సంక్షేమం కావాలా..? సంక్షోభం కావాలా? | Sakshi
Sakshi News home page

సంక్షేమం కావాలా..? సంక్షోభం కావాలా?

Published Sat, Nov 11 2023 4:24 AM

Minister Harish Rao Sensational Comments On Etela Rajender - Sakshi

హుజూరాబాద్‌: రాష్ట్రంలోని అన్నివర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కావాలో.. సంక్షోభం సృష్టించే పార్టీలు కావాలో ప్రజలే ఆలోచించాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట గాందీచౌక్‌ వద్ద జరిగిన ప్రజా ఆశీర్వాద సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సర్వేలన్నీ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కౌశిక్‌రెడ్డి గెలుస్తారని చెబుతున్నాయని అన్నారు.

ఇక హుజూరాబాద్‌లో జీ హుజూర్‌ రాజకీయాలు నడవయని పేర్కొన్నారు. గత ఉప ఎన్నికల్లో గట్టెక్కేందుకు ఈటల రాజేందర్‌ ఎన్నో మాయమాటలు చెప్పారని, దళితబంధు రాదని ఒక అపనమ్మకాన్ని సృష్టించారని ధ్వజమెత్తారు. హుజూరాబాద్‌లో 100 శాతం దళితబంధు అమలుచేసి చరిత్ర సృష్టించామని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలతో రాష్ట్రానికి ఒరిగేదేంలేదన్నారు. సౌభాగ్యలక్ష్మి పథకం కింద ప్రతీ మహిళకు నెలకు రూ.3 వేలు, అలాగే ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.15 లక్షలకు పెంచుతామని చెప్పారు. గ్యాస్‌ సిలిండర్‌ను రూ.400కు అందిస్తామని వివరించారు. కౌశిక్‌ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే హుజూరాబాద్‌ అభివృద్ధి బాధ్యత తనదే అని మంత్రి హామీ ఇచ్చారు. 

ఈటల మాటలు వింటే పదేళ్లు వెనక్కి 
హుజూరాబాద్‌ ప్రజలు ఈటల మాటలు వింటే అభివృద్ధిలో పదేళ్లు వెనకబడిపోతారని మంత్రి హరీశ్‌ పేర్కొన్నారు. గెలిచాక హుజూరాబాద్‌ను విడిచిపెట్టి వెళ్లారని విమర్శించారు. ఈసారి హుజూరాబాద్, గజ్వేల్‌లో ఈటల ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. ఢిల్లీ నాయకులను హుజూరాబాద్‌కు తీసుకొస్తున్న ఈటల.. వారితో ఈ నియోజకవర్గానికి ఒరిగే ప్రయోజనం ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. దమ్ముంటే ఉప్పల్‌ రైల్వే ఓవర్‌బ్రిడ్జిని వెంటనే పూర్తి చేయించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, టూరిజం డెవలప్‌మెంట్‌ సంస్థ చైర్మన్‌ గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement