళ్లింది. గంభీరమైన సముద్రాన్ని చూసిన తరువాత స్టూడెంట్స్‌కు కొత్తప్రపంచంలోకి వచ్చినట్లు అనిపించింది. ఎంతోమంది జాలరులతో మాట్లాడారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది వారి ట్రాన్స్‌ఫర్‌మేటివ్ జర్నీ. అక్కడి దృశ్యాలు స్టూడెంట్స్ ముందున్న కాన్వాస్‌లోకి నడిచొచ్చాయి. సహజత్వాన్ని ప్రతిబింబించాయి.
ఈజ్ దట్ యూ?
‘టాలెంటెడ్ ఇలస్ట్రేటర్’గా చిన్న వయసులోనే పెద్ద పేరు తెచ్చుకుంది ముంబైకి చెందిన ప్రణిత కొచ్రేకర్. దైనందిన జీవిత దృశ్యాల నుంచి మానసిక ఒత్తిడి, ఆందోళన వరకు ఎన్నో అంశాలు ఆమె చిత్రాలకు థీమ్‌గా ఉంటాయి. ఊహల్లో నుంచి కాకుండా సొంత అనుభవాల్లో నుంచి చిత్రాలు వేయడం అంటే ప్రణితకు ఇష్టం.
‘కళకు సామాజిక ప్రయోజం ఉంది. అది శక్తిమంతమైన మాధ్యమం’ అంటున్న ప్రణిత తన కళ ద్వారా మానసిక ఆరోగ్యంపై అవగాహన తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. వివిధ సామాజిక మాధ్యమాలను తన కళకు వేదికగా ఉపయోగించుకుంటోంది.యాంగ్జయిటీ డిజార్డర్‌లపై ‘ఇజ్ దట్ యూ?’ టైటిల్‌తో వేసిన డ్రాయింగ్ సిరీస్‌కు మంచి స్పందన వచ్చింది. తన బొమ్మల ద్వారా నవ్వించడంతోపాటు ఆలోచించేలా చేయడం ప్రణిత ప్రత్యేకత.‘డా.ఇంటర్‌నెట్’ పేరుతో యాంగ్జయిటీని తగ్గించుకోవడానికి ఏంచేస్తే బాగుంటుందో చిత్రం చివర సలహా కూడా ఇస్తుంది ప్రణిత.
Comments
Please login to add a commentAdd a comment