సోషల్‌ మీడియాలో కనపడని పార్టీల సైన్యం! | Sakshi
Sakshi News home page

సోషల్‌ మీడియాలో కనపడని పార్టీల సైన్యం!

Published Thu, Oct 12 2023 5:11 AM

Show of strength of parties on social media - Sakshi

ఒకప్పుడు.. ఎన్నికల ప్రచారమంటే ఊరూరా పార్టీలు, నాయకుల ర్యాలీలు.. మైకులలో హోరెత్తే ప్రసంగాలు.. ప్రచార పాటలతో తిరిగే వాహనాలు మాత్రమే అన్నట్టుండేది. ప్రతి పార్టీకి, అభ్యర్థికి వారి మద్దతుదారులే ప్రచార సేనగా ఉండేవారు. కానీ ప్రస్తుత డిజిటల్‌ యుగంలో ఎన్నికల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. సోషల్‌ మీడియా సైన్యం ఎన్నికల కదనంలో తెరవెనుక ఉంటూ కనిపించని యుద్ధం చేస్తోంది.

ఓటర్లపై దీని ప్రభావం ఎక్కువే ఉంటుండటంతో.. ప్రతి పార్టీ ప్రత్యేకంగా తమకంటూ ఓ సోషల్‌ మీడియా వింగ్‌ను ఏర్పాటు చేసుకుంది. కొన్ని పార్టీల నేతలు, కొత్తగా ఎన్నికల్లో పోటీలో దిగుతున్నవారు కూడా సైతం ఎవరికి వారు సొంతంగా సోషల్‌  టీంలను పెట్టుకుంటున్నారు. ఎన్నికల నేపథ్యంలో సోషల్‌ మీడియా ప్రచారం ఎలా ఉండబోతోంది, సాంకేతికంగా దీని వెనుకదాగున్న అంశాలపై కథనం..  – సాక్షి , హైదరాబాద్‌

‘సోషల్‌’ప్రచారం.. ఎందులో ఎలా? 
ఫేస్‌బుక్‌లో ప్రత్యేక పేజీలు, ఖాతాలు సృష్టించి ప్రమోషన్‌.. ఇన్‌స్టాగ్రాంలో రీల్స్‌ ద్వారా..  ట్విట్టర్‌ (ఎక్స్‌)లో హ్యాష్‌ట్యాగ్‌ల ద్వారా.. యూట్యూబ్‌ చానల్స్‌లో ఎక్కువ లైక్స్, వ్యూస్‌ వచ్చేలా చేయడం. 

సోషల్‌ మీడియా వాడకం సూక్ష్మంగాఇలా.. 
కంటెంట్‌ క్రియేషన్‌ 
 కంటెంట్‌ ప్రమోషన్‌ అండ్‌ ట్రెండింగ్‌ 
సోషల్‌ మీడియా సెంటిమెంట్‌ అనాలసిస్‌ 
కంటెంట్‌ క్రియేషన్‌.. కంటెంట్‌ రైటర్లు..

కంటెంట్‌ క్రియేషన్‌.. కంటెంట్‌ రైటర్లు..  
సోషల్‌ మీడియాలో మంచి ప్రచారం పొందాలంటే ఓటర్లను ఆకట్టుకునేలా, ఆలోచింపజేసేలా.. అనుకూల ఓటరుగా మార్చేలా వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు, వీడియో, ఆడియో సందేశాలు ఉండాలి. ఇందుకే అన్ని రాజకీయ పార్టీలు కంటెంట్‌ రైటర్లను, క్రియేటర్లను నియమించుకుంటున్నాయి. నేతలు కూడా వ్యక్తిగత సోషల్‌ మీడియా టీంలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆ కంటెంట్‌ క్రియేటర్లు రోజువారీగా వారికి ఇచ్చిన టార్గెట్‌ నియోజకవర్గ పరిధిలోని సమస్యలు, సదరు రాజకీయ పార్టీ లేదా పోటీలో ఉన్న నాయకుడి గురించిన సానుకూల అంశాలు.. ప్రత్యర్థి పార్టీ, అభ్యర్థుల బలహీనతలపై విమర్శలతో కంటెంట్‌ను రాసి ఇస్తూ ఉంటారు.

కంటెంట్‌ ప్రమోషన్‌ అండ్‌ ట్రెండింగ్‌.. 
కంటెంట్‌ రైటర్ల ద్వారా తీసుకున్న అంశాలతో తయారు చేసిన కథనాలు, ఆడియోలు, వీడియోలు, ఫొటోలను టార్గెట్‌గా పెట్టుకున్న అసెంబ్లీ సెగ్మెంట్‌, జిల్లా లేదా రాష్ట్రం మొత్తంగా ఓటర్లకు వివిధ రకాల సోషల్‌ మీడియా వేదికల ద్వారా చేర్చడమే కంటెంట్‌ ప్రమోషన్‌. ఇందుకోసం కంటెంట్‌ ప్రమోటర్లు తొలుత ఆ రాజకీయపార్టీ, నేతల పేరిట ఫేస్‌బుక్, ట్విట్టర్‌ (ఎక్స్‌), ఇన్‌స్ట్రాగామ్, యూట్యూబ్‌ చానళ్లు, వాట్సాప్‌ గ్రూపులు, చానళ్లు వంటివి సృష్టిస్తారు.

సోషల్‌ మీడియా సెంటిమెంట్‌ అనాలసిస్‌
సోషల్‌ మీడియా అనేది బయటికి కనిపించని డిజిటల్‌ ప్రపంచం. అందులో మనం పోస్ట్‌ చేస్తున్న, వైరల్‌ చేస్తున్న కంటెంట్‌ను, వీడియోలు, ఫొటోలు, సమాచారం, ఆడియో మెసేజ్‌లు ఎంత వరకు టార్గెట్‌ ఓటర్లకు చేరుతుంది. ఒకవేళ చేరకపోతే ఎందుకు చేరడం లేదు? టార్గెట్‌ ఓటర్‌ను ఆకర్షించేలా ప్రత్యర్థి పార్టీలు ఎలాంటి ప్రమోషన్‌ చేస్తున్నాయి? వాటిని కౌంటర్‌ చేయాలంటే ఎలాంటి మార్పులు చేసుకోవాలన్న అంశాలను విశ్లేషించడాన్నే స్థూలంగా సోషల్‌ మీడియా సెంటిమెంట్‌ అనాలసిస్‌గా చెప్పొచ్చు. దీని ఫీడ్‌బ్యాక్‌ను ఆధారంగా కంటెంట్‌లో ఎలాంటి మార్పులు చేయాలనేది కంటెంట్‌ రైటర్లకు సూచనలు చేస్తున్నారు. కేవలం సోషల్‌ మీడియాలో అంశాలనే కాకుండా క్షేత్రస్థాయిలో సర్వేలు చేసి ప్రజల నాడి తెలుసుకోవడం కూడా ఈ సోషల్‌ మీడియా సెంటిమెంట్‌ అనాలసిస్‌ టీమ్‌ల పనిగా చెప్పొచ్చు.  

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో సోషల్‌ మీడియాతో.. 
భారత సంతతికి చెందిన వివేక్‌ రామస్వామి అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్‌ పార్టీ తరఫున పోటీపడటం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆన్‌లైన్‌ డిబేట్లు, సోషల్‌ మీడియాలో గట్టి ప్రచారంతో ఆయన ముందంజలో నిలుస్తున్నారని అక్కడి రాజకీయ విశ్లేషకులు ఇప్పటికే పేర్కొన్నారు. సోషల్‌ మీడియాలో ప్రచారం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరింత ప్రభావం చూపనుందని అంచనా వేస్తున్నారు. 

హ్యాకింగ్‌ టీమ్‌లతో గుట్టు తెలుసుకుంటూ.. 
పలు రాజకీయ పార్టీలు ప్రత్యర్థి పార్టీలు, నేతల వ్యూహాలను తెలుసుకోవడం కోసం సైబర్‌ హ్యాకింగ్‌ నిపుణుల సేవలనూ వాడుకుంటున్నారు. సోషల్‌ మీడియా పెనెట్రేటింగ్‌ టూల్స్‌ను వినియోగించి.. కీలక వివరాలు సేకరించి, తమకు అనుకూలంగా, ప్రత్యర్థులకు వ్యతిరేకంగా వినియోగిస్తున్నారు. 

ప్రచార ట్రెండ్‌ మారింది.. 
తక్కువ సమయంలో ఎక్కువ మంది ఓటర్లను చేరేందుకు సోషల్‌ మీడియా అనేది రాజకీయ పార్టీలకు, నేతలకు అస్త్రంగా మారింది. ఓటర్లకు మన బలాన్ని చెప్పడంతోపాటు ఎదుటి వ్యక్తి బలహీనతలపై ఓటర్లను ఆలోచింపజేసేలా ఈ డిజిటల్‌ ప్రచారం ఉపయోగపడుతోంది. పార్టీలే కాదు అభ్యర్థులు సైతం సొంతంగా సోషల్‌ మీడియా ప్రచార టీమ్‌లను ఏర్పాటు చేసుకుంటున్నారు.

వాట్సాప్‌ చానల్‌.. నయా ట్రెండ్‌.. 
స్మార్ట్‌ఫోన్‌ ఉండి, ఇంటర్నెట్‌ వాడే ఉన్న ప్రతి ఒక్కరూ వాడుతున్న సోషల్‌ మీడియా యాప్‌ అంటే వాట్సాప్‌ అని టక్కున చెప్పేయొచ్చు. ఇందులో ఇటీవల జతచేసిన సరికొత్త చానల్‌ ఫీచర్‌ సైతం ఎన్నికల వేళ అభ్యర్థులకు, ఆయా పార్టీలకు బాగా ఉపయోగపడుతోంది. ఈ వాట్సాప్‌ చానల్‌ ట్రెండ్‌ బాగా పెరుగుతోంది. వాట్సాప్‌ చానల్‌లో సదరు పార్టీలు, నాయకులు తమ కంటెంట్‌ను వైరల్‌ చేస్తూ ఓటర్లకు చేరుతున్నారు. ఇది కూడాకంటెంట్‌ ప్రమోషన్‌గా చెప్పొచ్చు.  

ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండ్స్‌.. 
టిక్‌టాక్‌ వీడియోలు, హెల్త్, యోగా, ఫ్యాషన్‌ ఇలా పలు అంశాలపై సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఇన్‌ఫ్లూయెన్సర్ల (సోషల్‌ మీడియాలో ప్రభావవంతమైన వ్యక్తులు)కు డబ్బు చెల్లించి ఒప్పందం చేసుకోవడం ద్వారా సోషల్‌ మీడియాలో ప్రచారం చేయడం మరో విధానం. మనం చెప్పదలచుకున్న అంశాలపై వీడియోలు, లింక్‌లు ఇస్తే.. వాటిని లక్షల్లో ఫాలోవర్స్‌ ఉన్న సోషల్‌ మీడి­యా ఇన్‌ఫ్లూయెన్సర్లు తమ సోషల్‌ మీడియా ఖాతాల్లో వాటిని షేర్‌ చేస్తారు. ఇందులో ఇన్‌ఫ్లూయెన్సర్ల ఫాలోవర్స్‌కు సదరు రాజకీయ పార్టీ లేదా నేత కంటెంట్‌ను చేర్చుతున్నారు. 

ఒక్కో చోట..ఒక్కోలా..
ఫేస్‌బుక్‌లో  పార్టీ లేదా నాయకుడి కంటెంట్, ఆడియోలు, వీడియోలు, ఫొటోలు ఓటర్లకు చేరాలనుకుంటే అధికారికంగానే ఫేస్‌బుక్‌ యాడ్‌ సెన్స్‌లో ప్రమోషన్‌కు కొంత డబ్బులు చెల్లిస్తే చాలు. స్పాన్సర్డ్‌ ప్రకటనలు వైరల్‌ అవుతాయి. ఇందుకోసం మనం ఇచ్చిన వివరాలతో ఫేస్‌బుక్‌ ఓ జియోఫెన్సింగ్‌ క్రియేట్‌ చేస్తుంది. దాని ఆధారంగా ఈ కంటెంట్‌ వెళ్లేలా చేస్తారు. 

 గూగుల్‌ యాడ్‌ సెన్స్‌లోనూ డబ్బులు చెల్లిస్తే.. ఫేస్‌బుక్‌ లింక్, యూట్యూబ్‌ లింక్, ఇన్‌స్ట్రాగామ్‌ లింక్‌ అందులో షేర్‌ చేస్తారు. ఇలా కూడా కంటెంట్‌ ప్రమోషన్‌ చేస్తున్నారు. గూగుల్‌లోకి వెళ్లి సెర్చ్‌ చేయగానే మనం ప్రమోట్‌ చేయాలనుకున్న లింక్‌లు హైలెట్‌ అయ్యేలా చేయడమే గూగుల్‌ యాడ్‌ సెన్స్‌.  

Advertisement
Advertisement