30న రాష్ట్రానికి మోదీ.. | Sakshi
Sakshi News home page

30న రాష్ట్రానికి మోదీ..

Published Thu, Apr 25 2024 2:02 PM

Modi to the state on 30

జహీరాబాద్, మెదక్‌ లోక్‌సభ స్థానాల పరిధిలో ప్రచారం 

ఆందోల్‌ పరిధిలోని సుల్తాన్‌పూర్‌లో బహిరంగ సభ పాల్గొననున్న ప్రధాని 

వచ్చే నెల 3, 4 తేదీల్లో మరో నాలుగు సభల్లో పాల్గొనే అవకాశం 

చివరిగా హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలో ప్రధాని మోదీ వరుసగా పర్యటించనున్నారు. ఈ నెల 30వ తేదీ నుంచి మే 11 వరకు నాలుగైదు సభల్లో మోదీ పాల్గొననున్నట్టు బీజేపీ నేతలు వెల్లడించారు. అయితే తుది షెడ్యూల్‌ ఖరారు కావాల్సి ఉందని తెలిపారు. ఈ నెల 30న బీజేపీ జహీరాబాద్‌ అభ్యర్థి బీబీ పాటిల్, మెదక్‌ అభ్యర్థి రఘునందన్‌రావులకు మద్దతుగా మోదీ ప్రచారం చేయనున్నారు.

ఈ రెండింటినీ కవర్‌ చేసేలా ఆందోల్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌లోని సుల్తాన్‌పూర్‌లో 30న మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ సభ నిర్వహించనున్నారు. అదేరోజున సాయంత్రం శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో ఐటీ ప్రొఫెషనల్స్‌తో మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశాలు ఉన్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. 

మే 3, 4 తేదీల్లో.. 
ప్రధాని మోదీ మే 3వ తేదీన వరంగల్‌ లోక్‌సభ పరిధిలో ఒక సభలో.. భువనగిరి, నల్లగొండ లోక్‌సభ స్థానాల్లోని మరోచోట నిర్వహించే సభలో పాల్గొంటారని బీజేపీ వర్గాలు తెలిపాయి. 4వ తేదీన మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానం పరిధిలోని నారాయణపేటలో.. చేవెళ్ల లోక్‌సభ పరిధిలోని వికారాబాద్‌లో నిర్వహించే సభల్లో పాల్గొనే అవకాశం ఉందని వెల్లడించాయి.

ఈ సందర్భంగా వికారాబాద్‌ అనంతగిరిలోని అనంత పద్మనాభస్వామి ఆలయాన్ని ప్రధాని సందర్శించవచ్చని తెలిపాయి. ఇక చివరిగా గ్రేటర్‌ హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల పరిధిలోని నాలుగైదు ఎంపీ స్థానాలను కవర్‌ చేసేలా.. మే 11వ తేదీలోగా పరేడ్‌గ్రౌండ్స్‌లో లేదా నగర శివార్లలో మోదీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ఉంటుందని సమాచారం. అయితే ఆయా తేదీల్లో ప్రధాని పర్యటన ఇంకా పూర్తిగా ఖరారు కావాల్సి ఉందని పార్టీ నేతలు చెప్తున్నారు. 

నేడు సిద్దిపేట సభకు అమిత్‌ షా.. 
బీజేపీ గురువారం మధ్యాహ్నం 12 గంటలకు సిద్దిపేటలో నిర్వహించనున్న బహిరంగసభలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పాల్గొననున్నారు. మెదక్‌ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు మద్దతు గా ఆయన ప్రచారం చేస్తారు. గురువారం నామినేష న్ల దాఖలుకు చివరిరోజు కావడంతో పలువురు బీజే పీ అభ్యర్థులు మరో సెట్‌ నామినేషన్లు దాఖలు చేయ నున్నారు.

కరీంనగర్‌లో ఎంపీ అభ్యర్థి బండి సంజ య్, నాగర్‌కర్నూల్‌లో ఎంపీ అభ్యర్థి భరత్‌ ప్రసాద్‌ల నామినేషన్‌ కార్యక్రమాల్లో గుజరాత్‌ సీఎం భూపేందర్‌ పటేల్, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి పాల్గొననున్నారు. నిజామాబాద్‌లో ఎంపీ అభ్యర్థి ధర్మపురి అ ర్వింద్‌ నామినేషన్‌ ర్యాలీలో ఉత్తరాఖండ్‌ సీఎం పు ష్కర్‌ సింగ్‌ ధామి , ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ పాల్గొంటారు.

వరంగల్‌లో ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేశ్‌ నామినేషన్‌ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి పాల్గొంటారు. పెద్దపల్లిలో ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్‌ నామినేషన్‌ ర్యాలీలో బీజేపీఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు పాల్గొంటారు.  

Advertisement
Advertisement